ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ తన రచనల వెనక విశేషాల గురించి, దృక్పథం గురించి బొర్రా అరుణతో చేసిన సంభాషణ

ఈ మధ్య కొంతమంది పరిశోధకులు మీ ‘బలిపీఠం’ నవల మార్క్సిస్టు భావజాలంతో ఉందంటున్నారు. అలా ఉందా?

అప్పటికి, ‘‘మార్క్సిజం’’ అనేది తెలీదు. ‘‘కమ్యూనిజం’’ అనే మాట మాత్రమే. అది, ‘‘మంచిది’’ అన్నంత వరకే. అంత మాత్రాన అది మార్క్సిస్టు భావజాలం అవదు. మార్క్సిజంతో పరిచయం అయ్యాక, ‘‘కమ్యూనిజం వల్ల, సమాజ సమస్యలు తీరతాయనీ; సంఘ సంస్కరణల వల్ల, వ్యక్తుల సమస్యలు తీరవచ్చు గానీ, అంత కన్నా జరగదనీ; అభిప్రాయం ఏర్పడింది.
 
‘పేక మేడలు’లోని భానూ, ఆమె పసి కొడుకూ మరణానికీ, ‘యజ్ఞం’ కధలోని మరణానికీ, తేడా ఏమిటి?
‘పేక మేడలు’లో భాను ఆత్మహత్యనీ, ‘యజ్ఞం’లో తండ్రే కొడుకుని నరకడాన్నీ, ఒకే రకంగా పోల్చి చూడడం, అర్థం లేని విషయం. ఆత్మహత్య తీవ్ర విరక్తితో గానీ, ఆ వ్యక్తికి అల్ప చైతన్య స్తాయిని బట్టి గానీ జరుగుతుంది. చంటి బిడ్డల్ని వదిలి తల్లి చావడం, ఆ బిడ్డకి హాని చెయ్యడమే - అని చెప్పడం అది. ‘యజ్ఞం’ కధలోది ఆత్మహత్య కాదు; హత్య! పైగా, బిడ్డ మీద ద్వేషం లేకుండా! కధ నిండా విప్లవం ధోరణి సాగుతూ. ఆ హత్య, ఎదటి పక్షం మీద జరిగితే అది వేరు. అసలు, అది, హత్యలు జరిగే సమస్య కాదు.
 
మీ ‘స్వీట్‌ హోమ్‌’ నవలలోని విమల, పి. శ్రీదేవిగారి ‘కాలాతీత వ్యక్తులు’ నవలలోని ఇందిరా, కళ్యాణిలకు కొనసాగింపు - అని కొందరు విమర్శకుల అభిప్రాయం. దీనిపై మీ స్పందన?
కాదు. ‘కాలాతీత వ్యక్తులు’ చదివాను గానీ, అది ‘స్వీట్‌ హోమ్‌’కి ముందు కాదు. నేను వైజాగ్‌లో వున్న కాలంలో, ‘మరుధ్వతి’ అనే పాఠకురాలు, తన సంసారం గురించి అలా నవ్వుతూ చెప్పేది. నిజానికి, ఆ సంసారం అంత చక్కనిది కాదు. అయినా, ఆమె అలా చెప్పేది. ‘స్వీట్‌ హోమ్‌’ ప్రారంభానికి అదే కారణం. ఆ పేరుకి కారణం, ఇంకో పాఠకుడు. ఆయన రామకోటి. వైజాగులో లాయరు. ‘‘మీ స్వీట్‌ హోమ్‌ ఎలా వుంది?’’ అని రాశాడు. ‘‘అలా అనకండి! మాది స్వీట్‌ హోమ్‌ కాదు’’ అన్నాను. ఆ పేరుని మాత్రం ఒక నవలకి పెట్టాలనిపించింది. ఆ రెండూ కలిసి, అది ప్రారంభమైంది. ఆ తర్వాత, 3వ భాగం దాకా జరిగింది. కొందరు పాఠకులైతే దాన్ని ఇంకా రాయమంటారు. చాలా మంది ఆడవాళ్ళు, ‘‘మా ఆయనగారు బుచ్చిబాబు లాంటి వారే’’ అంటారు. వాళ్ళేం అంటున్నారో వాళ్ళకే తెలీదు.
 
