1969లో తొలిసారి ప్రచురితమైన ‘అంపశయ్య’ నవల అప్పుడు ఒక సంచలనం. చైతన్య స్రవంతి శిల్పంతో తెలుగులో వచ్చిన ముఖ్యమైన రచనగా విమర్శకులు దీన్ని గుర్తించారు. ప్రశంసలతో పాటు చాలా విమర్శలూ వచ్చాయి. అయినా ఈ యాభై ఏళ్ళలోనూ పదికి పైగా ముద్రణలు పొందింది. ఇప్పటికీ ఈ పుస్తకానికి యువతరం నుంచి పాఠకులు వస్తూనే ఉన్నారు. ‘అంపశయ్య’ నవలకు యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆ నవలా రచయిత నవీన్‌తో ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూ...
 
మీ ‘అంపశయ్య’ నవల ప్రధానపాత్ర రవితో యువతరం పాఠకులు అప్పుడూ ఇప్పుడూ అంతగా ఐడెంటిఫై అవడానికి కారణం ఏమనుకుంటారు?
రవి ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. ఒక యూనివర్సిటీలో చేరి చదువుకునేంత ఆర్థిక స్తోమత అతనికి లేదు. అయినా చదువుకోవాలనే దృఢతరమైన పట్టుదలతో యూనివర్సిటీలో చేరాడు. కాని అతనికి అడుగ డుగునా సమస్యలే! అతని చుట్టూ అందరూ బాగా డబ్బున్న వాళ్ళే. ఇతనికి డబ్బు లేకపోవడంవల్ల ఆత్మన్యూనతా భావానికి లోనవుతుంటాడు. అలాగే వయస్సు వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు కొన్ని- అతడు ఆరంభ యవ్వనంలో ఉన్నాడు. ఆ వయస్సులో లైంగికపరమైన అశాంతి  సెక్స్‌పరమైన కోరికల ఉధృతి ఉంటాయి... ఎం.ఏ. పూర్తి చేశాక యేదైనా ఉద్యోగం దొరుకుతుందో లేదో అనే అభద్రతాభావం. సీరియస్‌గా చదువుకోవడానికి కావలసిన ప్రశాంత వాతావరణం హాస్టల్‌లోగానీ, కాలేజీలోగానీ లేకపో వడం... సరిగ్గా చదువుకోలేకపోతున్నానని, తనను ఎన్నో కష్టాలకోర్చి చదివిస్తున్న తల్లిదండ్రులకు అన్యాయం చేస్తు న్నానేమో అనే అపరాధ భావన... వీటన్నిటికి తోడు విద్యార్థుల్లో ఉండే రాజకీయపరమైన గ్రూపులు... వాళ్ళమధ్య జరిగే సంఘ ర్షణలు... ఇవన్నీ అప్పుడూ ఉన్నాయి... ఇప్పుడూ ఉన్నాయి. మెజార్టీ ఆఫ్‌ స్టూడెంట్స్‌ రవిలాగే- ఇలాంటి సంఘర్షణల కన్నిటికీ లోనవుతారు. రవితో అప్పటి, ఇప్పటి యువతరం ఐడెంటిఫై కావటానికి ఇవే కారణాలు.
 
ఈ నవలకు బీజం పడింది ఎప్పుడు? నవలలో యూనివర్సిటీ విద్యార్థుల మధ్య సైద్ధాంతిక, రాజకీయ చర్చలు, మనస్తత్వ శాస్త్ర విశ్లేషణలు, పాప్‌కల్చర్‌ రెఫరెన్స్‌లు, మార్లిన్‌మన్రోపై రవి అభిమానం, వీటన్నింటికి మూలమేమిటి?
నేను 1962-64 మధ్యకాలంలో ఉస్మానియా విశ్వవిద్యాల యంలో ఎం.ఏ. చదువుతున్న కాలంలోనే అంపశయ్య నవలకు బీజం పడింది. అక్కడి జీవితాన్నంతా చిత్రిస్తూ ఒక నవల రాయాలన్న కోరిక అప్పుడే కల్గింది. రవి పాత్రలో నా వ్యక్తిత్వ మంతా ఉంది. ప్రతి సంఘటనపట్ల తీవ్రంగా స్పందించటం, తన చుట్టూ ఉన్నవాళ్ళ మనస్తత్వాన్ని పరిశీలించటం, సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలను తొలగించటానికి యేం చెయ్యాలని ఆలోచించటం... ఎప్పుడూ యేవో కలలు కనటం, అపోజిట్‌ సెక్స్‌ పట్ల ఆకర్షణ, సంగీతమంటే... ముఖ్యంగా ఆనాటి కొన్ని సినిమా పాటలంటే విపరీతమైన అభిమానం... ఆనాటి విద్యార్థుల మధ్య జరిగే సైద్ధాంతిక చర్చల్లో పాల్గొని తన వామపక్ష భావాల్ని ప్రకటించటం.... మర్లిన్‌మన్రో పట్ల ఆకర్షణకు రెండు కారణాలు. ఒకటి: ఆమె సౌందర్యదేవత... సెక్స్‌ గాడెస్‌ కావడం. రెండవది: ఆమె తనలాగే పేద కుటుంబంలో పుట్టి తీవ్రమైన కష్టాల్ని అనుభవించి తన అలౌకిక సౌందర్యంతో ప్రపంచంలోనే నెంబర్‌వన్‌ స్టార్‌ కావడం. రవిలోని ఇవన్నీ నా వ్యక్తిత్వం లోంచి తీసుకున్నవే.
 
