బెంగుళూరులో పతాక సన్నివేశాలు

ఈ సినిమాలోని పతాక సన్నివేశాలు తొమ్మిది రోజులపాటు బెంగుళూరు ప్యాలెస్‌లో చిత్రీకరించాం. చిత్రంలోని ముఖ్యతారాగణంతో పాటు వందలాది జూనియర్ ఆర్టిస్టులు, 25 మంది ఫైటర్లు.. అబ్బో గోలగోలగా ఉండేది. మూడు కెమెరాలతో ఈ సన్నివేశాలను చిత్రీకరించాం. ఒకపక్క ‘కంచుకాగడా’ షూటింగ్ జరుగుతుంటే మరోపక్క కృష్ణగారు, శోభన్‌బాబు నటించే మల్టీ స్టారర్ ‘మహాసంగ్రామం’ కూడా నిర్మాణంలో ఉండేది. రెండూ భారీ చిత్రాలే. దాంతో ఒకదాన్నిమించి మరొకటి ఉండాలని నిర్మాతలు రామలింగేశ్వరరావు గారు, తిరుపతిరెడ్డిగారు ఖర్చు విషయంలో పోటీ పడేవారు. ఈ రెండు చిత్రాలకూ నేను దర్శకుడిని. అందుకే కృష్ణగారి అభిమానులు రెండు సినిమాలూ హిట్ కావాలని నాకు పదేపదే ఫోన్లు చేసేవారు. ఆ రోజుల్లో నాకు బొత్తిగా టైమ్ ఉండేది కాదు. పగలంతా షూటింగ్. రాత్రిళ్లు పాటల రికార్డింగ్స్. రాత్రి ఒంటిగంటకు మొదలుపెట్టి తెల్లారి ఐదు గంటల వరకూ రికార్డింగ్ చేసేవాళ్లం. ఇంటికి వచ్చి ఓ గంటో, రెండు గంటలో పడుకుని మళ్లీ షూటింగ్‌కు పరుగెత్తేవాడిని. అంత బిజీగా ఉండేది నా షెడ్యూల్.

భారీ ఓపెనింగ్స్

కంచుకాగడా కంటే ముందూ డూండీగారు నిర్మించిన దొంగలు బాబోయ్ దొంగలు ఆనాటి చిత్రం విడుదల కావాలి. అయితే ఆ సమయంలోనే ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా కృష్ణగారు ఊటీ నుంచి ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. దాంతో రామారావుగారి అభిమానుల్లో, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం పెల్లుబికి కృష్ణగారి చిత్రాలు ఆడనివ్వకుండా అడ్డుకంటామని ప్రకటించారు. ఇంత గొడవ జరుగుతుంటే తన సినిమా విడుదల చేయడానికి డూండీగారు భయపడ్డారు. అయితే రామలింగేశ్వరరావుగారు ధైర్యంగా ముందుకు వచ్చి కంచుకాగడా సినిమా విడుదల చేస్తామన్నారు. మా చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళన చెయ్యడానికి కొంత మంది ప్రయత్నించినా థియేటర్లకు భారీసంఖ్యలో వచ్చిన కృష్ణగారి అభిమానుల్ని చూసి వెనక్కి తగ్గారు. భారీ ఓపెనింగ్స్‌లో కంచుకాగడా విడుదలైంది కానీ సినిమా నిలబడలేదు.

