ఆ చిత్రంలో తారక్ చాలా టిపికల్ కేరక్టర్ చేశాడు. అతని తల్లిదండ్రులు కోటీశ్వరులు. వాళ్ళంటే అతనికి అపారమైన గౌరవం. కొడుకంటే వారికి గొప్ప నమ్మకం. ఇటు ప్రేయసి కోసం ఇంకో అమ్మాయికి ప్రియుడిగా నటిస్తుంటాడు. అలాగని కొత్తగా పరిచయమైన అమ్మాయిని ఇరకాటంలో వదిలేసి వెళ్ళలేడు. ఇలా తారక్ పాత్ర గమ్మత్తుగా ఉంటుంది. ఆ టెంపో అతను బాగా మెయింటెయిన్ చేశాడు. నిజంగా చేయకపోయి ఉంటే తేలిపోయేవాడు. ఎందుకంటే అవతల దిగ్గజాల్లాంటి నటులు శ్రీహరి, ప్రకాశరాజ్‌. అన్నదమ్ముల పాత్రలు. నేనేమో తండ్రిని. ఇంతమంది ముందు ఆ పాత్రలో నెగ్గుకు రావడం చాలా కష్టం. అయినా తారక్ చాలా సులువుగా చేయడం నాకు ముచ్చటనిపించింది.

విగ్గు స్టోరీ

‘బృందావనం’ లో నా పాత్ర కోసం మా మేకప్ మేన్ తెల్లటి విగ్గు రెడీ చేయించాడు. శ్రీహరికి, ప్రకాశ్‌రాజ్ కి తండ్రి అంటే బాగా ముసలిగా కనిపించాలి కదా అని మా ఉద్దేశం. మొదటి రోజు సెట్ కి ఆ విగ్గు పెట్టుకుని వెళ్ళాను. అందరూ చాలా బావుందన్నారు. కానీ కాసేపటికి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎంత సేపటికీ నాతో షాట్ తీయరు. కాసేపటికి డైరక్టర్ వంశీ వచ్చి, ‘విగ్గు లేకుండా ఉంటేనే బావుంటుందేమో శ్రీనివాసరావుగారూ’ అన్నారు. అప్పటికప్పుడు మేకప్‌ మేన్ ని పిలిపించి విగ్గు గురించి చెప్పాం. అదృష్టం బావుండి ఆ వేళ విగ్గుమ్యాన్ కూడా సెట్‌లోనే ఉన్నాడు. తన దగ్గర ఇంకో విగ్గు ఉంది. అది నాకు చాలా బాగా సెట్‌ అయింది. అప్పుడు అందరూ కుదుటపడి విగ్గు ఓకే అనుకుని షూటింగ్‌ మొదలుపెట్టారు.

నా అనుమానమే నిజమైంది

బృందావనం సినిమా గురించి ఇంకో ముఖ్య విషయం చెప్పాలి. ఇందులో ప్రకాశరాజ్‌, శ్రీహరి ఇద్దరూ డైలాగ్స్‌ చాలా బాగా చెబుతారు. ప్రకాశరాజ్‌ మంచి ఆర్టిస్ట్‌ మాత్రమే కాదు. చక్కటి డైలాగ్‌ డిక్షన్‌, పలికే ప్రతి పదంలో అప్‌ అండ్‌ డౌన్స్ వంటివన్నీ చాలా చక్కగా ఉచ్ఛరించడం అతని క్వాలిఫికేషన్స్. శ్రీహరి తక్కువ తిన్నోడేం కాదు. సీన్‌ పండించడంలో ఎప్పుడూ ముందుంటాడు. మరి వాళ్ళకన్నా నేను బాగా చేసినట్టు అనిపించుకోవాలి, కానీ ఎక్కడా డామినేట్‌ చేసినట్టు అనిపించుకోకూడదు. అలాంటిచోటే కదా నాబోటి ఆర్టిస్టుకి పరీక్ష అనిపించేది. మామూలు సమయాల్లో చేయడానికి ఏముంటుంది? ఏమాటకి ఆమాట చెప్పాలంటే అసలు నా వేషం గురించి వంశీ నాకు చెప్పగానే ‘ప్రకాశరాజ్‌ అసలు ఈ వేషం ఎలా వదిలేశాడు?’ అని అడిగాను. నా అనుమానం నిజమైంది. ‘నేను చేస్తాను ఈ వేషం’ అని ప్రకాశ్‌రాజ్ అడిగారట.