భువి నుంచి దివికి ఏ గంధర్వకాంతో దిగివచ్చి తన సంగీతాన్ని మనకు వదిలి మళ్లీ వినువీధులకు వెళ్లిపోయిందా అనిపిస్తుంది ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి గాత్రం వింటుంటే! ప్రతి రోజూ ఉదయాన్నే వినే వేంకటేశ్వర సుప్రభాతమే కావచ్చు.. సంక్లిష్టమైన త్యాగరాజస్వామి వారి కృతులే కావచ్చు..సరళ సంగీత సుధలు ఒలికించే అన్నమయ్య కీర్తనలే కావచ్చు.. ఒకొక్కటి ఒక్కో ఆణిముత్యం. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు. ఆమె పరంపర మాత్రం కొనసాగుతూనే ఉంది. నేటికి సుబ్బులక్ష్మి పుట్టి శత వసంతాలు అవుతుంది. ఈ సందర్భంగా ఆమె జ్ఞాపకాలను ఒక సారి తలుచుకుందాం... 

సరోజ దళ నేత్రి హిమగిరిపుత్రి నీ పాదంభుజములే సదా నమ్మినానమ్మ శుభమిమ్ము శ్రీ మీనాక్షమ్మ.. 
 
ఇదీ.. తల్లి, గురువు, దైవం అన్నీ తానై చివరిదాకా వేలుపట్టి నడిపించిన అమ్మ ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి గురించి పాటలో వర్ణించమన్నప్పుడు.. ఆమె కుమార్తె రాధా విశ్వనాథన్‌ మదిలో మెదిలిన శ్యామశాస్త్రీ కృతి. 
 
కర్ణాటక సంగీతానికి రారాణి ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి స్వరంతో స్వరం కలిపి సంగీత ప్రయాణం చేసిన ఆత్మబంధం రాధా విశ్వనాథన్‌. దాదాపు అరవై ఏళ్లు ఈ తల్లీకూతుళ్లు ఇద్దరూ ఏక స్వరమై భక్తి రసాన్ని, ఆధ్యాత్మికతను రాగాలుగా పొంగించారు. ముప్పయి ఏళ్లకు పైగా అనారోగ్యానికి గురైనా, ప్రస్తుతం పూర్తిగా వీల్‌చైర్‌కే అంకితమైనా సంగీత సాధనను ఆమె విడువలేదు. ఉదయాన్నే రెండు గంటలు ధ్యానం చేసుకోవడం.. నిరంతరం మనసులోనే సంగీతాన్ని మననం చేసుకోవడం ద్వారా తనకు తానే మానసిక శారీరక చికిత్స చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు. వయసు మీద పడుతున్నా అంతులేని జ్ఞాపకశక్తి ఆమె సొంతం. మనవరాలు ఐశ్వర్యకు పూర్తిస్థాయిలో సంగీత తరగతులు తీసుకుంటున్నారు. ఎం.ఎస్‌ శత జయంతి సందర్భంగా 82 ఏళ్ల కుమార్తె రాధా విశ్వనాథన్‌.. అమ్మ సుబ్బులక్ష్మితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
 
అమ్మ సుబ్బులక్ష్మితో మీ ప్రయాణం ఎలా సాగింది..? 
చిన్నప్పటి నుంచి అరవైఏళ్లు అమ్మతో కలిసి పాడాను. నేను ఒక్కదాన్నే చేసిన కచేరీలు పన్నెండు. అమ్మ ఒక్కరే చేసిన కచేరీలు పది. ఇద్దరం కలిసే అన్ని వేదికలను పంచుకున్నాం. నాకు ఆరోగ్యం బాగలేకపోతే అమ్మ కచేరీలు ఒప్పుకునేది కాదు. అమ్మకు ఎనభై ఏళ్ల వయసు వచ్చాక కూడా నిత్య విద్యార్థుల్లా ఇద్దరం నేర్చుకుని పాడేవాళ్లం. అమ్మతో స్వరం పంచుకోవడం నాకు చాలా గర్వంగా ఉంటుంది. దాన్నో అదృష్టంగా భావిస్తాను. ప్రతి వేదికలోనూ.. ప్రతి పురస్కారాన్ని అందుకున్నప్పుడు అమ్మ నా గురించి తలుచుకునేవారు. అది చాలు అనిపిస్తుంది. నేను ఒక్కదాన్నే కచేరీలు చేసినప్పుడు అమ్మ నాకు దగ్గరుండి మార్గదర్శనం చేసేవారు. తప్పులుంటే సరిదిద్దేవారు. అంత అదృష్టం ఇంకెవరికి దక్కుతుంది.
 
