ప్రముఖ కవి, కథానవలారచయిత ఎమ్వీ రామిరెడ్డి .అంతకుమించి పరోపకారం మూర్తీభవించిన మట్టిమనిషి.తనకొచ్చే పిడికెడంత జీతంలోనే ఎంతోమంది పేద విద్యార్థులను చదివించి, వారిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్ది తన ఊరును సంస్కరించారు రామిరెడ్డి.‘‘నా రచనలకు మనిషి, మనిషితనమే కేంద్రం, మానవ సంబంధాల ఋజువర్తనే నా సాహిత్యం. ప్రతిమనిషిలోనూ పాజిటివ్‌ ఎనర్జీనే నేను చూస్తాను’’ అంటున్న ఎమ్వీ రామిరెడ్డి ఇంటర్వ్యూ

గుంటూరుజిల్లా తుళ్ళూరు మండలం పెదపరిమి మా స్వగ్రామం. నాన్న మువ్వా చినబాపిరెడ్డి. అమ్మ శివనాగేంద్రమ్మ. మాది రైతు కుటుంబం. 1970 ఫిబ్రవరి 7వ తేదీన నేను పుట్టాను. నాకు ఒక అక్క, తమ్ముడు. నా నాలుగోయేటే నాన్న మరణించారు. అమ్మే మమ్మల్ని పెంచిపెద్ద చేసింది. సెలవుల్లో అమ్మ మమ్మల్ని పొలానికి తీసుకెళ్ళేది. పొలంలో విత్తు నాటడం, కలుపు తియ్యడం, పత్తి కోయడం లాంటి పనులు చేసేవాళ్ళం. అలా నెలలో నాలుగు ఆదివారాలు పొలం పని చేసేవాళ్ళం. శ్రమ విలువ, శ్రమ సౌందర్యం, డబ్బు విలువ ఏమిటో బాల్యంలోనే అమ్మ మాకు నేర్పింది. శ్రమచేసి సంపాదించిన ఆ డబ్బుతో సినిమాకో, మంగళగిరి తిరునాళ్ళకో వెళ్ళేవాళ్ళం. అందులో ఉండే గొప్ప సంతృప్తి, ఆనందం ఎవరికివారు అనుభవించి తీరాల్సిందే. ఎ.సి స్కూళ్ళల్లో చదువుకునే ఈ తరం పిల్లలకు అస్సలు శ్రమ విలువ తెలియదు. వారానికి ఒకసారైనా పొలం పనిచేసి వాళ్ళూ శ్రమ విలువ తెలుసుకోవాలి.

సమానత్వం నేర్పిన అమ్మమ్మ!

మా అమ్మమ్మ దాసమ్మ ప్రభావం నాపైన చాలా ఉంది. మా నాన్నను పెంచి పెద్దచేసిన మేనత్త రత్తమ్మగారు పక్షవాతంతో మంచంమీద ఉన్నప్పుడు, అసహ్యించుకోకుండా మా అమ్మమ్మ ఆమెకు ఏడాదిన్నరపాటు గొప్పసేవలు చేసింది. అప్పుడే అమ్మమ్మపై ఎంతో గౌరవం ఏర్పడింది. అందుకే అమ్మమ్మపై మూడు కవితలు రాశాను. పాతకాలపు సంగతులు, కలిసి పంచుకుతినే ఆనాటి అనుబంధాలగురించీ కథలు కథలుగా అమ్మమ్మ నాకు చెప్పేది. అలా నాలో సమానత్వ దృక్పథం నాటుకోవడానికి అమ్మమ్మ దోహదం చేసింది.మా మాస్టారు పాపినేని శివశంకర్‌ అద్భుతంగా పాఠాలు చెబుతూ, తెలుగు భాషా మాధుర్యాన్ని చవిచూపించడంతో సాహిత్యాధ్యయనం ప్రారంభించాను. లైబ్రరీకెళ్ళి పుస్తకాలు విపరీతంగా చదివేవాణ్ణి. కొడవటిగంటి కుటుంబరావు, తిలక్‌ ‘అమృతం కురిసినరాత్రి’ నా గుండెకు పట్టేశాయి. ఇంటర్‌ తర్వాత పాలిటెక్నిక్‌ చదివి, బి.ఏ తెలుగు కూడా చేశాను.

అదే నాకు వేదవాక్కు

మా కాలేజీకెళ్లేదారిలో చెరువుదగ్గర బిందెలకు మాట్లువేసే కుటుంబం ఉండేది. వాళ్ళ పేదరికంపై ‘అతుకుల బతుకులు’ అనే కవిత రాశాను. ఈ కవితకే రాజమండ్రి సాహితీసంస్థవారు ప్రథమ బహుమతి ఇచ్చారు. దాంతో నాకు బాగా నమ్మకం వచ్చి, రా.విశాస్త్రి, కా.రా, మధురాంతకం నరేంద్ర వంటివారి రచనలు బాగా చదువుతూ కవితలు రాసేవాణ్ణి. సాహిత్య రచనల్లో పాపినేని శివశంకర్‌ నన్ను గైడ్‌ చేసేవారు. ‘‘నువ్వు అనుభవించనిది, నీ గమనంలోకి రానిది ఏదీ నువ్వు రాయొద్దు’’ అని ఆయన నాకు సూచించారు. ఈనాటికీ అదే నాకు వేదవాక్కు.నా కథలు, కవిత్వంనా తొలి కవిత ‘నీ రాకకై’ ఆంధ్రభూమి వీక్లీలో వచ్చింది. 1992లో ఒక అంధురాలు గురించి నేను రాసిన కథ ‘చూపున్న మనిషి’ ఆహ్వానం పత్రికలో వచ్చింది. అదే నా తొలి కథ. అలా కవితలు, కథలు రాస్తూ వచ్చాను.

నా పెళ్ళికి ముందురోజున, అంటే 23 మే, 1997లో నా తొలి కవితా సంపుటి ‘బిందువు’ ఆవిష్కరణ సభ మా ఊళ్ళోనే జరిగింది. ఆ సభకు శివారెడ్డి, దేవీప్రియ, డా.వి.చంద్రశేఖరరావు, పెనుగొండ లక్ష్మీనారాయణ ప్రభృతులు వచ్చారు. అదే వేదికపై మా నాన్నగారి పేరిట ఒక ట్రస్ట్‌ కూడా ప్రారంభించాను. ట్రస్టు తొలి వార్షికోత్సవంనాడు పాపినేని శివశంకర్‌గారి ‘ఆకుపచ్చ నౌక’, కేతవరపు వెంకట రమణమూర్తిగారి ‘కుంచెకందని చిత్రం’ పుస్తకాలు మా ట్రస్టు తరపునే ఆవిష్కరింపజేశాను. ఇప్పటివరకు నేను రాసిన మూడు కవితా సంపుటిలు, రెండు కథాసంపుటిలు, ఒక నవల వచ్చాయి. మనిషిజాడ (2009) కవితా సంపుటిని దర్శకుడు క్రిష్‌ ఆవిష్కరించారు. నా మూడవ కవితాసంపుటి ‘అజరామరం’ 2015లో వెలువడింది. వీటికి ఎన్నో పురస్కారం లభించాయి.