కథానవలా రచయిత కట్టా రాంబాబు. హృదయాన్ని కదిలించే యదార్థ ఘటనలే ఆయన కథావస్తువులు. మానవ సంబంధాలే ఈనాటి కథావస్తువు కావాలి అంటారాయన.వృత్తిరీత్యా కళాశాల ప్రిన్సిపాల్‌గా విద్యార్థుల తీరుతెన్నులను, విద్యారంగంలో మార్పులను సన్నిహితంగా పరిశీలిస్తున్న రచయిత ఆయన.టెక్నాలజీ మోజులో పడిన మన యువత ప్రపంచవ్యాప్తంగా వస్తున్న గొప్ప గొప్ప అవకాశాల్ని అందిపుచ్చుకోవడంలో విఫలమతుతోందని ఆవేదన చెందుతున్నారు . ఆయన.పిల్లల తీరుతెన్నులను నిత్యం పర్యవేక్షించకపోతే తల్లిదండ్రులే చేజేతులా వారి జీవితాల్ని నాశనం చేసినవారవుతారని హెచ్చరిస్తున్న కట్టా రాంబాబు ఇంటర్వ్యూ...

తూర్పుగోదావరిజిల్లా అమలాపురం సమీపంలోని గోడి ఆయన స్వగ్రామం. ఆయన తండ్రి కట్టా నరసింహమూర్తి. అమ్మ వెంకటరమణమ్మ. వ్యవసాయ కుటుంబం. తండ్రి గ్రామ సర్పంచ్‌గా చేశారు. ముగ్గురు అన్నదమ్ములు, నలుగురు అక్కచెల్లెళ్ళమధ్య ఆయన ఐదో సంతానం. 1951జులై 15వ తేదీన పుట్టిన రాంబాబుపై మొదటినుంచీ తల్లి ప్రభావమే ఎక్కువ. తల్లి స్ఫూర్తితో హైస్కూలు స్థాయి నుంచే వారపత్రికలు, నవలలు బాగా చదవడం అలవడింది. ఆయన చదివిన కథల్నీ, వాస్తవ జీవితాన్ని బేరీజువేసుకుంటూ, చుట్టూ ఉన్న సమాజాన్ని గమనిస్తూ, అంతర్మథనం చెందేవారు. తల్లి సలహాతో రాచకొండ విశ్వనాథశాస్త్రి, బీనాదేవి లాంటి పలువురు ప్రసిద్ధ రచయితల రచనలు చదివేవారు.

అప్పట్లో ఆంధ్రప్రభలో వచ్చిన ఆదివిష్ణు ‘సగటుమనిషి’ ఆయనకు చాలా నచ్చిన సీరియల్‌.టెన్త్‌ వరకు కొమరిగిరిపట్నంలో చదివాక, అమలాపురం ఎస్.కె.బి.ఆర్‌. కళాశాలలో బి.ఏ పూర్తిచేసి విశాఖ ఆంధ్రాయూనివర్సిటీలో ఎం.ఏ ఆర్థికశాస్త్రం చదివారు. 1977లో ప్రకాశంజిల్లా పొదిలి డిగ్రీ కళాశాలలో ఎకనమిక్స్‌ లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరి అక్కడే 33 ఏళ్ళు పనిచేశారు. ప్రస్తుతం రాజమండ్రిలో స్థిరపడి, డిగ్రీ–పీజీ కాలేజీలో ప్రిన్సిపాల్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పటినుంచే రాంబాబు కథలు రాయడం ప్రారంభించారు. ప్రముఖ రచయిత పైడిపాల కళాశాలలో ఆయనకు తెలుగు అధ్యాపకులుగా ఉండేవారు. కథలపట్ల కట్టా రాంబాబుకు ఆసక్తి ఉందని గ్రహించి, రచనలు చేయమని పైడిపాల ఆయనను బాగా ప్రోత్సహించేవారు. ఆ తర్వాత కూడా వారి మధ్య అనుబంధం కొనసాగింది.

150 పైగా కథలు

1973లో కుటుంబ సంక్షేమశాఖవారు కళాశాల విద్యార్థులకు నిర్వహించిన కథలపోటీల్లో రాంబాబు రాసిన ‘కంచె’ కథకు ప్రశంసాపత్రం లభించింది. అదే ఆయన మొదటి కథ. అయితే అది ప్రచురితం కాలేదు. ఆయన ఎం.ఏ చదువుతుండగా, విజయవాడ నుంచి వచ్చే ‘జయశ్రీ’ మాసపత్రికకు పంపించారు. అలా 1975లో ఆయన మొదటి కథ అచ్చులో వచ్చింది. ఇక అప్పట్నుంచీ పత్రికల్లో ఆయన కథలు రాయడం ప్రారంభించారు.ఉద్యోగంలో స్థిరపడ్డాక పూర్తిగా కథారచనపై దృష్టి కేంద్రీకరించారు రాంబాబు.1987వెలువడిన ‘కొడుకు’ కథవల్ల ఆంధ్రజ్యోతి వీక్లీతో ఆయనకు అనుబంధం ఏర్పడింది. పాఠకుల నుంచి ఆ కథకు మంచి స్పందన లభించింది. తర్వాత వచ్చిన కథ ‘సన్మానం’.201లో నవ్య వీక్లీ కథలపోటీల్లో ఎంపికై వెలువడిన ఆయన కథ ‘ఆమె నవ్వు’. ఆ తర్వాత ఆయన రాసిన ‘విలువలు’, ‘జీవన వ్యథ’, ‘ఫేస్‌ రీడింగ్‌’, ‘నైవేద్యం’ కథలు ‘నవ్య వీక్లీ’లో వెలువడ్డాయి.