రంగస్థల సినీ నట దిగ్గజం కాకరాల. 80 నాటకాలు ప్రదర్శించి అపారమైన రంగస్థల నటనానుభవం సంపాదించుకున్నారు. రెండువందల చిత్రాలకు పైగా నటించారు. హీరోల చుట్టూ కథలు అల్లుతూ గ్లామర్‌ని ఆకాశానికెత్తే ధోరణివల్లనే ఎక్కువ చిత్రాలు ఫ్లాపులు చవిచూస్తున్నాయంటున్న కాకరాల ఇంటర్వ్యూ...

పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లిలో జన్మించాను. మా నాన్నగారు కాకరాల వీరభద్రం. అమ్మ కనకమహాలక్ష్మి. నా పూర్తిపేరు కాకరాల వీరవెంకట సత్యనారాయణ. సినీ నాటక రంగాల్లో కాకరాలగానే ప్రసిద్ధి. తొమ్మిదో తరగతిలో తెలుగు మాస్టారి చొరవతో సంస్కృత నాటకం ‘భోజసభ’లో, ‘ఒథెల్లో’ నాటకంలో జడ్జి పాత్ర వంటివి చేశాను. దాంతో నేను మంచి నటుడినవుతానని మా ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ఆకాశానికెత్తేశారు. దాంతో నా ధ్యాస నాటకాలవైపు మళ్ళింది. ఎస్‌ఎ్‌సఎల్‌సీ వరకు చదువుకున్నాను.

నాన్నతో సంఘర్షణ

నాకు ఊహ తెలిసేనాటికి కాకరపర్రులో మా అమ్మమ్మ మా ఇంటి ఎదురు దిబ్బమీద తోలుబొమ్మలాట ఆడిస్తూ ఉండేది. దేవీ నవరాత్రులు, చెక్కభజనలు, సంకీర్తనల్ని చూడటం, ఆస్వాదించడం నా అభిరుచిగా మారిపోయింది. నేను నటుడు కావడం మా నాన్నకు బొత్తిగా ఇష్టం లేదు. మా మధ్య కోల్డ్‌వార్‌ జరిగేది. నాన్నకు తెలియకుండా నాటకాలు వేయడం, ఆయన నన్ను తిట్టడం అలవాటుగా మారిపోయింది.మా ఇంటికి చెరో వైపు ఆదుర్తి, రాజబాబు ఇళ్ళుమా పెదనాన్న కాకరాల కామేశ్వరరావు ప్రోత్సాహంతో 1953-54లో ‘సత్యహరిశ్చంద్ర’, ‘శ్రీరామాంజనేయ యుద్ధం’ వంటి పౌరాణిక నాటకాలతో నటప్రస్థానం ప్రారంభించాను. రాజమండ్రి ఆర్యాపురం మత్స్యవీధిలో ఆదుర్తి సుబ్బారావుగారు, పుణ్యమూర్తుల రాజబాబుగారి రెండిళ్ళ మధ్యా మా ఇల్లు ఉండేది. అక్కడే గుడిదగ్గర నాటకాలు వేసేవాళ్ళం. పృథ్వీరాజ్‌కపూర్‌ ‘పైసా’ నాటకాన్ని ‘ధనం’ పేరుతో, వెల్లంకి వెంకటేశ్వరరావుగారి ‘విష కుంభం’, ఆత్రేయగారి ‘భయం’ నాటకాలు ప్రదర్శించేవాళ్ళం. అప్పుడే గరికపాటి రాజారావుగారి దృష్టిలో పడ్డాను. ఆయన నా గురుతుల్యులు. ఆయన దర్శకత్వంలో కొర్రపాటి గంగాధరరావుగారి ‘భవభంధాలు’, ‘మనోవ్యధ’ తదితర నాటకాలన్నీ హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ప్రదర్శించడంతో రంగస్థల నటుడుగా నా పేరు స్థిరపడింది.

సినీ కరస్పాండెంట్‌గా

ఓ మిత్రుడి సలహాతో ‘నవ్వులు-పువ్వులు’ అనే సినీ పత్రికలో కరస్పాండెంట్‌గా జేరి తరచు మద్రాసు వెళ్ళేవాణ్ణి. 1953లో వివాహం జరిగింది. నా భార్యపేరు సూర్యకాంతం. మాకు ఇద్దరు కూతుళ్ళు. కుటుంబాన్ని రాజమండ్రిలోనే ఉంచి రాజారావుగారి ఆహ్వానంతో మద్రాసు చేరాను. ఆయన ఇంట్లో బస, హోటల్‌ భోజనం. కరస్పాండెంట్‌గా సినీ పరిచయాలు.. ఇక తర్వాత 1960లో కుటుంబంతో అక్కడే స్థిరపడ్డాను.

రాజారావుగారి దర్శకత్వంలో 20 నాటకాలు

పుట్టిల్లు చిత్రం తర్వాత ఎనిమిదేళ్లకు రాజారావుగారు మళ్ళీ చిత్రం ప్రారంభించారు. రికార్డింగ్‌, ఒక సెట్టు పని కూడా పూర్తయ్యాక ఆర్థిక సంక్షోభం వచ్చింది. దాన్నుంచి బైటపడేందుకు ఆయన ‘ఇప్టా’ (ఇండియన్‌ పీపుల్స్‌ థియేటర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌)ను పునరుద్ధరించారు. అలా 1960 - 63లో మూడేళ్ళూ ఆయనకు సహకరించా. అలా అల్లూరి సీతారామరాజు నాటకంలో సింగన్న పాత్ర, జైభవాని నాటకంలో సర్వసైన్యాధిపతి, బాజీరావు దేశ్‌పాండేగా మద్రాసు, టంగుటూరు, హైదరాబాద్‌, విశాఖపట్నంలలో ఆయన దర్శకత్వంలో ఇరవై నాటకాలు వేశాం. నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారి సమక్షంలో రవీంద్రభారతిలో జైభవాని నాటకం ప్రదర్శించాం. ఇందులో కథానాయిక గజరా పాత్రలో వాణిశ్రీ నటించింది. ఆ అమ్మాయి అసలు పేరు రత్నకుమారి. ఈ విధంగా నా నాటక చరిత్రలో 80 వరకు నాటకాలు ప్రదర్శించాను.