ప్రముఖ రచయిత, కవి, అనువాదకులు డాక్టర్‌ లంకా శివరామప్రసాద్‌. వృత్తిరీత్యా కార్డియో థొరాసిక్‌–వాస్క్యులర్‌ సర్జన్‌. తెలుగు, ఆంగ్ల సాహిత్యాలలో అపారమైన విజ్ఞానాన్ని సమకూర్చుకున్న రచయిత. ఆంగ్లభాషలోంచి లెక్కకు మిక్కిలిగా గొప్ప గొప్ప చారిత్రక రచనలను, ప్రముఖ రచనలను తెలుగులోకి అనువదించిన ఘనత దక్కించుకున్నారు. పదిమందికిపైగా సమకాలీన కవుల అనువాదాలు, రెండు నవలలు, ఇరవై చిన్న కథలు, వందలాది వ్యాసాలు, సైన్స్‌, మెడిసిన్‌, కలల విశ్లేషణపై అనేక పుస్తకాలు రాశారాయన. ఆయన రచించిన పుస్తకాల సంఖ్య ఇప్పటికే 120కు దాటిపోయింది. ఆయన కవిత్వం గ్రీకు, స్పానిష్‌, అరబిక్‌, హిందీ, తమిళ్‌, కన్నడసహా అనేక భాషల్లోకి అనువాదమయ్యాయి. 

ఈ తాజా పుస్తకంలో, సమ్మక్క–సారక్క చరిత్ర ఆధారంగా ‘కుంకుమ భరిణె’ పేరిట ఆ కథను 24శీర్షికల్లో మనకు అందించారు. 12వ ‍శతాబ్దంలో ఏటూరు నాగారం అరణ్యంలో మేడారం వద్ద పులులమధ్య, సర్పాల నీడలో గిరిజన నాయకులకు దొరికిన నవజాత శిశువు సమ్మక్క జీవితకథ, సాహసగాథే ఈ కథ. రెండేళ్ళకోసారి మేడారంలో జరిగే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గిరిజన జాతర నేపథ్యాన్ని వివరించే కథే ఇది. పేజీ పేజీకీ లంక అపూర్వ వేసిన అద్భుతమైన చిత్రాలతో సమ్మక్క చరిత్రకు కొత్తసొబగులద్దారు శివరామప్రసాద్‌.

 

కుంకుమ భరిణె
(THE CASKET OF VERMILION)
(సమ్మక్క–సారక్క చరిత్ర ఆధారంగా )
డాక్టర్‌ లంకా శివరామప్రసాద్‌ 
ధర : అమూల్యం, పేజీలు : 124
ప్రతులకు : రచయిత, శ్రీజనలోకం/రైటర్స్‌ కార్నర్‌, ప్రశాంతి హాస్పిటల్, శివనగర్‌, వరంగల్‌–02 మొబైల్‌ 88 978 49 442