‘పెళ్ళి తంతు’ పట్ల మీకు ఎందుకంత వ్యతిరేకతా?
అది ‘తంతు’ కాబట్టే. ఆ తంతు, లీగల్‌ (చట్టబద్ద) తంతూ, మత పద్థతులకూ కూడా. ‘ఆస్తి’కి లీగల్‌ షరతు వుండవచ్చు గానీ, ఇద్దరు మనుషులు కలిసి బ్రతకడానికి లీగల్‌ తంతు ఏమిటి? ఇద్దరు మనుషుల స్నేహానికి మతబద్ద తంతు గానీ, చట్టబద్ద తంతు గానీ, వుంటుందా? కాకపోతే, ఇద్దరు మనుషులు, ఒక కుటుంబంగా, భార్యాభర్తలుగా బ్రతకడం, సమాజానికి తెలిసే విధంగా వుండాలి. దాన్ని ‘రహస్యం’ లేకుండా వుంచాలి. కానీ, ఆస్తి గోల వున్నప్పుడు, లీగల్‌ తంతులు అవసరం అవుతాయి.
 
స్త్రీ ఆత్మ గౌరవానికే ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం?
నీకు తెలియకే ఈ ప్రశ్న అడిగావని నేను అనుకోను. ఏదైనా జవాబు వినాలని అడిగి వుంటావు. జవాబు ఏం వుంది? ‘‘ఆత్మ గౌరవం’’ అంటే, అవమానాల నించి విముక్తి అవడమే కదా? ‘విముక్తి’ కోసం, ఏం చేసుకోవాలో అది చేసుకోకపోతే, అవమానాలే భరిస్తూ వుండవచ్చని చెప్పుకోవాలా? నాకు తెలిసిన దంపతుల్ని చెప్పనా? ఇద్దరూ డబ్బు మనుషులు. అది సరే. అతను, ఆమెని లెంపకాయలు కొడతాడు. తగువు జరిగిన రోజున సినిమాకి బైల్దేరి, స్కూటర్‌ మీద ఆమెని ఎక్కమంటాడు. ఇస్త్రీ చీరతో ఎక్కేస్తుంది. అంతా సుఖ సంసారం! ‘‘నేను రాను’’ అనేసి ఆమె వెళ్ళకుండా వుంటే, అదీ ఆత్మ గౌరవం. ‘‘దానికి ప్రాధాన్యత ఎందుకు? సినిమాని పోగొట్టుకోవాలా? అంటారా మీరు?’’
 
మీ రచనలలో, స్త్రీకి సమాజ జీవితం ముఖ్యం - అనే భావన ఉంటుంది. కానీ, స్త్రీల సామాజిక, ఆర్థిక రంగాలలోని అనుభవాల చిత్రణ తక్కువగా ఉంది - అనేది ఒక అభిప్రాయం.
‘తక్కువ’గా కాదు; అసలు లేదేమో. నేను, బైటికి వెళ్ళి ఉద్యోగాలు చెయ్యలేదు. చిన్నతనం నించీ తెలిసిన వాళ్ళల్లో ఉద్యోగాలు చేసిన స్త్రీలు లేరు. తర్వాత రోజుల్లో అటువంటివి తెలిసినా, అటువంటి వాళ్ళు టీచర్లే. బైటి జీవితాల గురించి నాకు తెలిసింది తక్కువ కాబట్టే, అవి రాలేదు.
 
