వెళ్ళడం మానేద్దామా అని కూడా అనుకున్నా. మా అబ్బాయితో ఈ మాటే అంటే ‘సరదాగా అని ఉంటారులే నాన్నా.. కావాలనేమీ అని ఉండరు’ అన్నాడు. ఏమైనా ఆయన గురించి మేమేమీ చెడుగా అనుకోలేదులెండి... అప్పుడు కౌంటింగ్‌ టెన్షన్లో ఉన్నాను కదా.. దాంతో ఎవరేం చెప్పినా కాసింత ఎక్కువగా ఆలోచించేవాణ్ణి. ఎందుకంటే వెళ్ళకుండా ఒకవేళ ఓడిపోయాననుకోండి.. ‘ఓడిపోతానని అనుకుని రాలేదురా’ అని జనాలు అనుకుంటారు.. అదే గెలిచాననుకోండి.. ‘కౌంటింగ్‌రోజు కూడా ఇక్కడికి రాకపోతే, నియోజకవర్గాన్ని ఇంకేం పట్టించుకుంటాడ్రా’ అనుకుంటారు.. కౌంటింగ్‌రోజు పార్టీ కార్యకర్తలందరూ చాలా ఉత్కంఠతో ఎదురుచూస్తారు కదండీ. ఆ ఆలోచనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. మరుసటిరోజు మోహనబాబుగారిని కలిసి ఆ విషయమే చెప్పా.

‘సరే నువ్వు వెళ్ళాలనే నిర్ణయించుకున్నావా’ అని అడిగారు మోహన్‌బాబుగారు. ‘ఏమీ అనుకోవద్దు సార్‌ వెళ్ళి తీరాలి. తప్పదు’ అన్నా. ‘సరే పో.. నీ ఖర్మ’ అని పంపించారు.ఓ వైపు కౌంటింగ్‌ జరుగుతోంది.. మరోవైపు పత్రికలవాళ్ళు టీవీలవాళ్ళు చుట్టుముట్టి.. ‘అసలు గెలుస్తానని అనుకుంటున్నారా? మీ ఆలోచన ఎలా ఉంది’ అని అడగడం ప్రారంభించారు. ‘ఒక్క ఓటు మెజారిటీతోనైనా సరే నేను గెలుస్తాను’ అన్నా. అంత నమ్మకం వచ్చింది నాకు. అది ఎలా వచ్చిందో మాత్రం తెలియదు. నా నమ్మకమే నిజమైంది. సరిగ్గా నాలుగుఓట్లు తక్కువగా నాలుగువేలు మెజార్టీతో గెలిచాను. ఆ రోజు మావాళ్ళ సందడి అంతా ఇంతా కాదు. విద్యాసాగర్‌గారైతే ‘ఇదీ నీ సత్తా. ఇన్నాళ్ళూ నువ్వే పక్కనున్నావ్‌’ అని మెచ్చుకుని భుజం తట్టారు.

‘మీరు నిలబెట్టినందుకు నేను మీ పరువు నిలబెట్టాను’ అన్నా. ఆ సందడి సద్దుమణిగాక మళ్ళీ హైదరాబాద్‌ వచ్చా. తిరిగి రాగానే మళ్ళీ మోహనబాబుగారి కాల్షీట్‌. అదే ‘పోస్ట్‌మేన్‌’ సినిమా. నేను సెట్‌లోకి వస్తున్నానని తెలియగానే ‘కోట శ్రీనివాసరావుని ఘనంగా ఆహ్వానించాలిరా..’ అని యూనిట్‌తో చెప్పారట మోహన్‌బాబుగారు. మంచి గంధం దండలు, ఫ్లవర్‌ బొకేలు అన్నీ పట్టుకుని ‘కంగ్రాట్యులేషన్స్‌ శ్రీనివాసరావు, నీ నమ్మకం నిజమైంది. గెలిచావు, అయామ్‌ సో హ్యాపీ..’ అని నన్ను కౌగలించుకుని అభినందనలు తెలియజేశారుమోహనబాబుగారు. ‘మరి మొన్న అలా అన్నారేంటి సార్‌..’ అని అడుగుదామనుకున్నా. కానీ ఇంత ఘనంగా నన్ను సత్కరించి, నా విజయం చూసి అంతగా మురిసిపోయారంటే ఆ రోజు నాతో తమాషాకి అని ఉంటారులే అనిపించి ఊరకున్నా. ఆ రోజు మొత్తం మోహనబాబుగారు నాతోనే ఉన్నారు. ‘మొత్తానికి గెలిచావయ్యా నువ్వు.. భలే చోట గెలిచావు.. భలే భలే.. మొత్తం కాంగ్రెస్‌ సీట్‌ అది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఫస్ట్‌టైమ్‌ కాంగ్రెస్‌యేతర పార్టీ ఎమ్మెల్యేగా గెలవడం..’ అని భుజంతట్టి చాలా ఆనందించారు.