మీకు నాట్యంలో, నటనలో ప్రవేశం ఉంది కదా, ఎందుకు మానేశారు? 
చిన్నప్పటి నుంచి ఇరవైరెండేళ్లు వచ్చే వరకు భరతనాట్య ప్రదర్శనలు ఇచ్చాను. ఒకవైపు కచేరీలు కూడా చేస్తూ ఉన్నాను. ‘మీరా’ చిత్రంలో చిన్నప్పటి మీరాబాయిలా నటించాను. తర్వాత పూర్తిగా సంగీతం పైనే దృష్టి పెట్టాను.
 
సుబ్బులక్ష్మిగారు భారతరత్న అందుకోవడం, యునైటెడ్‌ నేషన్స్‌ స్టాంప్‌ విడుదల చేసి గౌరవించడం మీకెలా అనిపించింది?
ఈ పురస్కారాలు వస్తాయని మేమెప్పుడూ ఎదురుచూడలేదు. సంగీత సాధన తప్ప మరేమీ ఆలోచించలేదు. ఆధ్యాత్మికతతో పూర్తిస్థాయి శాస్త్రీయ సంగీతాన్ని సాధన చెయ్యడం.. జీవితాంతం నేర్చుకుంటూ ఉండేవాళ్లం. మేము పాడే ప్రతి పదానికీ అర్థాలు తెలుసుకుని అనుభూతి చెందుతూ పాడేవాళ్లం. నాన్నగారు చనిపోయిన రెండు నెలలకు అమ్మ భారతరత్న అందుకున్నారు. అమ్మ పేరుతో స్టాంప్‌ విడుదల చెయ్యడం గర్వంగా ఉంది. అయితే ఆ స్టాంపును నేను ఇంతవరకు చూడలేదు.
 
ఒక తరం తరువాత సంగీతాన్ని జీవితంగా మలుచుకుంటున్న ఐశ్వర్య (మనవరాలు)ను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? 
నా పిల్లలను నేనెప్పుడూ సంగీతం నేర్చుకోమని ఒత్తిడి చెయ్యలేదు. వారు కచేరీలు చేయకపోయినా సంగీతజ్ఞానం బావుంది. నా కుమార్తె లక్ష్మి కూడా పాడుతుంది. తనకు రెండువేలకు పైగా పాటలు గుర్తున్నాయి. నాకున్నంత జ్ఞాపకశక్తి నా కుమార్తెకు కూడా ఉంది. తనకు పదేళ్ల వయసులో నేను హనుమాన్‌ చాలీసా పాడుతుంటే నాతో కూడా పూర్తిగా పాడింది. నాకు చాలా ఆశ్చర్యమేసింది. నేను తనకేమీ నేర్పలేదు. పాడుతుంటే విని తనే నేర్చుకుంది. కానీ మా సమకాలీకుల పిల్లలు పాడుతుంటే.. సుబ్బులక్ష్మి బాణీ కర్ణాటక సంగీతాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మాకు సంగీత వారసత్వం లేదే అని బాధగా ఉండేది. ఆ బాధను ఇప్పుడు నా మనవరాలు ఐశ్వర్య తీర్చేసింది. చాలా బాగా పాడుతున్నందుకు సంతోషంగా ఉంది.
మీరెందుకు మీ సంగీత బాణిని ఇప్పటి వరకు విస్తృతం చెయ్యలేదు? 
మేమెప్పుడూ నేర్చుకునే దశలోనే ఉన్నాం. ఎవరికైనా నేర్పించడానికి సమయం ఉండేది కాదు. నేను కూడా అమ్మకు సమయం లేనప్పుడు ఇతర గురువుల దగ్గరికి వెళ్లి నేర్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎం.ఎస్‌ బాణీని విని నేర్చుకోవడానికి చాలామంది ప్రయత్నించి వదిలేశారు. అమ్మ తరువాత నేను.. ఇప్పుడు ఐశ్వర్య, సౌందర్యలు మాత్రమే ఆ బాణీలో పూర్తి పట్టుతో పాడగలం. నాకు తెలిసినదంతా ఇప్పుడు ఐశ్వర్యకు నేర్పుతున్నాను.
 