నవలలోని రత్తి పాత్రకు ప్రేరణ యేమిటి?
నేను 1957లో మెట్రిక్యులేషన్‌- అంటే ఏఖిఛి ప్యాసయ్యాక ఒక సంవత్సరం (1957-58) చదువును కొనసాగించకుండా మా ఊర్లోనే ఉండిపోయాను. ఎందుకంటే మా నాయన గారు పదోక్లాసు తర్వాత నన్ను చదివించటానికి తన దగ్గర డబ్బు లేదన్నాడు. మా వృత్తి వ్యవసాయం. మాకు చాలానే వ్యవసాయ భూములుండేవి. కానీ నాకు వ్యవసాయం మీద సహజమైన ఇంటరెస్ట్‌ ఉండేది కాదు. నాకిష్టమైన నవలలు చదువుకుంటూ ఎక్కువగా ఇంట్లోనే ఉండేవాడిని. అయితే అప్పుడప్పుడు కొందరు మా ఊర్లో పనిచేసే టీచర్స్‌తో కలిసి ఊర్లో తిరుగుతుండేవాడిని. లేకపోతే వ్యవసాయ పనులకు... నాట్లు వేస్తున్నప్పుడో, కుప్పలు కొడ్తున్నప్పుడో వెళ్ళేవాడిని. అప్పుడు కూలీపనులకొచ్చే చాలామంది ఆడపిల్లలు- ఇంచు మించు నా వయస్సు వాళ్ళు--నాకప్పుడు 16యేళ్ళు-- కలుస్తుం డేవాళ్ళు. వాళ్ళల్లో కొందరు చాలా అందంగా ఉండేవాళ్ళు (ఆ వయస్సులో ప్రతి ఆడపిల్ల అందంగానే కనిపించేది). అలా అందంగా ఉన్న ఒక అమ్మాయి... ఆమెది ఇంచుమించు నా వయస్సే. ఆ అమ్మాయి పేరు లక్ష్మి అని గుర్తుంది. చాలా నిమ్న వర్గానికి చెందిన అమ్మాయి. ఆమె ఎందుకో నన్ను చూసిన మరుక్షణం నుండి నన్ను ‘‘బావా!’’ అంటూ చాలా చనువుగా పలకరించేది. నాకు చాలా దగ్గర కావాలని ప్రయత్నించేది. ఆమెపట్ల నాకు విపరీతమైన ఆకర్షణ కల్గింది. ఆ ఆకర్షణనే నేను ప్రేమనుకున్నాను. అలా ఇద్దరం చాలా దగ్గరయ్యాం. అయితే అప్పటికే ఆమెకు ఊర్లోని మరో ముగ్గురు, నల్గురు యువకులతో సంబంధాలున్నాయని, ఒకతడు ఆమెను పెళ్ళి చేసుకుంటానని ఆశ కల్పించి మోసగించాడని తెలుసుకున్నప్పుడు ఆమెపట్ల నాకు చాలా జాలి కల్గింది. తర్వాత ఆమె తన శరీరాన్ని చాలామందికి అర్పించింది. ఊర్లో ఆమెను చాలామంది ఆఠణా అని, చారాణా అని ముద్ర వేశారు. ఒక సంవత్సరం తర్వాత నేను మళ్ళీ సిటీకొచ్చి కాలేజిలో చేరడంతో ఈ లక్ష్మితో నా సంబంధం తెగిపోయింది. ఈ లక్ష్మే తర్వాత నా నవల్లో రత్తిగా అవతరించింది. కొంత నిజం, కొంత కల్పన కలగలిసి రత్తి పాత్ర రూపొందింది.
 
