పుస్తకం కంటే కూడా కవర్‌ పేజీ బాగుందనో, లోపల మంచి బొమ్మలున్నాయనో కూడా నేను పుస్తకాలు కొంటుంటాను అంటున్నారు రచయిత అనిల్ బత్తుల. బహుశా ఈ అభిరుచి తనను బాలసాహిత్యం వైపు నెట్టిందనుకుంటానని చెబుతున్నారు. ఇటీవల విడుదలయిన ఆయన పంచతంత్రం పుస్తకం గురించి ఆంధ్రజ్యోతి సాహిత్యంతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు మీకోసం..

ఇటీవల మీ ‘పంచతంత్రం’ పుస్తకం వచ్చింది. ఇప్పటి దాకా తెలుగులో ఎన్నో పంచతంత్రాలు ఉండగా దీని ప్రత్యేకత ఏమిటి?
ఈ పుస్తకాన్ని తెచ్చే ముందు తెలుగులో ఇరవై పైచిలుకు పంచతంత్రాలను పరిశీలించాను. మూలం సంగతి అలా ఉంచితే పంచతంత్రానికి చిన్నయ సూరి వంటివారు వాడే వచనంలో ప్రత్యేకమైన లయ, భాష ఉంది. అందులోని జంతువుల పేర్లకు ఎంత విశిష్టత ఉందో అటువంటి కథనానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఒరవడిని పోగొట్టకుండా ఈ తరం చిన్నారులను దృష్టిలో పెట్టుకుని సరళంగా ఉండేట్లు పంచతంత్రం తేవాలని అనుకున్నాను. దానికితోడు తెలుగులో బాపు బొమ్మలతో పంచ తంత్ర కథలు లేవు. బాపు పంచతంత్రం గేయ కథలకు వేసిన బొమ్మలను ఈ పుస్తకానికి వాడుకోడానికి ఆయన కుటుంబ సభ్యులు అనుమతి ఇవ్వడంతో ఈ పుస్తకం వేయగలిగాను.
 
బాలసాహిత్యంపై మీ ఆసక్తి గురించి చెప్పండి?
నిజానికి నాకు బొమ్మలంటే ఇష్టం. కొన్నివేల ఇంగిలీషు, తెలుగు బొమ్మల పుస్తకాలు దేశవిదేశాల నుంచి సేకరించాను. పుస్తకం కంటే కూడా కవర్‌ పేజీ బాగుందనో, లోపల మంచి బొమ్మలున్నాయనో కూడా నేను పుస్తకాలు కొంటుం టాను. బహుశా ఈ అభిరుచి నన్ను బాలసాహిత్యం వైపు నెట్టిందనుకుంటాను. దానికితోడు చిన్నపిల్లల కోసం రాదుగ ప్రచురించిన రష్యన్‌ అనువాదాలు విపరీతంగా ఆకర్షించాయి. అన్ని పుస్తకాలు రాసిన టాల్‌స్టాయ్‌ వంటి మహా రచయిత చివర్లో చిన్న పిల్లలకోసం కథలు రాయడం నన్ను అబ్బుర పరిచింది. ఈ రష్యన్‌ పుస్తకాలను సేకరించే క్రమంలో అన్ని ప్రపంచ భాషల బాల సాహిత్యాన్ని, జానపద కథలను తెలుసుకుని చదువుతుండటంతో నా అభిరుచి, ఆసక్తి బాలసాహిత్యమేనని నాకూ అర్థమైంది.
 
మీ పాత పుస్తకాల సేకరణ గురించి చెప్పండి?
రాదుగ రష్యన్‌ అనువాద పుస్తకాలు సేకరించే క్రమంలో కళలకు కేంద్రమైన ఫ్రాన్సు రచయితల తెలుగు అనువాదాలు ఏమైనా ఉన్నాయా అని వెతకడం మొదలు పెట్టాను. ఎప్పుడో ప్రచురించిన ‘బీదలపాట్లు’, ‘నీలికళ్లు’, ‘నేలను పిండిన ఉద్దండులు’ వంటి పుస్తకాలు దొరికాయి. ఇప్పటికీ అనేక పుస్తకాల ఆచూకీ లేదు. ఒక పాతపుస్తకాల విక్రేత ద్వారా ఎక్కువ పుస్తకాలు రాజమండ్రి పేపర్‌ మిల్లుకు వెళ్తుంటాయని తెలుసుకుని చాలా బాధ పడ్డాను. గతంలో ప్రచురించిన మంచి పుస్తకాలను అందరి దృష్టిలోకి తేవడం మొదలు పెట్టాను. వాటిని యాంటిక్స్‌లా భద్రపరచాల్సిన అవసరం ఎంతో ఉంది.
 
 
81792 73971