ప్రముఖ నవలా రచయిత్రి, కాలమిస్ట్ అయిన ఉంగుటూరి శ్రీలక్ష్మి 85 సంవత్సరాల వయస్సులో సైతం తన కలానికి విశ్రాంతినివ్వలేదు. వయసు తన శరీరానికే కానీ మనసుకు, ఆలోచనలకు కాదంటారు ఉంగుటూరి శ్రీలక్ష్మి. ఇప్పటికీ తన కలంతో రచనా సేద్యం చేస్తూనే ఉన్నారు. ఆ కలం నుంచి జాలువారిన తెలుగు అక్షరాలు ఎందరో పాఠకుల మదిని దోచాయి. ఉంగుటూరి శ్రీలక్ష్మి చేసిన రచనలలో ప్రముఖంగా "మాటల పందిరి" వ్యాసాలు, "ఎంతవారలైనా..." కథల సంపుటి, "విరించినై" పేరిట వెలువడిన సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు అలుపెరుగని ఆమె సాహితీ కృషికి నిదర్శనంగా పాఠకులను కట్టిపడేశాయి. రచయిత్రిగా సంతృప్తికరమైన జీవితాన్ని గడిపానన్న ఉంగుటూరి శ్రీలక్ష్మి స్వగతం ఇది..
****
నేను ధవళేశ్వరంలో 21-8-1938 సంవత్సరంలో పుట్టాను. మా నాన్న మందపాటి బ్రహ్మానందరావు ఇంజనీర్‌గా పనిచేసేవారు. అమ్మ సంపూర్ణ కమలం. మేము మొత్తం ఏడుగురు పిల్లలం, నేనే పెద్దదాన్ని, అమ్మ చాలా బాగా పాడేవారు. నాకు చదువుకు, సంగీతానికి మా అమ్మే ప్రథమ గురువు. ఫస్టు ఫారం నుంచీ రాజమండ్రిలో గరల్స్ హైస్కూలులో చేరాను. మా స్కూల్లో చదువుతో పాటు సమయపాలన, వినయ విధేయతలు తోటివారితో ఎలా స్నేహంగా ఉండాలి, పెద్దలను ఎలా గౌరవించాలి, సమస్యలు వచ్చినప్పుడల్లా ధైర్యంగా ఎలా పరిష్కరించుకోవాలి... అలా జీవిత పాఠాలు ఎన్నో నేర్పించారు.
అమ్మ చదివింది ఐదో తరగతే అయినా ఎందరో ప్రముఖుల పుస్తకాలు చదివారు. ఎంతో శ్రావ్యంగా పాడేవారు. రాత్రిపూట అమ్మ చెప్పే కాశీ మజిలీ కథలు, పురాణాలు, ప్రముఖుల కథలు దృశ్య కావ్యాల్లా ఉండి నాలో పఠనాశక్తిని రేకెత్తించాయి. ఎనిమిదో క్లాసులో ఉన్నప్పుడే గుంటూరులో మా ఇంటి పక్కన ఉండే డిస్ట్రిక్ట్ లైబ్రరీలో రవీంద్రనాథ్ ఠాగూర్, శరత్ సాహిత్యం, మార్క్ ట్వైన్‌ల మంచి పుస్తకాలన్నిటి తెలుగు అనువాదాలు చదివాను. పఠనాసక్తి పెరిగి ప్రముఖ కవులు శ్రీపాద, మల్లాది, విశ్వనాథ, కొడవటిగంటి, మునిమాణిక్యం, మొక్కపాటి సాహిత్యం చదివాను. ఇవన్నీ నాలో రచనాసక్తిని కలిగించినై. పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న వి.వి.సుబ్బారావుతో వివాహం జరిగింది. మాకు ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు.
నా రచనా వ్యాసాంగం మొదట 1956లో వ్యాసాలతో మొదలైంది. అప్పట్లో ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ప్రజామత పత్రికల్లో నా వ్యాసాలు చాలానే వచ్చాయి. 1976వ సంవత్సరంలో విజయవాడ ఆలిండియా రేడియోలో కథలతో నా రచనా వ్యాసాంగం ఊపందుకుంది. విజయవాడ ఆలిండియా రేడియోలో చాలా కథలు లైవ్‌లో చదివాను. చాలామంది ప్రముఖులతో చర్చలలో పాల్గొన్నాను. చర్చ దేని మీదో ముందుగానే చెబుతారు గానీ ఎవరితోనో చెప్పరు. అలా మహీధర రామ్మోహనరావుగారు, కొంతమంది డాక్టర్లు, లాయర్లతో చర్చల్లో పాల్గొన్నాను.
