‘ప్రార్థన చేసే చేతుల కంటే సేవలు చేసే చేతులు మిన్న’ అని రుజువు చేశారామె. పిల్లలకు విద్యా సేవలు అందించాలని బాల్యంలోనే సంకల్పం తీసుకుని దాన్ని సాకారం చేసుకున్న మహోన్నతురాలు,విద్యావేత్త. ఆమే డాక్టర్‌ నన్నపనేని మంగాదేవి. మదర్‌ థెరీసా ఆమెకు స్ఫూర్తి.మొక్కలను, పిల్లలను ప్రేమిస్తూ, దాదాపు నలభై ఏడేళ్ల నుంచి ’ Education Sans Books’ అన్న కాన్సెప్టు ద్వారా విద్యాగంధాన్ని ఒక పరిమళంలా పంచుతున్నారామె. పిల్లలు ముద్దుగా ఆమెను ‘దేవమ్మా’ అని పిలుస్తుంటే ఆమె అలసటంతా మటుమాయమవుతుంది.గుంటూరు శివారు గ్రామం చోడవరంలోని వారి సంస్థలు ఒక కొత్త ప్రపంచానికి ఆనవాళ్లు. ఒత్తుగా పెరిగిన గుబురుచెట్లు, తీర్చిదిద్దినట్లుండే పొదరిళ్ళు, సహజాతాలతో అలరించే రకరకాల జంతువుల రూపాలు అనేక పుష్పజాతుల సంగమంతో క్యాంపస్‌ నిండా వ్యాపించిన ఒక సుగంధ పరిమళం, ఇవన్నీ మనల్ని అబ్బుర పరుస్తాయి. మణిదీపాల్లా చిన్నారులు ముచ్చట గొలుపుతూ అక్కడ తిరుగాడుతూ వుంటారు.ఎనభయ్యోపడికి దగ్గర పడుతున్నా ఇంకా ఏదో చేయాలన్న తపనతో అలుపెరగకుండా సాగుతున్న డా. మంగాదేవి నడచి వచ్చిన దారిలో ప్రయాణం చేస్తోంది  నవ్య నీరాజనం...

బాల్యం....

ఒకప్పుడు తెనాలి శివారుగా వుండి ఇప్పుడు తెనాలిలో కలసిపోయింది మా గ్రామం ఐతానగర్‌. 1937వ సంవత్సరంలో జన్మించాను. అమ్మ సత్యవతి,నాన్న రత్తయ్య. నేనూ, అన్నయ్య ఇద్దరమే. మధ్య తరగతి వ్యవసాయక కుటుంబం మాది. ఒంటెద్దు బండికి తెరలు కట్టుకుని ఘోషా సాంప్రదాయం పాటించే కుటుంబం మాది. ఆ రోజుల్లో కుటుంబాలలో ఆంక్షలున్నప్పటికీ, నేను ఏది చేస్తానన్నా నాన్న కాదనేవారు కాదు. నా చిన్నతనంలో ‘గాంధీగారిని చూడలేకపోయాననే బాధేదో నాకుండేది. నేను ‘థర్డ్‌ఫాం’లో వున్నప్పుడు గాంధీగారి అస్థికల్ని తీసుకు వెళుతున్న రైలు తెనాలి స్టేషన్‌కు వస్తోందంటే పిల్లలం అందరం స్టేషన్‌కు వెళ్లాం. సరే గాంధీగారి అస్థికల్ని చూశాం. నివాళులర్పించాం. అందరూ వెళ్లి పోయారు. నేను మాత్రం గాంధీగారి ట్రాన్స్‌లో వుండిపోయి అక్కడే స్టేషన్లో వుండిపోయాను. నా కోసం కంగారుపడుతూ మా నాన్న గుర్రబ్బండి కట్టించుకుని స్టేషన్‌కు వచ్చి తీసుకువెళ్ళాడు. దాంతో వారం రోజులు మా అమ్మ నాతో మాట్లాడలేదు.ఆంధ్రా యూనివర్సిటీలో ఉండి నాలుగేళ్ళు ఆనర్సు చదివినా పరీక్షలు రాయలేదు. డిగ్రీ పూర్తి కాలేదు. ఎందుకు, ఏమిటి అని ఇంట్లో అడగలేదు. అలా పిల్లలమీద నమ్మకం వుంచాలన్న విషయాన్ని నేను నా తల్లిదండ్రులు నుంచి నేర్చుకున్నాను.