ప్రపంచీకరణ నేపధ్యంలో, నేటి స్త్రీ, బైటికి రాక తప్పడం లేదు. పురుషాధిక్యంవున్న రంగాలలో, నేటి స్త్రీ ఆత్మ గౌరవం ఎలా వుంది?
‘‘ప్రపంచీకరణ’’ అంటే, గతంలో కన్నా ప్రపంచం నిండా పెరిగిన ‘‘పెట్టు బడిదారీ సంబంధాలే’’. ఉద్యోగాలుచేసే మనుషులూ, అమ్మకాల సరుకులూ, సమాచారాలూ, ప్రపంచంలో ఒక మూల నించి ఇంకో మూలకు పోయే విధంగా మార్పులు జరగడమే. ‘ప్రపంచీకరణ’ అనే మాటకి అంతకన్నా గొప్ప అర్థం ఏమీ లేదు. ‘‘నేటి స్త్రీ బైటికి రాక తప్పడం లేదు’’ అన్నారు. అలా అనడంలో, స్త్రీలు బైటికి వచ్చి ఇబ్బందులు పడడం ఎందుకు- అనే తప్పు అర్థం వస్తుంది. స్త్రీ-పురుషుల మధ్య సమానత్వం ఏర్పడాలంటే, శ్రమల్లో కూడా ఇంటా బైటా సమానత్వం వుండాలి. శారీరక శ్రమల కుటుంబాల్లో స్త్రీలు, బానిసల కాలం నించే, బైటి పనులెన్నో చేస్తున్నారు. అనేక ఇబ్బందులూ పడుతున్నారు. ఆ ఇబ్బందులు లేకుండా చేసుకోవడమూ జరగాలి; శారీరక శ్రమల- మేధా శ్రమల శ్రమ విభజన కూడా సమానత్వ లక్షణంతో మారాలి. శ్రామిక వర్గం కళ్ళు తెరిస్తే, అన్నీ జరుగుతాయి.
 
మీరు రచనలు మొదలుపెట్టినప్పటికీ ఇప్పటికీ తెలుగు సాహిత్యంలోని స్త్రీ పాత్రలో కనిపించిన ప్రధానమైన మార్పులు ఏమిటి?
ఇప్పటి స్త్రీ పాత్రలు, ఉద్యోగాల పాత్రలు తరుచుగా కనపడుతున్నాయి. దానికి జీతాలు వస్తాయి. ఆ జీతాల్ని కుటుంబంలో సమానత్వంతో వాడు కునే దృష్టి కనపడదు. జీతంలో కొంత భాగం ఉమ్మడి కోసమూ; కొంత భాగం ఎవరి రహస్యం వారిదీ. సాహిత్యంలో కూడా ఈ ధోరణి వుంది.
 
మిమ్మల్ని మీరు అభివర్ణించునేది మార్క్సిస్టుగానా, ఫెమినిస్టుగానా?
‘‘మార్క్సిజం’’ తెలిసినప్పటి నించీ, నేను మార్క్సిస్టుగానే వుండాలనుకుంటాను. ఆ భావాలతోనే రాయాలనీ, బ్రతకాలనీ అనుకుంటాను. ‘‘సమానత్వ భావాలు వుంటే, అది కేవలం ఫెమినిజం కోసమే కాదు; ప్రతీ కోణంలోనూ, ప్రతీ రంగంలోనూ సమానత్వం కావాలి. అలా అనుకునేటప్పుడు అది మార్క్సిజమే.
 
మీరు మార్క్సిజం వైపు రాక ముందు రాసిన పుస్తకాలకు తర్వాత కాలంలో ‘కొత్త ముందు మాటలు’ రాయాల్సిన అవసరం ఏమిటి - ఒకప్పుడు అలా రాశానని అనుకోవచ్చుగా?
అలా రాసిన వాటిలో కొన్ని పొరపాట్లో, తప్పులో వున్నాయని నాకు అర్థమైతే, వాటినే అలా వదిలేసి వుంచితే, వాటిని కొత్తగా చదివే పాఠకులు, ఆ పొరపాట్లని గ్రహించలేకపోతే, అవే మంచివి అనుకుంటారు. ప్రారంభంలో ఒక కధలో ‘‘రిక్షా వాణ్ణి’’ అని రాశాను. ఒక చెడ్డ పాత్ర అనే మాటలు కావు అవి. రచయిత్రి మాట్లాడేవే. అలా అనడం కాకుండా ‘‘రిక్షా అతన్ని - అనవచ్చు కదా?’’ అని కొత్త ముందు మాటలో రాసి, ఆ కధలో కూడా ఆ మాటని మార్చాను. అలా చెపితే, పాఠకులకు పొరపాట్లు తెలుస్తాయి.
 
