హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): తెలుగు సాహితీ లోకానికి అక్షర సామ్రాజ్ఞి రంగనాయకమ్మ. ఆధునిక సమాజానికి ఒక దివిటీగా నిలిచిన ప్రపంచ తత్వవేత్త కార్ల్‌మార్క్స్‌ ‘‘పెట్టుబడి’’ పుస్తకాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేసిన ఘనత ఆమె సొంతం. స్త్రీ వాదం మీదుగా శ్రామిక వర్గ విముక్తి పథంలో సాగే రంగనాయకమ్మ రచనలకు అభిమానులు కోకొల్లలు. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, తాత్విక దృక్పథాల పునాదులుగా మిక్కిలి రచనలు చేసిన రచయిత్రి తెలుగు నాట బహుశా రంగనాయకమ్మ ఒక్కరే.! ఆమె రచనలపై సాగిన విమర్శలు, వివాదాలూ తక్కువేం కాదు.! హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శన సందర్భంగా ప్రస్తుత సమాజంలో సాహిత్యం పాత్ర, పుస్తక పఠనం ఆవశ్యకత తదితర అంశాలపై రంగనాయకమ్మతో ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా ముచ్చటించింది. 

ప్రశ్న: హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శనతో మీకున్న పరిచయం? దానిపై మీ అభిప్రాయం?
రంగనాయకమ్మ : నాకు పరిచయం లేదు. ఎప్పుడూ వెళ్ళలేదు. ఇంట్లో వాళ్ళు ప్రతీసారీ వెళ్తారు. అక్కడ కొత్త పుస్తకాలు కనిపిస్తే ఫోన్‌లో చెపుతారు. నేను చెప్పేవన్నీ కొంటారు. పుస్తక ప్రదర్శన అవసరం. ఒక్కచోటే కాదు, అనేక చోట్ల జరుగుతూ ఉండాలి. 
 
ప్రశ్న: ప్రస్తుతం వస్తున్న సాహిత్యంపై మీ విశ్లేషణ?
రంగనాయకమ్మ : సాహిత్యం అంటే కధలూ, నవలలూ, నాటకాలూ, కవితలూ అనేట్టయితే, ప్రస్తుతం వస్తున్న వాటిల్లో తక్కువే చదువుతాను. కొన్ని బావుంటాయి. కొన్ని అంత బాగుండవు. ఖైర్లాంజీ దురంతాల మీద గతంలోనే వచ్చిన పుస్తకాన్ని ఈ మధ్యే చదివాను. చాలా మంచి పుస్తకం. కన్నడ సాహిత్యానికి శాఖమూరి రామగోపాల్‌ అనే ఆయన చేసిన తెలుగు అనువాదాలు ఈ మధ్య చదివాను. మన కధల కన్నా అవి చాలా బాగున్నాయి అనిపించింది.
 
ప్రశ్న: సామాజిక మాధ్యమాలు, టీవీ, సెల్‌ఫోన్‌ వంటి సాధనాలు పుస్తక పఠనాశక్తిని తగ్గిస్తున్నాయనడంలో వాస్తవం ఎంత ?
రంగనాయకమ్మ : పుస్తకాల మీద ఆసక్తి ఒకసారి వస్తే, అది పోతుందా? సెల్‌ఫోన్‌ ద్వారా కూడా పుస్తకాలు చదివే వాళ్ళు ఉన్నారు. పుస్తకాల మీద ఆసక్తి లేనప్పుడే దృష్టి టీవీల వైపు పోతుంది.
 
ప్రశ్న: పుస్తక పఠనాశక్తిని పెంపొందించుకునేందుకు మీరిచ్చే సూచనలు?
రంగనాయకమ్మ : మొదట తల్లిదండ్రులదే బాధ్యత. అసలు వాళ్ళకే ఆ బాధ్యత తెలీదు. స్కూల్లో టీచర్లు, క్లాసు పుస్తకాలే కాకుండా, సాహిత్య పుస్తకాలు కూడా చదివించేలా ఉండాలి. ఎక్కడికక్కడ లైబ్రరీలు ఉండాలి. ఇది వరకు శాఖా గ్రంథాలయాలు అని ఉండేవి. లైబ్రరీ సెస్సు అనో, ఇంకోటి అనో పన్ను వసూలు చేస్తారు. దాన్ని లైబ్రరీల్ని పెంచడానికి ఖర్చు పెట్టినట్టు కనపడదు. 
 
ప్రశ్న: ఒకనాడు సమాజ పురోభివృద్ధి దిశగా సాగిన ప్రగతిశీల సాహిత్యం ప్రస్తుతం ఎలాంటి పాత్ర పోషిస్తోంది?
రంగనాయకమ్మ : ‘ప్రగతి శీల సాహిత్యం’ అనే మాటని, సాధారణంగా ‘కమ్యూనిస్టు తరహా సాహిత్యం’ అనే అర్ధంలో వాడతారు. అలాగే నాస్తిక, హేతువాద, సంస్కరణ దృక్పథాల నుంచి రాసే రచనలు కూడా ప్రగతిశీల సాహిత్యంలో భాగంగానే అనుకోవాలి. ఆ రకం సాహిత్యం అప్పుడూ, ఇప్పుడూ ప్రగతిశీల పాత్రే పోషిస్తుంది. కాకపోతే, గతం అంతగా కాదు.
 
ప్రశ్న: ప్రగతిశీల సాహిత్యాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎవరిది?
రంగనాయకమ్మ : ఇంకెవరిది? ‘ప్రగతిశీల’ అన్నారుగా? ఆ ప్రగతిశీల సంస్తలదీ, బృందాలదీ, వ్యక్తులదీనూ.