విజువలైజ్డ్‌ కథలు రాసే రచయిత, సమాజం నాడి తెలిసిన నవలాకారుడు, ధిక్కార స్వరం వినిపించే కవి, నంది బహుమతి గెలుచుకున్న నాటక రచయిత కె.వి.నరేందర్‌. ఆయన రచనలు జీవితాన్ని ప్రతిబింబిస్తాయి .మధ్య తరగతి జీవితాల్లోని వెతలను ఏకాంశ కథలుగా అల్లి వాటిని ‘విజువలైజ్డ్‌ ’ గా రాసి కథకు ప్రాణం పోసే రచయిత. చరిత్రలో మరుగునపడ్డ నాయకుల్ని, కవులను తన దీర్ఘకవిత్వాల్లో ఆవిష్కరింపజేసిన కవి నరేందర్‌ . శాస్త్ర సాంకేతిక సామాజికాంశాలపై ఆయన రాసిన నవలలు చిరస్మరణీయం .మీదుమిక్కిలి తెలంగాణ గడీల చరిత్రపై మిత్రుడు రవీంద్రతో కలిసి రాసిన వ్యాసాలు తెలంగాణ చరిత్రలోనే కొత్త పేజీలై భాసిల్లాయి. తెలుగుసాహితీలోకంలో తనదైన ముద్ర వేసిన నరేందర్‌ ఇంటర్వ్యూ

తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలంలోని చిల్వా కోడూర్‌ మా గ్రామం. మా అమ్మ సుశీల. గృహిణి. నాన్న వెంకటరెడ్డి. ఉన్న ఊ‍ళ్ళోనే ఉపాధ్యాయుడు. నలుగురు అన్నదమ్ముల్లో నేనే చిన్నవాణ్ణి. నా తొలి గురువు మా నాన్నే. నా చదువు ఆయన స్కూల్లోనే.

మొదట చదివిన పుస్తకం

పదోతరగతి చదువుతున్నప్పుడు ఒకసారి హాల్‌ టికెక్‌ కోసం ఫొటో తీయించుకోవడానికి ప్రముఖ కవి, చిత్రకారుడు, ఫొటోగ్రాఫర్‌ అలిశెట్టి ప్రభాకర్‌ స్టూడియోకు వెళ్ళాను. అక్కడి దృశ్యం నన్ను అబ్బురపరచింది. అక్కడ అంగట్లో తిరిగే ఒక బిచ్చగాణ్ణి బలవంతంగా నిలబెట్టి అతడి బొమ్మ గీస్తున్నాడు. ఆయన ఆ బొమ్మ గియ్యడం పూర్తయ్యేవరకు అక్కడే కూర్చున్నాను. ఏమీతోచక అక్కడున్న పుస్తకం తీసి చదవడం ప్రారంభించాను.

అది ఆయన రాసిన ‘చురకలు’ కవితా సంకలనం. మొదటి పేజీ నుంచి చివరిపేజీ వరకు వదలకుండా చదివాను. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ప్రభావంలోనే ఉండిపోయాను. పేపరు, పెన్ను తీసుకుని ఏదేదో రాశాను. ఏం రాశానో గుర్తులేదుగానీ, నాలో ఏదో భావావేశం. అప్పుడే నాలోని కవికి బీజం పడింది. ఆయన తీసిన నా టెన్త్‌ హాల్‌ టికెట్‌ ఫొటోను ఒక అపూర్వ జ్ఞాపకంగా ఇప్పటికీ దాచుకున్నాను.కవిత, కథ, నవల, నాటకం, వ్యాసం....ఈ ప్రక్రియలన్నింటిలోనూ నేను మొదటగా రాయడానికి ఇష్టపడేది కథలనే. కథలు రాయడం అంటేనే నాకు ఇష్టం. ముఖ్యంగా మధ్యతరగతి జీవితాలపై కథలు రాయడం మరీ మరీ ఇష్టం. ఎందుకంటే, ప్రపంచంలో ఏ విధ్వంసం జరిగినా, ముందుగా ఆ ప్రభావానికి గురయ్యేది మధ్యతరగతి జీవులే! అందుకే నా ప్రతి కథలోనూ మానవ సంబంధాలు, సంఘర్షణలే వస్తువులు.

తెలంగాణ కథంటే కేవలం ఉద్యమ కథ కాదు

తెలంగాణ కథ అంటే, ఉద్యమ కథే అని బలమైన ముద్ర పడిన సందర్భంలో, నేను కలం పట్టాను. తెలంగాణ జీవితంలోని ప్రేమలు, అభిమానాలు, ఆత్మీయతలు..వాటి మధ్య చేరువ అవుతున్న బంధాలు, రక్త సంబంధాల్లో పుట్టుకొస్తున్న కల్లోలాలు...ఇలా చాలా చాలా ఉన్నాయి. ఈ మధ్య తరగతి జీవితాల్లోని వెతల్ని కథలుగా రాసే రచయిత లేకపోవడంవల్ల, ‘తెలంగాణలో ఉద్యమం తప్ప మరే ఇతర జీవితం లేదు’ అన్నంతగా సాహిత్యరంగంలో ప్రచారం జరిగింది. సాహిత్యానికి జీవితమే పునాది కాబట్టి ఆ దిశగా నేను రచనలు చేయడం ప్రారంభించాను.