సెయింట్ థెరిసాపై మొదట్లో కోపం ఉండేది
ఆమెకు సంబంధించి నరకం నుంచి వాళ్లను కాపాడుతోంది
అందరూ అన్నీ మంచి పనులే చేస్తారా.. 
స్త్రీ, పురుషులెవరైనా కట్టుబాట్లను గౌరవించాల్సిందే
ప్రస్తుత తరం మహిళలకు సీత ఒక రోల్‌ మోడల్‌ కాదు. 
 
నివేదిత దేవ్‌ సేన్‌ బెంగాలీ సాహితీ చరిత్రకు ఒక సజీవ సాక్ష్యం. ప్రముఖ కవి నరేంద్ర దేవ్‌ కూతురిగా.. నోబెల్‌ బహుమతి గ్రహీత అమార్త్యసేన్‌ మాజీ భార్యగా మాత్రమే కాకుండా తనకంటూ భారతీయ సాహిత్యంలో ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నివేదిత బెంగాలీ, ఇంగ్లీషు భాషల్లో ఇప్పటి దాకా 80 పుస్తకాలు రాశారు. పద్శశ్రీ సహా దేశంలో అనేక అత్యున్నత పురస్కారాలు అందుకున్న ఆమె- యువకళావాహినీ-గోపిచంద్‌ జాతీయ సాహితీ పురస్కారాన్ని అందుకోవటానికి గతంలో హైదరాబాద్‌ వచ్చారు. ఆ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు.. 
 
ఆనందంగా ఉండటమనేది ఒక భావన మాత్రమే. మనం ఆనందంగా ఉన్నామనుకుంటే ఉంటామంతే! మా అమ్మ చాలా కాలం అనారోగ్యంతో మంచం పట్టింది. అయినా మేం బాధపడలేదు. నేను విడాకులు తీసుకున్నప్పుడు- మా ఇంట్లో వాళ్లకు నన్ను ఎలా ట్రీట్‌ చేయాలో తెలియలేదు. ఎందుకంటే మా ఇంట్లో ఎవరూ ఎప్పుడూ విడాకులు తీసుకోలేదు. ఆ సమయంలో విడాకులు తీసుకున్నవారు ఇంకో పురుషుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి లేదా ఇంట్లో ఏడుస్తూ కూర్చోవాలి. నేను ఆ రెండూ చేయలేదు. ‘‘21 ఏళ్లు ఆనందంగా జీవించా. ఇప్పుడు ఇంకో కొత్త జీవితం. పిల్లలు నాకు పెళ్లి ఇచ్చిన బహుమతి..’’ అనుకున్నా. 
 
మీకు సెయింట్‌ థెరిసాతో చాలా సన్నిహిత సంబంధాలున్నాయి కదా.. ఆమెను మీరు ఎలా అంచనా వేస్తారు? 
ఆమెను ‘సెయింట్‌ ఆఫ్‌ కలకత్తా’ అని పేర్కొంటున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు బెంగాల్‌ అంటే ఠాగూర్‌ జన్మభూమి అని చెప్పేవారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా- కలకత్తా అని చెబితే మదర్‌ కర్మభూమి అని చెబుతారు. అయితే ఆమె మీద చాలా విమర్శలు వస్తున్నాయి. వాటిని నేను సమర్థించను. ఉదాహరణకు తన హోంలలోని అభాగ్యులను మరణించే ముందు క్రైస్తవ మతంలోకి మారుస్తుందనే విమర్శ బలంగా వినిపిస్తుంటుంది. మదర్‌కు సంబంధించినంత వరకూ- ఆమె వాళ్లు నరకానికి వెళ్లకుండా కాపాడుతోంది. నా చిన్నతనంలో ఈ విమర్శ విన్నప్పుడు- మదర్‌పై చాలా కోపం వచ్చేది. ఈ 78 ఏళ్ల వయస్సులో నేను మదర్‌ని అర్థం చేసుకోగలుగుతున్నా. అయినా- అందరూ అన్నీ మంచి పనులే చేస్తారా? కొన్ని చెడు పనులు కూడా చేస్తారు.. అసలు పని చేయకుండా ఉండటం కన్నా సేవ చేయటం మంచిదే కదా..