మా ఇంట్లో ప‌నివాళ్ల‌పైనే కాదు.. నాపై కూడా నా శ్రీమతి ఒక్కోసారి విరుచుకపడేది. చుట్టూ ఎవ‌రున్నారు.. ఏమిటి అని చూసుకునేది కాదు. ‘‘ఇదిగో ఇవాళ ఈ ప‌ని చేశారు. నాకు న‌చ్చ‌లేదు’’ అని ముఖం మీదే చెప్పేసేది. కొత్త‌లో కొంత అసౌక‌ర్యంగానే ఉండేది. కొన్నాళ్లు చుట్టూ అంద‌రి ముఖాలు చూసేవాడిని. ఆ త‌ర్వాత ఇలా కాదులెమ్మ‌ని ఈ విష‌యం గురించి ఆలోచించా. ఒక రోజు అంద‌రం తిని ప‌డుకున్నాం. ఆవిడ కూడా వంటిల్లు మొత్తం స‌ర్దుకుని ప‌డ‌కింటికి వ‌చ్చింది. అప్పుడు కూర్చోబెట్టి నెమ్మ‌దిగా ఆవిడ‌తో ఈ విష‌యం ప్ర‌స్తావించాను. ‘‘ఇదిగో ఈ రోజు నువ్వు ఇలా అరిచావు. నువ్వు అర‌వ‌డం వ‌ల్ల నాకేం ఇబ్బందిగా లేదు. కాక‌పోతే చుట్టూ చూస్తున్న వాళ్ల‌కు లోకువైపోతాం. 

అందుకే నువ్వేమ‌న్నా చెప్పాల‌నుకున్నావ‌నుకో..ఇలాంట‌ప్పుడు, ఇద్ద‌ర‌మే ఉన్న‌ప్పుడు చెప్పు. అలా కాకుండా అంద‌రి ముందు దురుసుగా నువ్వ‌న్నావ‌నుకో, వాళ్ల ముందు నేనూ ఏదో ఒక‌టి అనాల్సి వ‌స్తుంది. నేనేమీ అనకపోతే, ‘‘అత‌ను చూడు, భార్య అన్ని మాటలంటున్నా నోరు మెద‌ప‌డు’’ అనుకుంటారు. వాళ్లు అలా అనుకుంటారు క‌దా అని నేను ఏదో ఒక‌టి అన్నాన‌నుకో, అది అర్థం చేసుకోకుండా నువ్వు ఇంకొక‌టి అంటావు. ఎవ‌రికోస‌మో మ‌నిద్ద‌రం మాటామాటా పెంచుకోవాల్సి వ‌స్తుంది. అదేమంత బావుంటుంది చెప్పు’’ అని న‌చ్చ‌జెప్పా.అంతేకాదు.. ‘‘ఎప్పుడూ కూడా నేను బ‌య‌టినుంచి రాగానే గొడ‌వ‌ ప‌డ‌కు. నేను చేసినవి ఒక‌టీ అరా పొర‌పాట్లు ఉన్న‌ప్ప‌టికీ, నేను గుమ్మం తొక్క‌గానే నా మీద అరిచి ఆ బాధంతా తీర్చేసుకోవాల‌ని, కోపాన్నంతా చూపించేయాల‌ని అనుకోకు.

ముందు చ‌క్క‌గా న‌వ్వుతూ ఆహ్వానించు. లోప‌లికి రాగానే ‘మంచినీళ్లు కావాలా?’ అని అడుగు. భోజ‌నాల వేళయితే అన్నం వ‌డ్డించు. ఎటూ కాక‌పోతే ‘కాఫీ, టీ పెట్టిస్తాను ఉండండీ.. వేడివేడిగా తాగుదురుకానీ’ అను. ‘స్నానం చేసిరండీ’ అని నీళ్ళు తోడు. జంతిక‌లో, స్వీట్లో ఉంటే పెట్టు. అంతా పూర్త‌యి ప‌డ‌క‌మీద‌కు చేరిన త‌ర్వాత అప్పుడు చెప్పు నీ మ‌న‌సులో మాట‌లు.. ‘ఏవండీ ఇవాళ ఇలా జ‌రిగింది. నాకు మీ ప‌ద్ధ‌తి అస‌లు న‌చ్చ‌లేదండీ’ అను. అప్పుడు దాన్ని కూర్చుని ప‌రిష్క‌రించుకుందాం. అలాగే నాకేదైనా కోపం వ‌చ్చింద‌నుకో.. నేను అరచినంత సేపు నువ్వు క్వ‌య‌ట్‌గా ఉండు. నీకు కోపం వ‌చ్చింద‌నుకో నేను ఆ స‌మ‌యంలో ప‌ల్లెత్తుమాట అన‌ను. అలా కాకుండా ఇద్ద‌రం పోటీ ప‌డి అరుచుకుంటే అలుసైపోతాం. అలా కాకుండా ఆ సాయంత్ర‌మో, మర్నాడో మ‌నం మాట్లాడుకుని కాంప్ర‌మైజ్ అవుదాం, అది కాకుండా ‘మీ అమ్మ ఏంటి? మా అమ్మ ఏంటి? మీ పెద్దాళ్లేంటి? మా పెద్దాళ్లేంటి?’ అనే మాట‌లే మ‌న మ‌ధ్య‌ వ‌ద్దు. పెద్ద‌లు ఎవ‌రివాళ్ల‌యినా పెద్ద‌లే. అంద‌రినీ ఇద్ద‌రం గౌర‌విద్దాం’’ అని అనుకున్నాం.