అణచివేతను ప్రశ్నించిన కథలు

దేశంలో అమల్లో ఉన్న న్యాయ, శాసన, కార్యనిర్వాహణ, మత వ్యవస్థలు సమాజంలో సృష్టిస్తున్న సామాజిక అల్లకల్లోల సంక్షోభాన్ని సూటిగా సుత్తి లేకుండా స్పష్టంగా చెబుతాయి షేక్‌ హుసేన్‌ సత్యాగ్ని రాసిన ‘సత్యాగ్ని’ కథలు. రాజ్య జనిత నిత్యజీవిత సంక్షోభాల నుండీ, క్షోభల నుండీ ఆవిర్భవించిన ఈ కథలన్నీ వివిధ సామాజిక పరిస్థితులలో, సందర్భాలలో మానవ ఉద్వేగాలనూ, ప్రవర్తననూ, మనస్తత్వాన్నీ ఆసక్తికరంగా వివరిస్తాయి. 

ముఖ్యంగా ముస్లిం మత వ్యవస్థలోని ఆచార సంప్రదాయాల మూలంగా అణచివేతకు గురవుతున్న ముస్లిం స్త్రీల దైన్యాన్ని, నిస్సహాయతను, హింసను ‘నాదిరా’ వంటి కథలు ప్రతిభావంతంగా చిత్రించాయి. మత సమాజంలోని పేదరికాన్ని, దాచేస్తే దాగని క్రౌర్యాన్ని క్లుప్తంగా, పొందికైన మాటలతో వ్యక్తీకరించడం ఈ కథల ప్రత్యేకత. పాచికలు, యంత్రం, హలాలా, నూరు రూపాయలు, దొంగలు, వినిపించని ఏడుపు - తదితర కథలు చదివించడమే కాదు ఆలోచింపజేస్తాయి కూడా. వాదాలు ఉద్యమాల చట్రంలో ఒదగని ఈ కథలు స్వేచ్ఛగా ఆయా అంశాలలోని సత్యాన్ని, వాస్తవాన్ని ఉద్వేగంగా వ్యక్తీకరిస్తాయి.

- డి. లెనిన్‌సత్యాగ్ని కథలు - షేక్‌ హుసేన్‌ సత్యాగ్నిపేజీలు: 173, వెల: 120/-, ప్రతులకు: 9866040810 ; ప్రముఖ పుస్తక కేంద్రాలు.