నవల రాసే సమయంలో మీపై సాహిత్య ప్రభావాలు?
అంపశయ్యను నేను 1965లో రాయటం మొదలెట్టినప్పుడు నామీద చలం, శ్రీశ్రీ, బుచ్చిబాబు ప్రభావం ఉంది. అప్పటికే నేను సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ను అధ్యయనం చేసి అర్థం చేసుకు న్నాను. అలాగే నేను ఎం.ఏ. (ఎకానమిక్స్‌) చదివినప్పుడు ఎకానమిక్‌ థాట్‌ అనే ఒక సబ్జెక్ట్‌ ఉండేది. దాంట్లో కారల్‌ మార్క్స్‌ను గురించిన సవివరమైన అధ్యాయాన్ని స్టడీ చేశాను. కాబట్టి నామీద ఫ్రాయిడ్‌ అండ్‌ మార్క్స్‌- వీరిద్దరి ప్రభావం ఉంది. ఈ ప్రభావాలన్నీ అంపశయ్యలో చోటు చేసుకున్నా యని పరిశీలకులకు తెలుస్తుంది.
 
అంపశయ్య నవల రచన గురించి చెప్పండి?
‘అంపశయ్య’ను నేను 1965లో నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న రోజుల్లో రాయటం మొదలెట్టాను. అప్పుడు నేను మా కుటుంబంతో నల్లగొండలోని రామగిరి అనే వీధిలో కట్టా రామచంద్రారెడ్డిగారు (కొంతకాలం వీరు టీచర్‌ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు) వీరింట్లో అద్దెకుండేవాళ్ళం. 1965లో మొదలు పెట్టి తీరిక దొరికినప్పుడల్లా 10, 15 పేజీలు రాస్తుండేవాడిని. బుర్రలోకి యే థాట్‌ వస్తే దాన్ని రాసేస్తుండేవాడిని... ముఖ్యంగా నవల అత్యంత వాస్తవికంగా ఉండాలని ప్రయత్నం చేసేవాడిని. తీరా పూర్తిచేశాక చూస్తే నవల సైజు విపరీతంగా పెరిగిపోయింది. నా చేతిరాతలో 1000 పేజీలు. తిరగరాసి 600 పేజీలకు కుదించాను. అప్పుడూ తృప్తికల్గ లేదు. దీన్నింకా తగ్గించి ప్రింట్‌ కాపీ తయారు చెయ్యాలనుకున్నాను. నా చేతిరాత అంత బావుండదు. నల్గొండ కాలేజిలో పనిచేస్తున్నప్పుడు నాకు కొత్తపల్లి రవిబాబు (ఇప్పటి ప్రజాసాహితి ఎడిటర్‌) అత్యంత సన్నిహితుడయ్యాడు. ఆయన హ్యాండ్‌రైటింగ్‌ చాలా బావుం టుంది. ‘‘నాతో ఓ పదిహేను రోజులు కూర్చుంటావా రవీ! నేను రాస్తున్న ఈ నవలకు ఫైనల్‌ షేప్‌ ఇద్దాం. నేను రాసి ఇస్తోంటే నువ్వు శుద్ధ ప్రతిని రాసెయ్యాలి’’ అని చెప్పాను. వెంటనే అంగీకరించాడు. 1968 జూన్‌ 1వ తేది నుండి 15వ తేది వరకు రవి, నేను ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌ లోని బి-హాస్టెల్‌లోని రూమ్‌ నెం.3లో ఉండిపోయి, రాత్రింబ వళ్ళు- నేను రాసి ఇస్తోంటే రవిబాబు కార్బన్‌ కాపీ సహా యంతో రెండు ఫెయిర్‌ కాపీలను తయారుచేశాడు. రవి బాబు చేతిరాతలో తయారైన రెండు ప్రతుల్ని సుల్తాన్‌బజార్‌ లోని జ్యోతి బైండింగ్‌వర్క్స్‌కు తీసికెళ్లి బైండింగ్‌ చేయించాను. ఆశ్చర్యంగా ఆ జ్యోతి బైండింగ్‌వర్క్స్‌ యజమాని ప్రజాకవి కాళోజీకి మిత్రుడు. కాళోజీ అతని షాపులో కాస్సేపు కూర్చుం దామని వెళ్ళినప్పుడు ‘‘మీ వరంగల్‌ కుర్రాడు ఈ థీసిస్‌ను బైండింగ్‌ చెయ్యమని ఇంతకుముందే ఇచ్చివెళ్ళాడు’’ అని నా నవల ప్రతిని కాళోజీకిచ్చాడట. ‘‘వరంగల్‌ కుర్రాడా? అయితే నాకు తెలిసే ఉంటాడు. దాన్ని ఇటివ్వు’’ అని తీసుకొని, కాళోజి ఆ షాపులోనే కూర్చొని మొత్తం నవల చదివేశాడు. నేను కలిసినప్పుడు ‘‘నీ నవల చదివానోయ్‌... అది నీకు చాలా పేరు తెస్తుంది...’’ అన్నప్పుడు ‘‘దాన్ని నేను మీకివ్వలేదు. పుస్తకంగా కూడా రాలేదు. దాన్ని మీరెలా చదివారని’’ బోల్డు ఆశ్చర్య పడ్డాను. అలా ఆ నవల ప్రప్రథమంగా చదివిన పాఠకుడు ప్రజాకవి కాళోజీయే!