బలమైన భావజాలమున్న స్ర్తీవాద రచయిత్రి పాటిబండ్ల రజని.శక్తివంతమైన భాషాసంపద ,నేరుగా హృదయాన్ని తాకే లోతైన భావసంపద రజని కవిత్వం ప్రత్యేకత..‘‘ఒక్క విస్ఫోటనం విశ్వంగా రూపాంతరం చెందినట్టు, అనేక తరాలుగా అణచిపెట్టిన స్ర్తీ శక్తి అనేక పోరాటాలుగా విస్ఫోటనం చెంది అన్ని రంగాలనూ తన చేతుల్లోకి తీసుకుంటున్న యుగం ఇది’’ అని చెప్పడంలోనే రజని శైలి మనకు తేటతెల్లమవుతుంది .‘‘గ్రామీణ మహిళల జీవితమే నా కవిత్వ చిరునామా’’ అంటారు రజని.సంపాదనపరులైన స్ర్తీల ఆర్థికస్వాతంత్ర్యలేమినీ, పురుషాధిక్య సమాజంలో తమను తాము అమాయకులుగా ప్రొజెక్ట్ చేసుకునే స్ర్తీల బలహీనమనస్తత్వాలచుట్టూ అల్లుకున్న పరిస్థితులనూ కథలుగా మలిచిన రచయిత్రి రజని.
‘అబార్షన్ స్టేట్మెంట్’ కవిత ద్వారా పురుషాధిక్య సమాజాన్ని ఉలిక్కిపడేట్టు చేసి వారి భావజాల మార్పుకు దోహదపడిన స్ర్తీవాద కవయిత్రులలో ఒకరు రజని.సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నకొద్దీ స్ర్తీలపై రెట్టింపు స్థాయిలో హింస, దాడులు కొత్త కొత్త రూపాలు సంతరించుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న రజని ఇంటర్వ్యూ.కృష్ణాజిల్లా తిరువూరు ఆమె స్వగ్రామం. ఇంటర్మీడియట్ తర్వాత, కరీంనగర్లో టీచర్ ట్రైనింగ్ తీసుకుని సొంత ఊళ్ళోనే 1983లో టీచర్‌గా విద్యారంగంలో ప్రవేశించాక, రచనావ్యాసంగం ప్రారంభించారు. ప్రైవేటుగా ఉన్నత చదువులు చదివారు.ఆమె తండ్రి పాటిబండ్ల సీతాపతిరావు. ఆర్టీసీ ఉద్యోగి. కార్మికసంఘ నాయకుడు. తల్లి ఝాన్సీలక్ష్మి. బాల్యం నుంచీ తల్లి ప్రభావమే ఆమెపై ఉండేది. ఆడపిల్లలపట్ల ఆంక్షలు, వివక్ష బలంగా ఉండే రోజుల్లో హైపర్ యాక్టివ్ ఛైల్డ్‌గా ఆటపాటల్లో గడిపేవారు.
‘ఫలానా పత్రికలో సీరియల్ చదువు ఆడపిల్ల ఎలా అణగిమణగి ఉండాలో తెలుస్తుంది’ అని తల్లి ఇచ్చిన సలహాతో ఆ సీరియల్ చదివారు రజని. ఇక అప్పటినుంచీ ఆమె ధ్యాస పుస్తకాలమీదకు మళ్ళింది.స్కూల్లో తెలుగు మాస్టారు ఎంతో శ్రావ్యంగా తెలుగు పద్యాలు నేర్పడం, తల్లి చెప్పే కథలు, సామెతలు భాషమీద ఆమెకు మమకారాన్ని పెంచాయి. చుట్టుపక్కలున్న ఆడవాళ్ళ కష్టాలు, బాధలు, సమస్యలు ఆమెను కదలించేవి. రంగనాయకమ్మ ‘జానకి విముక్తి’ నవల చదివాక ఆమె దృక్పథంలో మార్పు రావడంతో సాహిత్యాన్నీ, వాస్తవికతను పోల్చిచూస్తూ సత్యాన్వేషణ చేసేవారు.ఆడపిల్ల పుస్తకాలు ఎక్కువ చదివితే చెడిపోతుందనే దృక్పథం ఉన్న ఆ కాలంలో, ఇంట్లోవాళ్ళకి తెలియకుండా గ్రంథాలయానికి వెళ్ళే సాహిత్యపఠనం చేసేవారు రజని. రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోయాక, దిండుకింద దాచుకున్న లైబ్రరీ పుస్తకాల్ని జీరో క్యాండిల్ బల్బ్ వెలుగులో చదువుకునేవారు.
అలా ఎవరు ఎంతగా నియంత్రించేందుకు యత్నించినా ఆమె పుస్తకపఠనం ధారాళంగా కొనసాగింది.మగ పిల్లలకే ప్రాధాన్యమిస్తూ, ఆడపిల్లను ‘గుండెలమీద కుంపటి’గా భావించడం, ఎనిమిదో తరగతికే పెళ్ళిళ్ళు చెయ్యడం, ఆడపిల్లలకు ఎలాంటి గౌరవం లేకపోవడం, ఆడపిల్ల చదువుకుంటే ఇంకా పెద్ద ఉద్యోగస్తుణ్ణిచ్చి పెళ్ళి చెయ్యాలన్న సమాజ ధోరణి ఆమెకు ఆగ్రహం రప్పించేవి. నిరంతర ఆలోచనలతో ఆమె కుతకుతలాడిపోయేవారు. వీటినుంచి బయటపడే మార్గం చదువు ఒక్కటే అనుకున్నారు రజని. అలాంటి సమయంలో కొడవటిగంటి కుటుంబరావు రచనలు ఆమెకు ఊరట కలిగించేవి.
కథా రచయిత్రిగా
రజని మొదట్లో కథలు ఎక్కువ రాసేవారు.1987లో ఆంధ్రజ్యోతి వీక్లీ న్యూజెర్సీ కథల పోటీల్లో రెండుసార్లు ఆమె కథలకు నగదు బహుమతులు లభించాయి. అలా ఆమె తొలికథ ‘అపరిచిత అతిథి’ ఆంధ్రజ్యోతి వీక్లీలో ఆమె ఫోటోతో సహా వచ్చింది. మరో కథ ‘మందు’. ఈ రెండు కథలూ స్ర్తీల సమస్యలను ప్రతిబింబించినవే. దీంతో ఆమె రచయిత్రిగా పేరు పొందారు.