ఇరవై ఏళ్ల తర్వాత హిట్

ఎమ్మెస్ రెడ్డిగారు నిర్మించిన ‘పల్నాటి సింహం‌’ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే వరుస అపజయాలే తప్ప విజయాలు ఎరుగని రెడ్డిగారికి పల్నాటి సింహం ఘనమైన విజయాన్నిఅందించడమే కాకుండా నలుగురిలో ఆయన తలెత్తుకొనేలా చేసింది. కృష్ణగారిని ఎమ్మెస్ రెడ్డిగారు కలసి ఓ సినిమా చేయమని అడగడంతో ఆయన డేట్స్ ఇచ్చారు. దర్శకుడిగా నన్ను పెట్టుకోమని కృష్ణగారు చెప్పినట్లున్నారు. రెడ్డిగారు నా దగ్గరకువచ్చి‘‘ఏమయ్యా కోదండరామిరెడ్డీ, నాకు ఓ సినిమా చేయాలయ్యా’’ అని అడిగారు. ‘‘తప్పకుండా చేస్తానండీ’’ అన్నాను. ‘‘మన బ్యానర్‌లో హిట్టే లేదయ్యా.. ఓ మంచి హిట్టు సినిమా తీసిపెట్టు’’ అన్నారు. ‘‘అలాగే, అయితే నేను చెప్పే కండిషన్స్‌కు మీరు అంగీకరించాలి’’ అన్నాను. ‘‘నాకే కండిషన్స్ పెడతానంటావా.. సరే. అవేమిటో చెప్పు’’ అని అడిగారాయన. ‘‘మీరు ఈ సినిమా షూటింగ్ పనుల్లో జోక్యం చేసుకోకూడదు. స్క్రిప్ట్‌లో వేలు పెట్టకూడదు’’ అన్నాను. నా మాటలు వినగానే రెడ్డిగారికి కోపం వచ్చింది. ‘‘ఏందయ్యా అలా మాట్లాడుతున్నావు.. నేను పెద్ద రచయితని తెలుసా?’’ అన్నారు సీరియస్‌గా. అందుకే ఈ సినిమా బాధ్యత నాకు వదిలెయ్యండి. పరుచూరి బ్రదర్స్‌తో కూర్చుని మంచి కత తయారుచేయించుకుంటా. మేమందరం కలసి మీకు హిట్ ఇస్తాం’’ అన్నానను.

ఆ మాటలు విని జీర్ణించుకోలేకపోయారో ఏమో ‘‘నాకు రెండు రోజులు టైమ్ ఇవ్వు.. ఆలోచించుకుని చెబుతా’’ అన్నారు రెడ్డిగారు. నేను సరేనన్నాను. రెండు రోజుల తర్వాత మళ్లీ వచ్చి, ‘‘సరే, నీ రాజ్యం నడుస్తోందయ్యా.. అలాగే కానివ్వు’’ అన్నారు. ‘‘మీరు షూటింగ్ స్పాట్‌కు కూడా రాకూడదు’’ అని కూడా చెప్పాను. పాపం ఆ పెద్దాయన దానికీ సరేనన్నారు. వాళ్ల అబ్బాయి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి షూటింగ్ స్పాట్‌లో రెడ్డిగారికి బదులు ఉండేవారు. దీపావళి రోజు పరుచూరి గోపాలకృష్ణగారు ఫోన్ చేసి ‘‘మీరు ఏ పనిలో ఉన్నా దాన్ని ఆపేసి మా ఇంటికి అర్జెంటుగా రండి’’ అన్నారు. సరేనని వెళ్లాను. ‘‘నాకు బ్రహ్మాండమైన లైన్ ఒకటి తట్టింది. పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. వినండి. మీకు నచ్చితే ఎమ్మెస్ రెడ్డిగారికి సినిమా చేద్దాం’’ అన్నారు. ‘‘సరే చెప్పండి సార్’’ అన్నాను. ఒకపక్క దీపావళి టపాకాయలమోత. అందులోనే కథ విన్నాను. అంతా అవగానే ‘‘సూపర్.. కృష్ణగారి పాత్ర బాగుంది. అలాగే జయసుద క్యారెక్టర్ కూడా. కొత్తగా ఉంది. చేసేద్దాం’’ అన్నాను. ఆ తర్వాత కృష్ణగారిని కలిసి కథ చెప్పగానే ఓకే అన్నారు. ఈ సినిమాకు ‘పల్నాటి సింహం’ అని ఎమ్మెస్ రెడ్డిగారే పేరు పెట్టారు.