ఇటువంటి పరిస్థితుల్లో అనుకోకుండా ఓ రోజు రామారావుగారిని ఎయిర్‌పోర్ట్‌లో కలుసుకోవాల్సి వచ్చింది.

అదెలాగంటే...

రామారావుగారు ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’కు డబ్బింగ్‌ చెప్పడానికి అనుకుంటా, ఓ సారి చెన్నై వచ్చారు. అప్పటికి సీఎం హోదాలో ఉన్నారు. రామారావుగారు ఆజానుబాహుడు. పంచె కట్టుకుని, కిర్రు చెప్పులు వేసుకుని ఎయిర్‌పోర్టులో రాజసంతో నడిచి వస్తుంటే పక్కన ఓ యాభై, అరవైమంది జనం, టైట్‌ సెక్యూరిటీ... పెద్ద హడా విడిగా ఉండేది. రామారావుగారిలో గొప్పతనం ఏమిటంటే గంభీరమైన ఆయన విగ్రహం చూడగానే ఎటువంటి వాడికైనా వణుకు మొదలవుతుంది. ఇక ఆయనతో మాట్లాడాలంటే చెప్పేదేముంది... ఆ వేళ హైదరాబాద్‌లో ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌ ఏదో జరిగింది. ఆ మీటింగ్‌ కోసమని దాసరి నారాయణరావుగారు, రామానాయుడుగారు ఇలా పెద్ద పెద్ద వాళ్లందరూ ఫ్లయిట్‌ కోసం ఎదురుచూస్తూ చెన్నై ఎయిర్‌పోర్టులోనే ఉన్నారు.నేను కూడా ఔట్‌డోర్‌ వెళ్లడం కోసం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నాను. నా పక్కనే విజయచందర్‌ కూడా ఉన్నారు. రామారావుగారిని చూడగానే మెరుపులా నాకు ఓ ఆలోచన వచ్చింది.

ఆయన అభిమానులు అలా కొడతారని ఊహించలేదు 

 

నా సూట్‌కేస్‌ విజయచందర్‌కి అప్పగించి, ‘కాస్త చూస్తుండండి... ఇప్పుడే వస్తాను’ అని అన్నా. ‘ఎక్కడికెళ్తున్నావ్‌’ అని అడిగారు విజయచందర్‌. ‘పెద్దాయన రామారావుగారి దగ్గరికి’ అన్నా.  ఈ సమాధానం వినగానే నా పక్కనున్న వాళ్లు తెల్లబోయారు. ‘మతిపోయిందా? నువ్వు చేసిన పనికి ఆయన కోపంతో మండిపడుతుంటారు. ఇప్పుడు వెళ్లి పలకరిస్తావా?’ అంటూ నన్ను వారించాలని చూశారు. ‘దగ్గరికి వెళితే ఆయన కాదు.. పక్కనున్నవాళ్లే నిన్ను చంపేస్తారయ్యా’ అని కూడా అన్నారు. కానీ నేను వినిపించుకోలేదు. ఏదో మొండిధైర్యం నన్ను ఆవరించింది. ‘ఇలా భయపడుతూ ఎంతకాలం 

ఉంటామండీ.. ఆయన్ని వెళ్లి కలుస్తాను. కోపంతో ఒకటి కొడితే, భరిస్తాను. తిడతారా... తిట్టనీ. మహానుభావుడాయన. తిట్టినా, కొట్టినా బాధ లేదు. దీనివల్ల ఎవరెవరితోనో మాటలు పడే బాధ తగ్గుతుంది’ అని చెప్పి రామారావుగారి దగ్గరకు బయలుదేరాను. మంచో, చెడో, తప్పో, ఒప్పో చేసేశాను. దానికి ఆయనకి కోపం రావడం సహజమే! వాళ్ల పిల్లలు నా మీద ఆగ్రహించడం కూడా తప్పేమీ కాదు. మా నాన్నని ఏమైనా అంటే నేను మాత్రం ఊరుకుంటానా? రామారావుగారు, ఆయన పిల్లలు నా మీద కోపంగా ఉన్నారని ఎన్నాళ్లు వాళ్లని తప్పించుకొని తిరుగుతాను?