1980-90 దశకాల తెలుగు సాహిత్యంలో విభిన్న సాహిత్య సృజన చేసిన అతి కొద్దిమంది రచయితల్లో కె. సదాశివరావు ఒకరు. ఆయన తను రాసిన కథ / కవిత్వ / సైన్సఫిక్షన్ సాహిత్యాన్ని వరసగా ఆత్మాఫాక్టర్‌ (సైన్సఫిక్షన కథలు), క్రాస్‌ రోడ్స్‌ (కథలు), కావ్యకళ (అనువాద కవితలు) అనే మూడు సంకలనాలుగా వెలువరించారు.
 
శాస్త్రీయ వాస్తవికత ఆధునిక మానవుడిలో రేకెత్తించిన భవిష్యత చింతనను... ఆసక్తిగా చదివించే కథన చాతుర్యంతో ‘ఆత్మాఫాక్టర్‌’లోని పద్నాలుగు కథల్లో బహుముఖంగా ఆవిష్కరించారు రచయిత. అదుపులేని శాసీ్త్రయత సృష్టిస్తున్న అభద్రతలకు ఊహను జతచేసి భవిష్యత వ్యవస్థలు భవిష్యత మానవుణ్ణి అదుపుచేయబోయే విధానాల గురించి అంతర్లీనంగా వివరిస్తారీ కథల్లో. వలస పాలనకూ, దానికి ముందున్న భారతీయ వ్యక్తిత్వానికీ మధ్య జరిగిన సంఘర్షణ ఫలితంగా మధ్య, పైతరగతుల వ్యక్తిత్వాల్లో రూపొందిన సామాజిక వాన్తవికతను ‘క్రాస్‌రోడ్స్‌’ కథా సంపుటంలోని పదకొండు కథలు అత్యంత ప్రతిభావంతంగా చిత్రీకరించాయి. తాత్వికత / అంతర్జాతీయత / స్థానికత అంతా కలిసిపోయి ఏర్పడిన ఒక వలస కాలానంతర స్థితిని అర్థం చేయించే కథలివి.
 
సదాశివరావు కథల్ని సంగీత, సాహిత్య, సాంఘిక శాస్త్రాల ఫ్యూజన అని చెప్పవచ్చు. పెరిగిపోయిన ‘వ్యాస అంశ’ మూలంగా కొన్ని కథల్లో కథాగమనం మందగించినప్పటికీ ఈ తరహా కథా ప్రక్రియ తెలుగు సాహిత్యంలో అరుదైనది. మేరీషెల్లీ నుంచి హారుకీ మూరకామీ వరకు పదిమంది అంతర్జాతీయ సైన్సఫిక్షన రచయితల జీవితాలను, రచనలను అనేక ఆసక్తికర సంఘటనలతో వివరించిన వికీపీడియా తరహా వ్యాసాలు ప్రపంచ సైన్సఫిక్షన రచనా పరిణామక్రమాన్ని విహంగ వీక్షణం చేయిస్తాయి. ఇవి ‘ఆత్మాఫాక్టర్‌’ చివర్లో ఉన్నాయి. భవిష్యత శాసీ్త్రయ వాస్తవికతను అత్యంత సృజనాత్మకంగా, ఊహాత్మకంగా, భ్రమాత్మకంగా దర్శింపజేస్తూ పాఠకుడి ఊహా తృష్ణను సంతృప్తిపరుస్తాయి ఇందులోని కథలన్నీ.
 

పదిహేను దేశాల తాలూకు 69 అనువాద కవితల సంకలనం ‘కావ్యకళ’. ఇందులో స్పానిష్‌, జర్మన, ఫ్రెంచ, ఆఫ్రికన, హంగేరియన, క్యూబన, రష్యన తదితర దేశాల కవితలున్నాయి. ప్రపంచ కవిత్వంలోని తాత్వికతనూ, గాఢతనూ మనకు పరిచయం చేస్తాయి ఈ కవితలు. అలాగే మన ఖండానికి అంతగా పరిచయం లేని సైన్సఫిక్షన ఎపిక్‌ కవితా ప్రక్రియకు సంబంధించిన నాలుగు ఆసక్తికర వ్యాసాలూ చదవదగినవే. ప్రధాన స్రవంతి రచనలకు భిన్నంగా నడిచే సదాశివరావు రచనలు ఒక తరహా పాఠకులను అద్భుతంగా ఆకర్షిస్తాయి. 

- లెనిన్ ధనిశెట్టి
ఆత్మాఫాక్టర్‌, పేజీలు : 480, వెల : రూ.250 
క్రాస్‌ రోడ్స్‌ పేజీలు : 152, వెల : రూ.75 
కావ్యకళ, పేజీలు : 308, వెల : రూ.150 
రచన : కె. సదాశివరావు, ప్రతులకు : 0866-2436643