అప్పట్లో మీరు పాడిన కర్ణాటక సంగీతానికి.. ఇప్పుడు పాడుతున్న దానికీ తేడా ఉందా? 
కర్ణాటక సంగీతం, భరతనాట్యం ఎప్పటికీ ప్రాభవాన్ని కోల్పోవు. సంగీతం అలాగే ఉంది. కానీ కొందరు కళాకారుల్లో అంకితభావం లోపిస్తోంది. ఏదో పాడుతున్నాం అని కాకుండా పూర్తిగా నిమగ్నమై భావయుక్తంగా పాడితే బావుంటుంది. కళలు ఎప్పుడూ నిలిచే ఉంటాయి.
 
సంగీతంలో మీరు చేసిన ప్రయోగాలు.. 

చెప్పుకోదగ్గ ప్రయోగం అంటే ఒకే కృతిని నేను హయ్యర్‌ ఆక్టేవ్‌లో పాడితే.. అమ్మ లోయర్‌ ఆక్టేవ్‌లో పాడేవారు. వినడానికి చాలా అద్భుతంగా ఉండేది. అమ్మతో పాడిన ‘జననీ నిన్ను వినా.. రావే హిమగిరి.. తెర తీయగ రాదా’ కృతులు విన్నప్పుడు ఆ ప్రయోగం కనిపిస్తుంది. 

  • ఎం.ఎస్.సుబ్బులక్ష్మికి వంట చెయ్యడం రాదు. కానీ ఇంటికి ఎవరొచ్చినా వారికి స్వయంగా అతిథి మర్యాదలు చేసేవారు. బ్రెడ్‌ పీస్‌ మసాలా చాలా ఇష్టంగా తినేవారు. ఎక్కువ చింతపండు వేసి చేసిన వెత్తకొళంబు ఆమెకు చాలా ఇష్టం. 
  • ప్రతి కచేరీకి ముందు ఇడ్లీ పొడితో ఇడ్లీ తిని, అరకప్పు కాఫీ తాగి అర్ధగంట పూర్తిగా విశ్రాంతి తీసుకునేవారు. ఆ రోజు పాడాల్సిన కీర్తనల గురించి కుమార్తె రాధతో కాసేపు చర్చించేవారు. 
  • ఎం.ఎస్‌ ఇంట్లో ‘సుక్కు కాఫీ’ ప్రత్యేకంగా ఉండేది. ఎవరొచ్చినా ఇష్టంగా అడిగి తాగేవారు. శొంఠి, ధనియాలు, బెల్లం వేసి ఈ కాఫీ తయారు చేసేవారు. 
  • ప్రతి రోజూ ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి కుమార్తెతో కలిసి 108 సార్లు ‘అ’కార సాధన చేసేవారు. తానే స్వయంగా తోటలో పూలు కోసి, అల్లి దేవుడికి అలంకరించి పూజ చేసేవారు. 
  • ‘మీరాబాయి’ సినిమాలో నటించినప్పుడు ఒక భజన పాడుతూ పాడుతూ క్యారెక్టర్‌లో పూర్తిగా లీనమైపోయి నిజంగానే స్పృహ కోల్పోయారు ఎం.ఎస్‌. ఆ స్థాయి నటన తర్వాత భర్త సలహా మేరకు సినిమాల్లో నటించడం మానేశారు. ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి కేవలం సంగీతం కోసమే పుట్టారని ఆమె భర్త నమ్మారు. భక్తిని, సంగీతాన్ని విడదీయలేనంతగా మమేకమై పాడారు. 
  • యూత్ డ్యూ, ఛానల్‌ 18 పర్ఫ్యూమ్స్‌ అంటే ఎం.ఎస్‌కు చాలా ఇష్టం. అలాగే ఎవరైనా తనకు బహుమతిగా ఇచ్చిన చీరలను వారింటికి వెళ్లినప్పుడో, వారు తన దగ్గరికి వచ్చినప్పుడో గుర్తుపెట్టుకుని మరీ కట్టుకుని వారిని సంతోషపరిచేవారు. 
  • ప్రతి సంక్రాంతి పండుగకూ ఒక చిన్న సంచిలో పది రూపాయలు, పప్పు, బియ్యం, బెల్లం ఉంచి కుటుంబసభ్యులకు, పనివాళ్లకూ సమానంగా పంచేవారు.

 

ఝాన్సీ పాపుదేశి, బెంగళూరు