మీ స్త్రీ పాత్రల పరిణామానికీ మీ వ్యక్తిగత జీవితానికీ ఉన్న సంబంధం ఎలాంటిది?
‘పేక మేడల్లో’ భాను, ఆత్మహత్య చేసుకోకుండా, బిడ్డతో సహా పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. అలాంటి భర్త దొరకడం అంటే, తన జీవితమే వృధా అయిపోయినట్టుగా అనిపించింది భానుకు. నాకూ అంతే. కానీ నేను ఆత్మహత్య ఆలోచన ఎప్పుడూ చెయ్యలేదు. జానకి అయితే, మొదట్లో అమాయకురాలే గానీ, సాహిత్యం వల్ల కళ్ళు తెరవగలిగింది. నేనూ అంతే. నా తెగింపుకి నిజంగా ఆధారాలు చలంగారి ‘‘స్త్రీ’’, ‘‘బిడ్డల శిక్షణ’’ వంటివీ; అనేక విమర్శలతో వున్న ఆయన వ్యాసాలనూ. ఆయనలో ఎన్ని తప్పులున్నా, నా దృష్టి ఆ తప్పుల్ని వదిలివేస్తూ ఆత్మ గౌరవం వేపు వెళ్ళింది. చలం విమర్శల శక్తే, నన్ను మేల్కొల్పింది. ఆ తర్వాత అంతా మార్క్సిజమే.
 
అలంకరణ విషయంలో మీరు ఫలానా రకంగా ఉండాలనే దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం?
‘‘అలంకరణ విషయం’’ ఫలానా రకంగా వుండాలి - అనే సంప్రదాయాలు ఆడవాళ్ళ కోసమే ఎందుకు ఉన్నాయి. నగలు, పట్టు బట్టలు, షోకులు, రంగులు - వీటిలో కొన్ని మగవాళ్ళకి కూడా వున్నా, ఆడవాళ్ళ అలంకరణే ఎక్కువ ప్రత్యేకంగా ఎందుకు వుంది? శుభ్రతా, పొదుపూ - ఇటువంటివి పట్టవు. ‘‘ఆడది అందంగా అలంకరించుకోవాలి’’ అనేది ఎందుకు వచ్చింది. దాన్ని వ్యతిరేకించవలిసిందే కదా?
 
జుట్టు విరబోసుకోవడం, స్లీవ్‌లెస్‌ బ్లవుజ్‌లు ఈ రోజుల్లో సాధారణమై పోయాయి. ఇలాంటి స్త్రీలను మీరు దూరం పెడతారు. వారిలో ప్రగతిశీల, శ్రామిక దృక్పధం ఉన్నవారు కూడా ఉండవచ్చుగా?
చంకలూ, రొమ్ములూ, తొడలూ, పిరుదులూ, భుజాలూ, వీపులూ - ఇవన్నీ బైట పెట్టుకుని తిరిగే వాళ్ళల్లో, ప్రగతిశీల, శ్రామిక దృక్పధాలు వున్నట్టా? శ్రామిక స్త్రీలు కూడా అలాగే నడిస్తే, వాళ్ళకి ఆ దృక్పధం లేనట్టే. తమ బలహీనతల్ని వదులుకోకుండా ఇటువంటి వాదనలు తీసుకొస్తారు.
 
