వేమూరి సత్యనారాయణకథానాటక రచయిత, నటుడు, సినీ రచయిత, సీనియర్ జర్నలిస్టు, సంపాదకుడు వేమూరి సత్యనారాయణ.. ప్రత్యేకత. ప్రతి కథకూ సామాజిక ప్రయోజనం ఉండాల్సిన అవసరం లేదు, కథకు రీడింగ్ ప్లెజర్ ఉండాలి అంటున్న ఆయన ఇంటర్వ్యూ...
కృష్ణాజిల్లా ఘంటసాలపాలెం మా ఊరు. నాన్న వేమూరి రామయ్య, అమ్మ విశాలక్ష్మి. 1944 డిసెంబరు 1వ తేదీన మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టాను.
నాన్నతో ఆత్మీయానుబంధం
అమ్మానాన్నలకు నేను ఒక్కణ్ణే. నా కొడుకు చదువుకుంటే వాడి బతుకు బాగుంటుందన్నది నాన్న బలమైన ఆకాంక్ష.ఎంత ఖర్చైనా చదివించాలన్నది ఆయన బలమైన కోరిక. నేను కూడా నాన్న ఆకాంక్షలకు అనుగుణంగా ఎంతో ఆసక్తిగా చదువుకునేవాణ్ణి. టోటల్ మార్కులు, సబ్జెక్టువైజ్ మార్కుల్లో కూడా నాదే ప్రథమస్థానం. బందరులో ప్రీ–యూనివర్సిటీ, గుంటూరులో బిఎస్సీ, డబుల్ మ్యాథ్స్, ఫిజిక్స్ చదివాను.నాన్నకు నా మీద అపారమైన నమ్మకం, విశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసంతోనే ఉన్న అరెకరాన్నీ అమ్మి నాన్న నన్ను చదివించారు. ఆయన విశ్వసించినట్టే, జీవితంలో స్థిరపడి చివరివరకు నాన్నగారిని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాను. నా తండ్రితో నాకున్న గొప్ప అనుబంధం ఉంది.అప్పట్లో ఆంధ్రపత్రిక బాగా పాపులర్. అందులో సీరియల్స్ ఆసక్తిగా చదివేవాణ్ణి. తర్వాత ముళ్ళపూడి, బాపు, రావికొండలరావు, వి.ఎకె.రంగారావు, నండూరి రామ్మోహనరావులు సంపాదకవర్గంగా, ‘జ్యోతి మంత్లీ’ అప్పట్లో వెరైటీగా వచ్చేది. అందులో ‘హమేషా తమాషా’ అనే ఫీచర్‌కి సత్యగోపాల్ కలంపేరుతో పంపిన నా కవిత 1963ప్రాంతంలో వచ్చింది. ఐదు రూపాయలు రెమ్యునరేషన్ పంపారు. అదెంతో అపురూపం, మోర్ వాల్యుబుల్‌గా అనిపించింది. ఆ డబ్బుతో గుంటూరులో సేవింగ్స్ బ్యాంక్ ఎకౌంట్ ఓపెన్‌చేశాను. ఆ డబ్బు ఇప్పటికీ అలాగే ఉంది.
స్నేహితుడితో సవాల్‌తొలినాటిక రచన
నా బాల్య స్నేహితులు వేమూరి బలరాం, అతడి కజిన్ వేమూరి నాగేశ్వరరావు. మేం ఒకే ఊరివాళ్ళం. నేను హైదరాబాద్‌లో ఉద్యోగం చేసేటప్పుడు తరచు కలుసుకునే వాళ్ళం. అలా ఒకసారి రవీంద్రభారతిలో కామెడీ నాటిక చూసి, బాగా ఎంజాయ్‌చేశాం. నేను సరదాగా, ‘‘కామెడీయే కదా, మనం కూడా ఓ నాటిక రాసేయొచ్చు’’ అన్నాను. ‘‘భలేవాడివే, కామెడీ రాయడం చాలా కష్టం’’ అన్నాడు బలరాం. బలరాంకు నాటకాలంటే ఇష్టం. అతను నటుడు కూడా.‘వారం రోజుల్లో నాటిక రాసి చూపిస్తా’ అని సరదా ఛాలెంజ్ చేసి, ‘ఏడుపే మిగిలింది’ అనే నాటిక రాశాను.
అదే నా తొలి రచన.బలరాం చొరవ, ప్రోత్సాహంతో, మా స్నేహితులందరం వినాయకచవితి పందిట్లో ఆ నాటిక ప్రదర్శించాం. జనం నవ్వుకుంటూ ఎంతోబాగా ఎంజాయ్ చేశారు. పెద్ద సక్సెస్ కావడంతో, మల్కాజ్‌గిరి, ఖైరతాబాద్ చవితి పందిళ్ళలో కూడా ప్రదర్శనలిచ్చాం. రచయితగా గుర్తింపు రావడంతో అందరం కలిసి, ‘బాబూరాజేంద్రప్రసాద్ రిక్రియేషన్ క్లబ్’ స్థాపించాం. ఈసారి, ‘త్యాగమూర్తులు’ అనే రెండు గంటల నాటకం రాసి మా ఊళ్ళో ప్రదర్శించాం. అదీ సక్సెసే.
కెరీర్‌ను మార్చేసిన స్నేహితుడు
‘‘నాటకరంగం నిర్లక్ష్యానికి గురవుతోంది. ఏ పత్రికా సరైన గుర్తింపు ఇవ్వడం లేదు, దానికి ప్రోత్సాహం రావాలి, నీకు రచనాసక్తి ఉంది కదా, నేను ఒక పత్రిక పెడదాం అనుకుంటున్నాను, ఆ బాధ్యతలు చూసుకో’’ అని బలరాం నన్ను ఆహ్వానించడం నా కెరీర్‌లో పెద్ద మార్పు. నా టేలంట్‌ని గుర్తించి నన్ను తన పత్రికలోకి పిలిచి నా జీవితాన్ని పెద్ద మలుపు తిప్పినందువల్లనే నేను ఇలా పత్రికారంగం, సినిమా రంగం, సాహిత్యరంగాలలో రాణించగలిగాను.