ఆలిండియా రేడియో ద్వారా విజయవాడలో నండూరి సుబ్బారావు, ఉషశ్రీ, నాగరత్నమ్మ, కనకదుర్గ, వీరభద్రరావు, హైదరాబాదులో తురగా జానకీరాణి, సుధామ, ఉష, విజయ శైలజ, ప్రసన్న, సాధన, ఎందరో ప్రముఖులతో పరిచయాలు అయ్యాయి. అప్పట్లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న ముంజులూరి కృష్ణకుమారి 2013వ సంవత్సరంలో నేను విజయవాడ రేడియో స్టేషన్‌కి వెళ్లినప్పుడు విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరక్టర్‌గా ఉన్నారు. చాలాకాలం తర్వాత పుట్టింటికి వెళ్లిన అనుభూతికి లోనయ్యాను. తమాషా ఏమిటంటే ఆమె AIR కోసం నా రేడియో అనుభవాలతో ఇంటర్వ్యూ చేశారు. మావారికి ట్రాన్స్‌ఫర్ కావడంతో ఇక్కడికి వచ్చాక రేడియో ప్రోగ్రాంలన్నీ రికార్డెడ్‌వే. ఎందరో ప్రముఖులతో పరిచయాలు కలిగాయి. అన్నీ మధురానుభూతులే. విజయవాడ AIRలో నవల్లోని స్త్రీపాత్రలని పరిచయం చేసేదాన్ని. వాటిలో నాకు చాలా నచ్చినది, అందరూ మెచ్చినది మాలతి చందూర్ "భూమిపుత్రి"లోని దుర్గ పాత్ర.
ఇక పుస్తకాల విషయానికి వస్తే ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, వనితా జ్యోతి, స్నేహ, నది, ప్రగతి, కలువబాల, వనిత... అలా చాలా పత్రికల్లో వచ్చేవి. అన్నిటిలోను నా కథలు, వ్యాసాలు ప్రచురింపబడ్డాయి, ఆంధ్రభూమి డైలీలో చాలా వ్యాసాలే రాశాను. గృహశోభ, విమెన్స్ ఎరా వారి తెలుగు మాసపత్రికలో 1999 నుంచి 2017 వరకూ ప్రతి నెలా నా కథో, వ్యాసమో వచ్చేవి. అందులో పడినవి వారి మిగతా భాషల గృహశోభలలో కూడా అనువదించే వేసేవారు. అలా అందులో పడ్డవి దాదాపు 12 భాషల దాకా అనువదింపబడ్డాయి. నా కథ "పూపొదరిల్లు" ముందుగా హిందీలో "మధుకుంజ్" అని ప్రచురించారు. తర్వాత మిగతా భాషలతో పాటుగా తెలుగు గృహశోభలో ప్రింట్ అయ్యింది. 2000 సంవత్సరం నుంచీ నాలుగు సంవత్సరాలు ఆంధ్రప్రభ దినపత్రికలో కాలమిస్ట్‌గా రాశాను. 1996వ సంవత్సరంలో చెన్నైలో మా అమ్మాయి లక్ష్మి ఇంటికి వెళ్లినప్పుడు సిరివెన్నెల సీతారామశాస్త్రిగారిని ఇంటర్వ్యూ చేశాను. నా సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలన్నీ ప్రముఖ మాసపత్రిక రచనలో ఎడిటర్ శాయి ప్రచురించారు. వాటిలో సిరివెన్నెల, జంధ్యాల ఇంటర్వ్యూలను ఆస్ట్రేలియా తెలుగు పత్రిక వాహినిలో కూడా ప్రచురించారు.
భానుమతి రామకృష్ణ గురించి కొంచెం చెప్పాలి.. 1997వ సంవత్సరంలో ఓసారి.. 1998వ సంవత్సరంలో మరోసారి భానుమతి రామకృష్ణకు ఫోన్ చేశాను. ఆమె టీవీ సీరియల్ "నాలో నేను" తీస్తున్నాను, బిజీగా ఉన్నాను అన్నారు. 1999 డిసెంబర్ 31న చెన్నైలో మళ్లీ ఫోన్ చేశాను. "నువ్వు రెండు సార్లు ఫోన్ చేశావమ్మా... నాకు కుదరలేదు. రేపు తప్పకుండా అరగంట ఇంటర్వ్యూ ఇస్తాను..." రమ్మన్నారు. ఆమె అంతలా నన్ను గుర్తుపెట్టుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆమెను ఇంటర్వ్యూ చెయ్యటం అరగంటలో సాధ్యం కాలేదు. పాటలు పాడుతూ ఆమె, వింటూ నేను ఆ ఇంటర్వ్యూ అలా రెండున్నర గంటలు గడిచిపోయినై. ఆమెకు ఎన్నో రంగాల్లో ప్రవేశముంది. జాతకంలో కూడా మంచి నిష్ణాతురాలు. శివలెంక వీరేశలింగం గారి దగ్గర నేర్చుకున్నారు.