శ్రామిక వ్యతిరేక, అభ్యుదయ నిరోధక వ్యక్తులతో పేచీ శతృ వైరుధ్యం అయితే.... మార్క్సిజాన్ని అంగీకరించే వారితో పేచీ మిత్ర వైరుధ్యం. మీరు రెంటికీ తేడా చూపించటంలేదనే విమర్శ ఉంది?
మార్క్సిజాన్ని అంగీకరించేవారితో నాకు ఏ వైరుధ్యమూ వుండదు. చంకలూ, రొమ్ములూ, బైటపెట్టి, జుట్టు విరబోసి, నేను మార్క్సిజాన్ని అభిమానిస్తాను- అనే వ్యక్తిని, అది నిజం అని, నేను నమ్మను. మార్క్సిజాన్ని ప్రేమించే వాళ్ళు ఆ తప్పుడు భావాలతో వుండరు. మార్క్సిజం దాకా అక్కరలేదు. సాధారణ సంస్కారం వున్న వాళ్ళు కూడా అలా వుండరు. రక రకాల అందాల జబ్బులు అన్నీ పెట్టుబడిదారీ సరుకుల నించి పుట్టుకొస్తున్నవే. ఆ సరుకులు, ‘‘అందాల’’ పేర్లతో తయారవుతున్నాయి. అమ్మితే, వాళ్ళకి లాభం! కొంటే, వీళ్ళకి ‘అందం’! ప్రచారాలు అవే. ఆడవాళ్ళూ, మొగవాళ్ళూ, లాగులతో తిరుగుతారు. జుట్టు విరబోతలూ, చేట లంతంత బొట్లూ, ఫేషన్‌ కళ్ళజోళ్ళూ. అవన్నీ పెట్టుబడిదారీ సరుకుల ప్రచారాలు! జుట్టు విరబోతల వాళ్ళు ఫేషన్‌ మారిందంటే గుళ్ళు చేయించేసుకుంటారు.
 
తర్వాత కాలంలో పరామర్శించినప్పుడు మీ రచనల్లో మరింత కఠినంగా చెప్పి వుండాల్సిందనిపించినవి ఏమన్నా ఉన్నాయా?
ప్రతీ దానిలోనూ, ప్రతీ చోటా అనిపిస్తుంది. ‘‘కఠినంగా చెప్పడం’’ అని ఎందుకు అనాలి దాన్ని? ‘‘ఇంకా బాగా చెప్పడం’’ అనాలి. ఒక పని చేసే వాళ్ళకి, ‘‘ఇంకా బాగా చెయ్యాలి’’ అనిపించదా? ఒక కూర వండినప్పుడే అలా అనిపిస్తుంది, ‘‘అయ్యో! ఇంకా బాగా చెయ్యాల్సింది’’ అని. కధని ఇంకా బాగా రాస్తే, అది కఠినమా? విమర్శ అయినా, కఠినమా? తర్కం తెలుసుకుని సంతోషించాలి.
 
రంగనాయకమ్మ నాలుగుగోడల మధ్య కూచుని రాస్తుంది. పడక్కుర్చీ మేధావి. ఆచరణ లేదు - అనే విమర్శకి మీ జవాబు?
దీనికి నేను కాదు; ఆ విమర్శని వినేవాళ్ళు చెప్పాలి. ఇతర రచయితలు ఎక్కడ కూర్చుని రాస్తారు? వాళ్ళకి నచ్చే రచయితలు నడిరోడ్డులో కూర్చుని రాస్తారా? అనో, ఏదో, ఇతరులు అడగాలి. ‘కాపిటల్‌ పరిచయాన్ని’ నాలుగు గోడల మధ్యే రాసింది. ‘జానకి విముక్తి’నీ, ‘అంధకారాన్ని’ నాలుగు గోడల మధ్యే. ‘విషవృక్షాన్ని’ నాలుగు గోడల మధ్యే! ఇతర రచయితలు ఎక్కడ రాస్తారో ఒకసారి చెప్పండి!-అని మీరే అడిగితే మీకు జవాబు దొరుకుతుంది.
 
