షెర్లాక్ హోమ్స్ నాలుగు పుస్తకాలు
శతాబ్దం గడిచినా ఇప్పటికీ పాఠకులను ఆసక్తికరంగా చదివించే ఆర్ధర్ కానన్డయల్ కాల్పనిక నేర పరిశోధనా గాథలు ‘అడ్వెంచర్స్ ఆఫ్ షెర్లాక్ హోమ్స్’. ఇవి ఇప్పుడు 4 సంపుటాలుగా తెలుగులోకి వచ్చాయి. ఆంగ్లంలోని ‘అడ్వెంచర్స్ ఆఫ్ షెర్లాక్ హోమ్స్’లోని 12 కథల్ని తెలుగులో రెండు సంపుటాలుగా తీసుకురావడంతో పాటు షెర్లాక్ హోమ్స్ రెండు పరిశోధనలు, ‘ద సైన్ ఆఫ్ ఫోర్’, ‘ఎ స్టడీ ఇన్ స్కార్లెట్’లు అదే పేరుతో మరో రెండు పుస్తకాలుగా తెచ్చారు. కులీనుల పాలనలోని యూరప్‌లో సామాజిక న్యాయానికి చిహ్నంగా షెర్లాక్ హోమ్స్ పాత్రను కానన్డయల్ తీర్చిదిద్దాడనీ, ఆ అంశమే అనేకానేక తృతీయ ప్రపంచ దేశాల్లోని పాఠకులను ఆకర్షించి అవి ప్రజాదరణ పొందడానికి కారణమైందని ఆంగ్ల విమర్శకుల అంచనా. ఎ స్కాండల్ ఇన్ బొహీమియా, మచ్చల మెడపట్టీ, బ్లూ కార్బంకల్, ఎర్రతలల సంఘం వంటి ప్రపంచవ్యాప్తంగా పాఠకుల అభిమానం చూరగొన్న కథలూ ఇందులో ఉన్నాయి. నిజానికి షెర్లాక్ హోమ్స్ కథలన్నీ పారిశ్రామిక విప్లవ ఫలితంగా జరిగిన ఘటనలే, హోమ్స్ మిత్రుడు వాట్సన్ చెప్పే ఈ కథలన్నీ ప్రథమ పురుషలో సునిశిత హాస్యంతో అనేక మలుపులు తిరుగుతూ ఆసక్తిగా చదివిస్తాయి. అలాగే హోమ్స్ పాత్ర మొదటిసారి ప్రత్యక్షమయ్యే ‘ఎ స్టడీ ఇన్ స్కార్లెట్’ ఒక డిటెక్టివ్ భూతద్దాన్ని పరిశోధనలకు వాడడాన్ని మొట్టమొదటిగా చెప్పిన నవల. దక్షిణ లండన్‌లో జరిగిన హత్య తాలూకు పరిశోధన ‘ద సైన్ ఆఫ్ ఫోర్’. దీని మూలాలు భారతదేశంలోని ఈస్ట్ ఇండియా కంపెనీ, 1857 తిరుగుబాటు దాకా రావడం ఆసక్తి కలిగిస్తాయి. కె.బి. గోపాలం అనువాదం సాఫీగా సాగింది. అన్ని కాలాలలో అన్ని తరాలనూ ఆకట్టుకొంటున్న పుస్తకాలివి.
- డి. లెనిన్
అడ్వెంచర్స్ ఆఫ్ షెర్లాక్ హోమ్స్-1, పేజీలు : 206, వెల : రూ.100
అడ్వెంచర్స్ ఆఫ్ షెర్లాక్ హోమ్స్-2, పేజీలు : 220, వెల : రూ.100
ద సైన్ ఆఫ్ ఫోర్, పేజీలు : 166, వెల : రూ.100
ఎ స్టడీ ఇన్ స్కార్లెట్, పేజీలు : 164, వెల : రూ.100
మూలం : సర్ ఆర్ధర్ కానన్డయల్, అనువాదం: కె.బి. గోపాలం
ప్రతులకు : క్రియేటివ్ లింక్స్, హైదరాబాద్ సెల్ : 98480 65658