చిన్నతనంలోనే ఉద్యోగం....

స్ర్తీ, శిశు సంక్షేమశాఖలో ఉద్యోగం చేస్తే పిల్లలకు, స్ర్తీలకు సేవ చేస్తామేమో అన్న వెర్రి నమ్మకంతో ఆ శాఖలో పడిన పోస్టులకు దరఖాస్తు చేశాను. నేను దరఖాస్తు చేసినట్లు మా తల్లిదండ్రులకు తెలీదు. ఎవరో చెబితే తెలిసింది. యూనివర్సిటీ రోజుల్లో చాలా చురుకుగా వుండేదాన్ని. అక్కడి ప్రిన్సిపల్‌ ఇచ్చిన అద్భుతమయిన టెస్టిమోనియల్స్‌ ఆ ఉద్యోగం నాకు రావటానికి దోహదం చేశాయి. నా మొదటి పోస్టింగ్‌ కడప జిల్లాలో ఇచ్చారు. ముద్దనూరులో చేసేదాన్ని. ఈసడింపులు వున్నా మనుషుల పట్ల ప్రేమ ఎక్కువగా వుండేది.

స్కూలు పెట్టడానికి కారణం...

చదువుకునే రోజుల్లో ఆల్బర్ట్‌ ష్వెట్జర్‌ అనే జర్మనీ డాక్టరు గురించి నాన్‌ డిటెయిల్స్‌ పుస్తకంలో చదివాను. ఆయన డాక్టరే కాకుండా గొప్ప సంగీతకారుడు. సంగీత ప్రదర్శనలు ఇస్తూ వుండేవాడు. అలా సమకూరిన డబ్బుతో ఆఫ్రికాలో పిల్లల కోసం ఆసుపత్రులు కట్టించేవాడు. మనుషులు ఇంత గొప్పగా వుంటారా అన్పించేది. అది నాలో ప్రకంపనలు పుట్టించింది. పిల్లలకు సేవచేయాలన్న బీజం అలా పడింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో చేరటానికి కూడా అదే కారణం. అయితే ఉద్యోగం చేస్తున్నప్పుడు నా భ్రమలు తొలగిపోయాయి. కొన్ని చేదు అనుభవాలు చూశాను. పనిచేస్తూ నిజమయిన సేవ చేయలేమని అర్థమయింది. అయితే ఇది నా అంతిమ లక్ష్యం కాదని తెలుసు కాబట్టి అవకాశం కోసం ఎదురు చూడసాగాను. అలాంటి అవకాశం నాకు 1961లో కోయంబత్తూరులో ఒక ట్రెయినింగ్‌ ప్రోగ్రాంలో కలిగింది. అక్కడ నా బ్యాచ్‌మేటు ప్రభావతి పరిచయమయింది. ఇద్దరి ఆలోచనలు కలిశాయి. స్కూలు మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాం. ప్రభావతి నా కన్నా 12 ఏళ్లు పెద్దది. వాళ్ళ నాన్నగారు తాసీల్దారు కాబట్టి తనకి చొచ్చుకుపోయే గుణం వుండేది. ఇద్దరం కలిసి మాంటిస్సోరి విధానంలో శిక్షణ కోసం కలకత్తా వెళ్లాం. మేం మొదలు పెట్టే స్కూలు మాంటిస్సోరి పద్ధతిలో వుండాలన్నది మా ఆలోచన.