మీరు మార్క్సిస్టులపై విమర్శలు చేయడం కొందరు ‘స్వీయ చర్మ సంరక్షణ’గా భావిస్తున్నారు. దానిపై మీ స్పందన?
‘‘స్వీయ చర్మ రక్షణ’’ అంటే ఏమిటో మీకు తెలిసే అడిగారా? ‘‘నేను మార్క్సిస్టుని కాను సుమా!’’ అని పోలీసులకు చెప్పుకుని, నన్ను నేను రక్షించు కోవడానికే, విప్లవకారుల్ని విమర్శిస్తానట! ఈ వాగుడు నేను ఒక సందర్భంలో విన్నాను. కొడవటిగంటి కుటుంబరావు, ‘‘దెయ్యాలున్నాయి’’ అని, దెయ్యాలూ-ఆత్మలూ అంటూ రాసిన తత్వ శాస్ర్తాన్ని ‘విరసం’ నెత్తిని పెట్టుకు మోస్తోందని నేను విమర్శించినప్పుడు, విరసం సమర్థకులు నన్ను ఆ మాట అన్నారు. ఆ దెయ్యాల శిష్యులు విప్లవకారులట! ఆ విప్లవకారుల్ని నేను ఎందుకు విమర్శిస్తున్నానంటే, పోలీసులు నన్ను గురించి, ‘‘ఈ మనిషి మార్క్సిజానికి వ్యతిరేకంలే’’ అనుకోవాలని, నేను అలాంటి విమర్శలు చేస్తానట! నా పద్థతి, స్వీయ చర్మ రక్షణే అయితే, దెయ్యాల్ని పూజించే వాళ్ళది, ఏ విధానం అవుతుంది? దెయ్యాల్ని నమ్మేవాళ్ళని మార్క్సిస్టులని ఏ పోలీసు అయినా అనుకుంటాడా?- వాళ్ళ చర్మ రక్షణేనేమో అది! ‘‘నేను మార్క్సిజానికి వ్యతిరేకిని’’ అని చెప్పుకోడానికేనా ఫ్యూడల్‌ మత గ్రంధాల మీద విమర్శలు రాసింది? మార్క్సిజానికి వ్యతిరేకత తోనేనా ‘‘మార్క్స్‌ కాపిటల్‌కి పరిచయం’’ రాసింది? - మార్క్సిజాన్ని ప్రేమించే మనిషిని ద్వేషించే వాళ్ళా మార్క్సిస్టులు?
 
మీ పాఠకులు, మీ పుస్తకాలు చదివి, మార్క్సిజాన్ని అంగీకరిస్తున్నట్టుగా మీరు భావిస్తారా?
‘‘మీ పాఠకులు’’ అనడం తప్పు. పుస్తకాలు చదివే వాళ్ళు, ఒకే రచయితవి చదవరు. అనేక మందివి చదువుతారు. ఆ చదివిన వాటిలో వారికి నచ్చినవే తీసుకుంటారు. నచ్చినా, ప్రతీ దాన్నీ ఆచరించడం కొందరు చెయ్యలేరు. ఆచరించాలని వున్నా, దానికి తగిన సదుపాయాలు వుండక పోవచ్చు. ఇద్దరు ముగ్గురు కలిసి, గ్రూపుగా చదువుకుంటూ, చర్చించుకుంటూ, ఒక అవగాహనకి వస్తే తప్ప, ఏ కొత్త విషయాన్నీ అర్థం చేసుకోలేరు. ప్రతీ రచయితకీ ఇది వర్తిస్తుంది. మార్క్సు, మహా తెలివైన రాతలు రాశారు. ఎందరు చదివారు? ఎందరు క్షుణ్ణంగా అర్థంచేసుకున్నారు? వాటిని ఎందరు ఆచరించారు? సంఘాల ద్వారా జరిగితే తప్ప అది జరగదు.
బొర్రా అరుణ, 93955 32951