ముడిచమురు అన్వేషణా సంస్థలో 35 సంవత్సరాలు పనిచేసి, ఉన్నత స్థాయిలో పదవీ విరమణ చేసిన పింగళి వెంకట రమణరావు (ఎలక్ర్టాన్‌) 75 వ పడిలో కూడా దర్శన ఉపన్యాసకుడిగా(Visiting Professor)గా పెట్రోలియం టెక్నాలజీ విద్యార్థులకు సంబంధిత జ్ఞాన వితరణ చేస్తున్నారు. సాంకేతిక నిపుణుడిగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే ఎలక్ర్టాన్‌ పేరుతో కథలు రాస్తూ తెలుగు సాహిత్యానికి తనవంతు కృషి చేస్తున్నారు. హనుమకొండ నుండి ఆంధ్రాయూనివర్శిటీ, డెల్టా స్టడీస్‌ ఇనిస్టిట్యూట్‌ (విశాఖపట్నం)కు వచ్చిన ఆయన్ను కలుసుకున్నప్పుడు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మనసు విప్పి చాలా సేపు చెప్పారు. ఆ కబుర్లు ఈ వారం ‘నవ్య’ పాఠకుల కోసం...

బాల్యం,పఠనాసక్తి

నా పూర్తి పేరు పింగళి వెంకట రమణరావు. 1937 డిసెంబరు 15వ తేదీన తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో పుట్టాను. తల్లితండ్రులు డాక్టర్‌ పింగళి లక్షీ ్మనారాయణప్ప, సుబ్బలక్షి ్మ. నలుగురు అన్నదమ్ములలో మూడోవాణ్ణి. నాకు నాలుగేళ్ళ వయసు ఉన్నప్పుడే మా నాన్నగారు దివంగతులయ్యారు. అప్పటికాయన వయసు 36.అక్షరాభ్యాసం నుంచీ హైస్కూలు వరకూ చదువు పెద్దాపురంలోనే కొనసాగింది. ప్రాథమిక విద్య పురపాలక సంఘం బడుల్లోనే జరిగింది. అయిదో క్లాసు అయిన తర్వాత శ్రీవీర్రాజు ప్రాథమిక పాఠశాలలో చేరాను. భాష విషయంలో ఎంతో పట్టింపులతో ఉండే గొప్ప గురువుల కారణంగా నాకు అంగ్లం, తెలుగు భాషలమీద పట్టు ఏర్పడింది. ఎనిమిదో తరగతి తర్వాత మా ఊరి ఉన్నత పాఠశాలలో చేరాను. తెలుగు వ్యాస రచన పోటీల్లో మొదటి బహుమతి ఎప్పుడూ నాకే వచ్చేది.

నేను బాల్యం నుంచీ పత్రికలు చదివేవాడిని సాయంత్రం స్నేహితుడు కామరాజుతో కలిసి గ్రంథాలయానికి వెళ్ళేవాణ్ణి. అపరాధ పరిశోధన నవలలు, చలం, జంపన చంద్రశేఖరరావు, కొవ్వలి నవలలు, చక్రపాణి, బొందలపాటి శివరామకృష్ణ అనువదించిన పుస్తకాలు చదివేవాళ్ళం. విశ్వనాథగారి ‘ఏకవీర’ నండూరి వారి ‘కాంచన ద్వీపం’ సూరంపూడి సీతారాం అనువాదం ‘కౌంట్‌ ఆఫ్‌ మౌంట్‌ క్రిస్టో’, తెన్నేటి సూరి అనువాదం ‘టేల్‌ ఆఫ్‌ టూ సిటీస్‌’ అప్పుడే చదివేశాను.మా పెద్దన్నయ్య ఇంగ్లీషు సాహిత్యం చదివించేవాడు. తదుపరి కాలంలో యిర్వింగ్‌ వాలెస్‌, రాబర్ట్‌ లుడ్లుం,ఎలైస్టెర్‌ మెక్లెన్‌, జేమ్స్‌ హాడ్లీచేజ్‌ విసుగెత్తించకుండా చదివించే కథనం నాకు చాలా బాగా నచ్చుతుంది. మనసు తేలిక పడాలంటే అలాంటి పుస్తకాలను చదవాలని నా అభిప్రాయం.

కాలేజీలోనే కథా రచన

రాజమండ్రి ప్రభుత్వ కళాశాల (1953) లో ఇంటర్‌ చదువుతున్నప్పుడు మా మేనత్తగారబ్బాయి ఏలూరు నుంచి వచ్చి ‘‘ఒరేయ్‌! నీకు వ్యాసాలు రాయడం బాగా వచ్చుకదా! నేనో ఇతివృత్తం చెబుతాను. నువ్వు కథ రాయి’’ అన్నాడు. ఆ ఏడాది ఆగస్టు నెలలో వరదలొచ్చి రాజమండ్రిలో గోదావరి బీభత్సంసృష్టించింది. మా కాలేజీ భవనాల్ని వరద బాధితులకు శిబిరాలుగా మార్చేశారు. ఆ సమయంలో మూడు రోజుల్లో కథ రాశాను. దాన్ని మా వాడు ‘ఆంధ్రపత్రిక’కు పంపితే రెండు నెలల్లో ప్రచురితమైంది. పన్నెండు రూపాయల పారితోషికంలో నాకు ఆరు రూపాయలు ఇచ్చాడు. ఆ డబ్బుతో ఓ కళ్ళ డాక్టరు వద్ద నా కళ్ళు పరీక్ష చేయించుకున్నాను. అప్పుడే కళ్ళజోడు ధరించడం ప్రారంభమైంది. ఆ ఊపుతో రెండో కథను రాయడానికి పూనుకున్నాను. అప్పుడు రాజమండ్రిలో న్యాయవాది వృత్తిలో ఉన్న మా పెద్దన్నయ్య ‘‘వువ్విలా కథలు రాసే వ్యామోహంలో పడితే చదువు కొండెక్కుతుంది. నీ రచనా వ్యాసంగం కాలేజీ మ్యాగజైన్‌ వరకే పరిమితం చేసుకో’’ అని చీవాట్లు వేశాడు. రాజమండ్రిలో కాలేజీలో ఇంటర్‌, బి.ఎస్సీ చదివిన సంవత్సరాలలోనూ, వార్షిక పత్రికల్లో నా రచనలు ముద్రితమయ్యాయి. అప్పుడు మా కాలేజీ తెలుగు విభాగంలో పనిచేసే చామర్తి కనకయ్యగారు (కనక్‌ ప్రవాసి) నాకు తగు ప్రోత్సాహం ఇచ్చేవారు.