చిన్న చిన్న వాక్యాల్లో లోతైన భావాలు పలికించే కథ, నవల, నాటక రచయిత అంగర వెంకట శివప్రసాదరావు. బాల్యం నుంచీ ఆయన దృష్టి ఎప్పుడూ కథమీదే!సమాజంలోని ఇతివృత్తాలే ఆయన కథలు. చిన్న చిన్న సంఘటనలను అందమైన కథలుగా తీర్చిదిద్దుతారాయన .కథలోని మంచిచెడులను పాఠకులే నిర్ణయించుకోవాలి, కథ పాఠకుడిలో సానుకూల దృక్పథం పెంపొందించాలి అంటున్న శివప్రసాదరావు ఇంటర్వ్యూ...
1949 సెప్టెంబరులో విశాఖపట్నంలో జన్మించారు శివప్రసాదరావు. ఆయన తండ్రి అంగర వెంకట నారాయణరావు. అమ్మ శాంతమ్మ. ఉద్యోగరీత్యా విజయనగరం నుంచి విశాఖపట్నం వచ్చి స్థిరపడ్డారు ఆయన తండ్రి.శివప్రసాదరావుగారి పెదనాన్నలు అంగర వెంకట కృష్ణారావు, అంగర వెంకట సత్యనారాయణరావు. ఇద్దరూ ప్రముఖ రచయితలే. ఆంధ్రజ్యోతిలో పురాణంవారు సంపాదకులుగా ఉండగా కృష్ణారావుగారు రెండోప్రపంచయుద్ధం బ్యాక్‌గ్రౌండ్‌లో రాసిన ‘విరామం’ నవల సీరియల్‌గా వచ్చింది. ఇదెంతో పాపులర్ నవల. ఆయన 200కు పైగా కథలు కూడా రాశారు. సత్యనారాయణరావుగారు70–80కథలు రాశారు.
‘భావికాలం’ అనే నవల రాశారు. శివప్రసాదరావుగారి తండ్రి మేనమామ మొసలికంటి సంజీవరావుగారు కూడా ప్రముఖ రచయితే. వీరందరి వారసత్వాన్నీ జన్మతః పుణికిపుచ్చుకున్నారు శివప్రసాదరావుగారు. ఇంట్లో ఉండే సాహిత్యం, వివిధ వారపత్రికలు విస్తారంగా చదివడం బాల్యంలోనే ఆయనకు అలవడింది.శివప్రసాదరావు 15–16ఏళ్ళ వయసులో ఉన్నప్పుడే, పెదనాన్న కృష్ణారావుగారి రచనలను శ్రద్ధగా ఫెయిర్‌కాపీ చేసేవారు. ‘‘కథారచనలో పెద్దనాన్న కృష్ణారావుగారే తనకు ప్రేరణ’’ అంటారు ఆయన. తన తాత సంజీవరావుగారికి, కృష్ణారావుగారికి చిన్న వయసులోనే కథలు రాసి చూపిస్తూ వారి సలహాలు తీసుకునేవారు. ఆ విధంగా శివప్రసాదరావు బాల్యంనుంచీ ఎంతో ఇష్టంగా కథారచన చేపట్టారు.
కథాప్రస్థానం ఇలా...
శివప్రసాదరావుగారి తొలి కథ ‘నన్ను క్షమించు’ 1969లో జ్యోతి మాసపత్రికలో ప్రచురితమైంది. ఆంధ్రజ్యోతి వారపత్రికలో ‘నల్లగీతలు’ (1972) కథ వచ్చింది. తన స్నేహితుడు రాణీమోహనరావు చెప్పిన థీమ్ తీసుకుని ఈ కథ రాశారు శివప్రసాదరావు. ‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో’ అనే సందేశం ఆధారంగా రాసిన కథ ‘చింకిచొక్కా’ (1972) ఆంధ్రప్రభ వీక్లీలో వచ్చింది. ఆకలి మనిషిని ఎంతకైనా దిగజారుస్తుందని చెప్పే కథ ‘మనసులు’ యువ మాసపత్రికలో వచ్చింది. అలా 1990నాటికే ఆయన పలు పత్రికల్లో 80 కథలు రాశారు.జ్యోతి మంత్లీ కథలపోటీల్లో ఆయన రాసిన ‘సొమ్ము వాడిదే, సోకూ వాడిదే’ కథ 116 రూపాయలు బహుమతి పొందింది. కుటుంబకారణాల రీత్యా కొన్నేళ్ళు కథారచనకు దూరమై, 2007లో పదవీ విరమణ తర్వాత ఆయన మళ్ళీ కలంపట్టి పలు పత్రికల్లో 30 కథలు రాశారు.
మరో పది కథలు పలు పత్రికల్లో ప్రచురణకు అంగీకారం పొందాయి. ఒక్క నవ్య వీక్లీలోనే ఆయన అనేక కథలు రాశారు. వివిధ వారపత్రికలు నిర్వహించిన పోటీల్లో అనేక బహుమతులు గెలుచుకున్నారు. ఒక వారపత్రిక నిర్వహించిన హాస్య కథల పోటీలలో ఆయన కథ ‘జిహ్వచాపల్యం’, మరోసారి పోటీల్లో ‘దానం’ కథ పదివేలు చొప్పున నగదు బహుమతులు అందుకున్నాయి. శివప్రసాదరావు కథలను ప్రముఖ రచయిత్రి పారనంది నిర్మల హిందీలోకి అనువదించారు.