చివరిగా వచ్చేముందు భానుమతి గారు నా నక్షత్రం అడిగి రేడియోలో వినిపించావు, అక్షరాల్లో చదివించావు, ఇక అందరికీ కనిపిస్తావు, పుస్తకాలు వేస్తావు అన్నారు. ఆ తర్వాత దూరదర్శన్‌లోను, కొన్ని ఛానెల్స్‌లోను వివిధ ప్రోగ్రాముల్లో పాల్గొనడం, నన్ను రచయిత్రిగా ఇంటర్వ్యూ చెయ్యడం, కాలమిస్టుగా పేరు తెచ్చుకోవడం, కొంతమంది ఎడిటర్స్ నా చేత అడిగి మరీ కథలూ వ్యాసాలు రాయించడం, నేను పుస్తకాలు ప్రచురించడం జరిగాక భానుమతిగారి జ్యోతిష్యం ప్రతిభ అర్థమైంది. కాలమిస్టుగా రాయడం, నేను చేసిన ప్రముఖుల ఇంటర్వ్యూలు, రేడియోలో లైవ్, రికార్డింగ్ ప్రోగ్రాములు నాకు మధురమైన అనుభూతులు.
నా ఇంటర్వ్యూలన్నీ ఎమెస్కోవారు, సాహితి ద్వారా "విరించినై" పేరిట పుస్తకంగా వేశారు. నేను ఆంధ్రప్రభ డైలీలో కాలమిస్టుగా రాసిన వ్యాసాలు మాటల పందిరిగా.... కొన్ని కథలను ఎంతవారలైనా పేరిట పుస్తకాలుగా వేశాను. నా చిన్నప్పటి అనుభవాలన్నీ "ఆనాటి ముచ్చట్లు"గా మా చిన్నబ్బాయి శ్రీనివాస్ ప్రచురించాడు. నా 85వ పుట్టినరోజు కానుకగా మా పిల్లలు ఇచ్చారు. ఇప్పుడు మిగతా కథలన్నీ మా తమ్ముడు సత్యం మందపాటి "ఆడవారికి ఆదివారం సెలవు" పేరుతో పుస్తక రూపాన్నిచ్చి నా 85వ పుట్టిన రోజు కానుకగా సిద్ధం చేశాడు. ఉమెన్స్ వారి గృహశోభ, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, వనిత, ఆంధ్రపత్రిక... అలా చాలా దిన, మాస పత్రికల్లోని ఉపయోగకరమైన వ్యాసాలను ఎమెస్కోవారు పుస్తకంగా వేస్తున్నారు.
లేఖిని మహిళా రచయిత్రుల సంస్థలో మొదటి నుంచీ మెంబర్‌గా ఉన్నాను. పదేళ్లకు పైగా జాయింట్ సెక్రెటరీగా చేశాను. "ఆంధ్ర మహిళా సభ"లో లైఫ్ మెంబర్‌ని, జనరల్ కౌన్సిల్‌లో కూడా మెంబర్‌గా కొనసాగాను. సుగుణమణి, సర్వా శారద, తురగా జానకీరాణి వంటి మిగిలిన మెంబర్లతో కలసి పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నాను. గృహశోభ ఎడిటర్ పరేష్ నాథ్, ఆంధ్రభూమి ఎడిటర్ శాస్త్రిగారు.. "మీ (నా) రచనలు ఆపకమ్మా... రచనలకు వయసుతో పనిలేదు" అనడం నాకొక పెద్ద బహుమానం. మా లేఖినిలో ఆనాటి రచయిత్రులో పోయినవారు పోగా మిగిలిన అందరం వృద్ధులమే. ఈ తరం రచయిత్రులు చాలామంది ఎంతో బాగా రాస్తున్నారు. కానీ వేసుకునేందుకు పత్రికలు లేవు. అన్నీ అంతర్జాల పత్రికలే.. అదొక్కటే బాధ. రచయిత్రిగా చాలా తృప్తికరమైన జీవితం గడిపాను. అది చాలు నాకు.
****
మీ ఉంగుటూరి శ్రీలక్ష్మి