ఒరేయ్‌.. కోటగాడు ఈ ఫ్లాట్‌ఫారం మీదే ఉన్నాడట. పట్టుకోండిరా... అని అరిచాడు ఇంకొకడు. ఆ రోజుతో ఇక నా పని అయిపోయిందనుకున్నాను. జనం అంతా నన్ను చుట్టుముట్టేశారు. కదలకుండా దిగ్బంధనం చేసి, స్టేషన్ వెనక్కి నన్ను లాక్కెళ్లారు. నేనేం చెప్పినా వినిపించుకునే పరిస్థితి లేదు. అంతా ఆవేశంతో ఉన్నారు. ‘కళాకారుడి మీద చెయ్యి చేసుకోకూడదు. ఇందులో అతని తప్పేమీ లేదు’ అని ఒక్కరైనా ఆలోచించి ఉంటారని నేననుకోను. ‘మన అన్నగారిని అనుకరించి, అవమానపరిచాడు. ఇతని అంతు చూడాల్సిందే’ అనుకొని అందరూ కలబడి నా మీద తలో చెయ్యీ వేశారు. ఇది నేను ఊహించని ఘటన. నాతో వాదనకు దిగుతారని అనుకున్నాను కానీ, ఇలా కొడతారని ఊహించలేదు. ఇంతలో ఎవరో వచ్చి జోక్యం చేసుకోవడంతో జనం నన్ను వదిలిపెట్టారు. అవమానభారంతో రూమ్‌కి చేరుకున్నా. దారి వెంబడి ఒకటే ఆలోచన. ఇందులో నేను చేసిన తప్పేమిటి? రామారావుగారంటే నాకు అమితమైన గౌరవం ఉంది. నాకు ఇచ్చిన పాత్ర చేశాను తప్ప ఆయన్ని కించపరచాలని అనుకోలేదు. అయినా ఇలాంటి పర్యవసానాల్ని ఆలోచించకుండా చేసేశాను. దానికి తగ్గ ఫలితాన్ని అనుభవించాను. ‘కొన్ని గాయాలను కాలమే మాన్పుతుంది’ అని సర్ది చెప్పుకున్నా. అదే జరిగింది. ఇది జరిగిన కొంతకాలానికి నిర్మాత త్రివిక్రమరావుగారిని వారి ఆఫీసులో కలిశాను. మాటల మధ్యలో ‘ఆకుకూరల ఆనందరావు అనే ఓ పాత్ర గురించి చెప్పాను. అది ఆయనకు బాగా నచ్చింది. ఆ క్యారెక్టర్‌ గురించి ఆయన పరుచూరి బ్రదర్స్‌తో చెప్పి చక్కగా డిజైన్ చేయమన్నారు. అలా పుట్టిన పాత్ర కరణం కాసయ్య అనే హోం మినిస్టర్‌ పాత్ర. నందమూరి బాలకృష్ణగారు హీరోగా నటించిన రౌడీ ఇన్‌స్పెక్టర్‌ చిత్రమది. త్రివిక్రమరావుగారు నిర్మించారు. ఆ చిత్రంలోనే కరణం కాసయ్య అనే పాత్ర నాకు బాగా పేరు తెచ్చిపెట్టింది. మరో విషయమేమిటంటే ‘మండలాధీశుడు’ తర్వాత నేను మరలా నందమూరి కాంపౌండ్‌లో చేసిన సినిమా ఇదే! ఆ విషయంలో త్రివిక్రమరావుగారిని సదా గుర్తుంచుకుంటాను.

జాగ్రత్తగా చేసుకోమన్నారు

మండలాధీశుడు సినిమా చూసి కార్యకర్తలకే కాదు మా బెజవాడ ఎమ్మెల్యే నెహ్రూగారికి కూడా కోపం వచ్చింది. ఒకసారి ఎక్కడో, ప్రాంతం గుర్తులేదు కానీ ఇద్దరం కలిశాం. ‘ఏమయ్యా... నీకేం ఒళ్లు బలిసిందా? రామారావుగారి సినిమా చేశావట? విషయం తెలిసి నీ మీద పీకలదాకా కోపం వచ్చింది.. చంపేద్దామనుకున్నాం’ అని కోపంగా కేకలేశారు. అంతలోనే తేరుకుని ‘అసలు ఏం చేశావో.. ఎలా చేశావోనని, రాత్రి సినిమా చూశా. చూసిన తర్వాత తెలిసింది. నీ దుంపతెగ... ఎంత బాగా చేశావయ్యా.. అచ్చం పెద్దాయన్ని చూసినట్టు అనిపించింది. అందుకే నిన్ను ఇంకేం అనలేకపోతున్నా. ఇప్పటికైతే చేస్తే చేశావు? సరే... ఇంకెప్పుడూ అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయబాక. నీ వేషాలు నువ్వు జాగ్రత్తగా వేసుకో’ అని అన్నారు. ఆయన మాటల్ని కూడా అంత తేలిగ్గా మర్చిపోలేనండీ.