నవ్వించడమనేది ఓ అద్భుతమైన కళ. సమయానుకూలంగా, సందర్భానుసారంగా మాట్లాడి అప్పటికప్పుడు నవ్వు రప్పించేవారు జోకిస్టులు. ఆ నవ్వును తమ చిట్టి గీతలతో, పొట్టి రాతలతో పాఠకుల హృదయాల్లో శాశ్వతంగా బంధించేవారు కార్టూనిస్టులు. అలాంటి వ్యంగ్య చిత్రాలను నాలుగు దశాబ్దాలుగా వేస్తూ నవ్వులు పువ్వులు పూయిస్తున్న ఏకైక తొలి తెలుగు మహిళా కార్టూనిస్టు రాగతి పండరి. కళతో పాటు వినయాన్ని కలిగి ఉండాలని తన పరోక్ష గురువుల నుండి నేర్చిన ఏకలవ్య శిష్యురాలు ఆమె. మొక్కవోని ధైర్యంతో, జీవితాన్ని ఓ సవాలుగా తీసుకుని వేలాది కార్టూన్లు సృష్టించిన అలుపెరుగని ఆ నవ్వుల రారాణికి ‘నవ్య’ నీరాజనం.

కుటుంబం

మా తాతగారు రాగతి రాజారావు నాయుడు. ఓ పిల్ల జమిందారు. మా నాన్న గోవిందరావు హయాంలో వివిధ వ్యాపారాల్లో నష్టాలూ, కొందరి మోసాలతో కష్టాలూ వచ్చి సామాన్యులుగా మారి, అభిమానవంతులుగా మిగిలాం. పెద్ద మోతుబరుల ఇంట పుట్టి పేరుకుతగ్గ మూర్తిత్వం గల మా అమ్మ శాంత కుమారి. మేం ఐదుగురు సంతానం. నాకు ఊహరాక ముందే మా పెద్దక్క రాజా సుందరికి వివాహం జరిగింది. అన్నయ్య రామరాజు. చిన్నక్కయ్యలు రత్నకుమారి, రమాదేవి. 1965 జూలై 22 న నేను పుట్టాను. పుట్టిన యేడాదికే పోలియో బారన పడటం, ఆ తర్వాత రెండేళ్ళకు నాన్నగారి మరణం నా చిన్ననాట జరిగిన రెండు విషాదాలు. నాన్న నాకు పెట్టిన పేరు పండరీబాయి. ఇంట్లో అందరూ నన్ను ‘చిట్టి’ అని పిలుస్తారు.

కార్టూన్‌ కళలో ప్రవేశం

ఆరేళ్ళ వయసులో నా కాళ్ళకు శస్త్ర చికిత్స జరిగింది. ఆరునెలల్లో కాలీపర్స్‌ సాయంతో ఇంట్లోనే నడవడం, ట్యూషన్స్‌ ద్వారా చదవడం ప్రారంభించాను. తోబుట్టువులు బడికి వెళ్ళిపోతే ఇంట్లో అమ్మా నేనూ మిగిలేవాళ్ళం. వంటయ్యాక అమ్మ కథలు చదివి వినిపించేది. తీరిక వేళల్లో రెండో అక్క చదువు చెప్పేది. ఆ రోజుల్లోనే ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, యువ తదితర పత్రికలు మా ఇంటికి వచ్చేవి. తీరిక సమయాల్లో ఆ పత్రికలన్నీ చూసే దాన్ని. వాటిల్లో ఎక్కువగా జయదేవ్‌ గారి కార్టూన్లు నన్ను ఆకర్షించేవి. వాటిని మెల్లగా అర్థం చేసుకుంటూ నవ్వుకునేదాన్ని. అప్పుడే, నేనూ కార్టూన్లు వేసి పదిమందినీ నవ్వించాలన్న కోరిక పుట్టింది.

ఎనిమిదేళ్ళ వయసుకే తొలి కార్టూను

వచ్చీరాని ఊహలతో వంకర టింకర బొమ్మలతో చిత్తుకాగితాల మీద జయదేవ్‌ గారిని అనుకరిస్తూ బొమ్మలు వేసేదాన్ని. వాటిల్లో నాకు నచ్చిన వాటిని డ్రాయింగ్‌ పేపర్‌ ముక్కల మీద ఇండియన్‌ ఇంక్‌ తో వేసి పత్రికలకు పంపేదాన్ని. చాలా కార్టూన్లు తిరిగి వచ్చేవి. అలా పంపగా, పంపగా ఆంధ్రజ్యోతి వీక్లీ లో నా తొలి కార్టూను అచ్చయింది. అప్పటికి నా వయసు ఎనిమిదేళ్ళు.

తొలి పారితోషికం

నా కార్టూనుకు ఆంధ్రజ్యోతి వీక్లీ వారు పంపిన పారితోషికం నాలుగు రూపాయలు. అదే నా తొలి పారితోషికం. పోస్టుమేన్‌ రిసీవ్డ్‌ ఫోర్‌ రూపీస్‌ అని రాసి సంతకం పెట్టమన్నాడు. కార్టూను పడితే పత్రికల వాళ్ళు డబ్బులు పంపుతారని నాకు అప్పటికి తెలియదు. ఆ సంతోషంతో రిసీవ్డ్‌ ఫోర్‌ హండ్రెడ్‌ రూపీస్‌ అని రాశాను. పోస్ట్‌మేన్‌ కోపంతో అది కొట్టించేసి మళ్ళీ సరిగ్గా రాయించాడు. అదే నా మొదటి ధర్మార్జితం. ఆ సంఘటన ఎప్పుడు గుర్తుకు వచ్చినా నాకు నవ్వు ఆగదు. ఒళ్ళు పులకరిస్తుంది.