రచయిత ఎప్పుడూసెలబ్రిటీయే ! రాతిని చీల్చుకుని రావిమొక్క పుట్టుకొచ్చినట్టు ఆ టింజ్‌ ఉన్నవాళ్ళు ఏ మూలున్నా ముందుకు దూసుకొస్తారు . అందరినీ ఆకర్షిస్తారు . ఆ కోవకు చెందిన యువ సినీ రచయిత వెంకట్‌ శిద్దారెడ్డి.‘‘రచయిత మళ్ళీ సెలబ్రిటీ కావాలి’ అనే బలమైన ఆకాంక్ష ఆయనలో కనిపిస్తుంది. ఫేస్‌బుక్‌ ఫాంటసీలూ, సెల్‌ఫోన్‌ స్వైరవిహారాల మధ్య యువ రచయితలను పోగేసి కొత్త సొబగులతో పుస్తకానికి ప్రాచుర్యం తెస్తున్నారు. పాతపుస్తకాలకు ఆటపట్టైన హైదరాబాద్‌ ఆబిడ్స్‌ ఫుట్‌పాత్‌మీద కూర్చుని ‘మీట్ ద రైటర్‌’ అంటూ పాఠకులతో మాట కలిపి పుస్తక ప్రియుల్లోకి దూసుకెళుతున్నారు.‘‘సాహిత్యం–సినిమా, తూర్పూపడమరలైపోయాయి. ఈ గ్యాప్‌ భర్తీ కావాలంటే, నవలే దిక్కు. ఎందుకంటే, ఎక్కువమంది రీడర్స్‌ని సృష్టించేది నవలే. అందుకే మళ్ళీ నవలా సామ్రాజ్యం రావాలి’’ అంటున్నారు వెంకట్‌ శిద్దారెడ్డి.

పుస్తకాలు–సినిమాలపైనే మోజుబాల్యంనుంచీ సాహిత్య–సినిమా రెంటిమీద విపరీతమైన ప్రేమ పెంచుకున్న వెంకట్‌ శిద్దారెడ్డి విజయనగరం సైనిక్‌ స్కూల్లో చదివినా, అక్షర సైనికుడే అయ్యారు. తల్లి స్ఫూర్తితో చిన్నప్పుడే నవలలు చదివారు. సైనిక్‌ స్కూల్‌ లైబ్రరీలో విస్తారంగా ఆంగ్లసాహిత్యం చదివి, ఎనిమిదోక్లాసులోనే సోమర్‌సెట్‌ మామ్ కథను తెలుగులోకి అనువదించారు. ‘విపుల’ లో వచ్చిన తన తొలికథకు పాతికరూపాయలు పారితోషికం వచ్చింది. ఆ స్ఫూర్తితో రచయితగానే బతకాలని ఫిక్సయ్యారు. తోటి విద్యార్థుల్లో సెలబ్రిటీ అయ్యారు.సినిమా అంటే ఆయనకు పిచ్చి. రహస్యంగా సైనిక్‌ స్కూల్‌ గోడలు దూకెళ్ళి సినిమాలు చూసేవారు. చిరంజీవి–బాలకృష్ణ, నాగార్జున–వెంకటేష్‌ అభిమానులు ఆయనకు డబ్బులిచ్చి సినిమాలకు పంపి ఆయన అభిప్రాయాలనే ప్రామాణికంగా తీసుకునేవారు. అలా సాహిత్యానికీ, సినిమాకీ మధ్య అనుబంధాన్ని బాల్యంలోనే గ్రహించిన శిద్దారెడ్డికి సినిమాల్లో రాణించాలనే కోరిక బలపడింది.

కుటుంబ ఒత్తిడివల్ల హైదరాబాద్‌లో డిగ్రీ చదివారు. తన టాటెంట్‌ గుర్తించిన లెక్చరర్‌ ప్రోత్సాహంతో తోటి ఎం.సి.ఎ ఎంట్రన్స్ విద్యార్థులకు క్లాసులు చెబుతూ గంటకు 500 రూపాయలు సంపాదించేవారు. ఆ డబ్బుతో ఆంగ్లసాహిత్యం కొనుక్కునేవారు. ఎం.సి.ఏ లో ఆలిండియా ట్వెల్త్‌ ర్యాంక్‌ సంపాదించి, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో చేరి, విద్యార్థి సంఘ నాయకుడిగా, ప్లేస్‌మెంట్‌ కోఆర్డినేటర్‌గా పనిచేసేవారు. గుంటూరు శేషేంద్రశర్మ పరిచయంతో మంచి అనుభవాలు మూటగట్టుకున్నారు. హైదరాబాద్‌లో కొంతకాలం, ఇంగ్లాండ్‌లో ఐదేళ్ళు సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేసి ఇండియా తిరిగివచ్చి తన సినిమా కల నెరవేర్చుకునేందుకు సురేష్‌ ప్రొడక్షన్స్‌ స్టోరీ డిపార్ట్‌మెంట్‌లో ఏడేళ్ళు పనిచేశారు. మరోవైపు కథలు రాస్తూ, సాహితీమిత్రులతో అనుబంధం పెంచుకున్నారు.

సినిమాలోని అన్ని విభాగాల్లో ప్రావీణ్యం సంపాదించి, ‘సినీ సమర్పకుడు’ గా రాణిస్తున్నారు.మొదట ‘దృశ్యం’ సినిమాకు, తర్వాత, ‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికేమైంది’, ‘కేరాఫ్‌ కంచరపాలెం’, ‘మెంటల్‌ మదిలో’, ‘మల్లేశం’, ‘దొరసాని’ చిత్రాలకు క్రియేటివ్‌–ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు.తనే రచయిత, దర్శకుడు, ఎడిటర్‌ కావడంవల్ల, ఏ సినిమాకు పనిచేసినా, ఆయన రచనా సహకారం కూడా చేస్తారు. ఆయన సమర్పించిన చేనేత కార్మికుల యదార్థజీవితావిష్కరణ చిత్రం ‘మల్లేశం’ తాజాగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. త్వరలో దొరసాని సినిమా రాబోతోంది. ‘‘ఈ సినిమాలన్నీ రెండుమూడు దశాబ్దాల్లో రాని సరికొత్తకథలే, అవన్నీ సూపర్‌ డూపర్‌ హిట్లే’’ అన్నారాయన. ‘కేస్‌ నెంబర్‌ ట్రిపుల్‌ సిక్స్‌’ అనే Experimental Movie కి దర్శకత్వం వహించారు వెంకట్‌ శిద్దారెడ్డి.