వానొచ్చింది.. గుండె తడిసింది!

అనేకానేక సమకాలీన రాజకీయ ఆర్థిక సామాజిక కారణాల మూలంగా తెలుగు కవుల అస్తిత్వాంతరంగంలో క్రమక్రమంగా పెరిగిపోతున్న ఒంటరితనమూ, నిర్లిప్త ఏకాంతికతను కవిత్వ రూపంలో ఉంచిన ఒక ప్రాంత నాస్టాల్జిక్‌ పదవాక్యాల సమూహం నారాయణస్వామి ‘వానొస్తద?’ కవిత్వం. తన జీవితానుభవంలోని విశాల ప్రాపంచిక వాస్తవికత తాలూకు సందేహాలూ, స్వప్నాలూ, సంయోగ వియోగాలను కవి తన ఊరి భాషలో, యాసలో కవిత్వీకరించడం ఈ నలభై రెండు కవితల పుస్తకం ప్రత్యేకత.

అడియాశలవుతున్న ఆశలూ, అసంతృప్త గతమూ, అనాధీన భవిష్యత్తూ, వర్తమానపు నైరాశ్యం, తన ఉనికిని తాను నిర్ణయించలేని అభద్రత, ఆశల అశక్తతా ఈ కవితల నేపథ్యపు గాఢతాత్వికత. కాలం చెల్లిన (?) ఫ్రాయిడియన్‌ పరిభాషలో తల్లినీ, తల్లిప్రేమనూ నిర్విరామంగా అనేక సంఘటనల అనుభవాల నేపథ్యంలో అన్వేషించాడు కవి. గత రెండు, మూడు దశాబ్దాలుగా తెలుగు నేలను కమ్ముకొన్న విప్లవ, దళిత ఉద్యమాల మాండలికపు సొంత అస్థిత్వంలోంచి వ్యక్తం చేసిన కవితలివి.

కవిత్వంపై చాలాకాలం తర్వాత కె. శ్రీనివాస్‌ రాసిన ముందుమాట ‘లోన కురిసే వాన’ తప్పకుండా చదవదగ్గది.

- లెనిన్‌ ధనిశెట్టి
వానొస్తద?, నారాయణస్వామి
పేజీలు : 186, వెల : రూ.150, ప్రతులకు : నవచేతన, నవోదయ, www.kinege.com