ఆంగ్లంలోకి భాగవతాన్ని అనువదించడం నా అదృష్టంలంకా శివపస్రాద్‌ఓ తెలుగు మీడియం విదార్థి మూడు దశాబ్దాల పాటు ఆంగ్లసాహిత్య సాగరాన్ని మథించి ఆ పైన తెలుగువారికి ఆంగ్ల సప్త మహాకావ్యాలను సరళ తెలుగులో అందించాడు. ఆంగ్ల సాహిత్య మూలతత్వం చెక్కు చెదరకుండా వారి భావజాలాన్ని సరళ తెలుగులో అనువదించి ఇవ్వడం ఆ విద్యార్థికే చెల్లింది. ఆయనే డాక్టర్‌ లంకా శివరామ ప్రసాద్‌. అనువాద రంగంలో అందెవేసిన చేయి ఆయనది.కార్డియో థొరాసిక్‌ సర్జన్‌గా ఒకవైపు రోగులకు శస్త్ర చికిత్సలతో ప్రాణాలు పోస్తూ, మరోవైపు ‘సృజన లోకం’ ద్వారా భావసారూప్యతగల ప్రముఖులను ఒకచోట చేర్చి సాహితీసేద్యం చేస్తున్నారు. జననం ఒక వాస్తవికత అయితే, మరణం మరో అధివాస్తవికత. అదొక అంతిమ సత్యం వాటిని మనం సమానంగా ఆహ్వానించాలి అంటారాయన. తెలుగులో తొలి బయోటెక్నాలజీ నవల ‘జీనోమ్‌’ (సప్తమ అంతర్థానం) ను పాఠకులకు అందించారు. స్వప్న శాస్త్రాలపై తెలుగులో రాసిన ఏకైక సాధికార గ్రంథం ‘స్వప్న శాస్త్రం’ ఆయనదే! ఆయన కథకుడు కూడా. మానవ హక్కులంటే ఆయనకు ఎంతో మమకారం. వైద్య, సాహిత్య రంగాలలో జైత్రయాత్ర సాగిస్తున్న లంకా శివరామప్రసాద్‌తో నవ్య నీరాజనం మీకోసం...

బాల్యం

మా నాన్నగారు లంకా కుమార స్వామి. అమ్మ సీతామహాలక్షి ్మ. సంతానంలో నేనే పెద్ద. తమ్ముడు కృష్ణమోహన్‌. చెల్లెలు విజయభారతి. కృష్ణాజిల్లా కొమరవోలులో 1955 డిసెంబరు 19వ తేదీన నేను జన్మించాను. మా నాన్నగారు కమ్యూనిస్టు భావజాలంతో ప్రభావితులైన వ్యక్తి. నూజివీడు సమీపంలోని కాట్రేనిపాడులో ఏకోపాధ్యాయ పాఠశాలకు హెడ్మాస్టర్‌గా పనిచేసేవారు. నా బాల్యం అక్కడే గడిచింది. నామీద ఆయన ప్రభావం చాలా ఎక్కువ.ముసునూరుకు రోజూ మేం నాలుగు మైళ్ళు నడిచి వెళ్ళి చదువుకునేవాళ్ళం. బాల్యం నుండీ నేను స్కూలు ఫస్టే. బాల్యంలో గొప్ప గురువులు లభించడం నా అదృష్టం. కె టి ఎల్‌ నర్సింహాచార్యులు (గోదా గ్రంథమాల), కాలేజీలో ఉన్నప్పుడు దుర్గానంద్‌ వంటివారు నన్ను ఎంతగానో ప్రభావితం చేశారు.

పద్య రచన,మొదటి కథ

హైస్కూల్లో చదువుతున్నప్పుడే నేను పద్యరచన చేసేవాణ్ణి. కంద పద్యాలు, సీస పద్యాలు రాసేవాణ్ణి. 8వ తరగతిలో ఉండగానే విశ్వనాథ సత్యనారాయణగారి ‘వేయి పడగలు’ చదివాను.ఇంటర్మీడియట్‌లో దుర్గానంద్‌గారి దగ్గర భావ కవిత్వం, వచన కవిత్వం నేర్చుకున్నాను. ఆయన అచ్చం ఓ బెంగాలీ కవిలాగా ఉండేవారు. కాలేజీలో చదువుతున్నప్పుడే మొదటి కథ రాశాను. ఆ కథ పేరు ‘ప్రేమ లే(క)ఖ’.

మెడికల్‌ కాలేజీలో లిఖిత పత్రిక

గుంటూరు మెడికల్‌ కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే 1974 -75లో ‘మర్మర్‌’ పేరుతో లిఖిత మాస పత్రిక నడిపేవాణ్ణి. ఇప్పటికీ మిత్రులు ఆ మాస పత్రిక గురించి గుర్తు చేసుకుంటూ ఉంటారు. నా మాస పత్రిక స్ఫూర్తితో హిందూ కాలేజీ, ఏ.సీ కాలేజీల్లో కూడా లిఖిత మాసపత్రికలువెలువడ్డాయి. కాకినాడలో జనరల్‌ సర్జరీ చదివాను. ముంబయి సెవెన్‌ హిల్స్‌ ఆసుపత్రిలో పని చేశాను. ఆ తర్వాత 1983లో సంగెం (వరంగల్‌ సమీపం) లో మెడికల్‌ ఆఫీసరుగా ఉద్యోగంలో చేరాను. అప్పటి నుండీ వరంగల్‌లో స్థిరపడ్డాను. ప్రస్తుతం కరీంనగర్‌ ప్రతిమ ఇనిస్టిట్యూట్‌ గుండెజబ్బుల ఆపరేషన్ల విభాగం హెచ్‌.ఓ.డి గా పని చేస్తున్నాను. ఎం బి బి ఎస్‌., ఎం.ఎస్‌ (జనరల్‌ సర్జరీ), ఎం.సిహెచ్‌ (కార్డియో థొరాసిక్‌, వాస్కులర్‌ సర్జరీ), ఫెలో ఆఫ్‌ వాస్కులర్‌ సర్జరీ చేశాను. మానవ హక్కులపై పీ జీ, టెలివిజన్‌ ప్రొడక్షన్‌లో పీ జీ డిప్లమో, వెబ్‌ ఇంజనీరింగ్‌, వెబ్‌ డిజైనింగ్‌ చేశాను. సృజన,వేవ్స్‌ (స్వచ్ఛంద విద్యా సంస్థ, వరంగల్‌) వ్యవస్థాపకుడిని. వరంగల్‌లో వి.ఆర్‌.విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాసరావు, రామా చంద్రమౌళి, అంపశయ్య నవీన్‌, జితేంద్రరావు, రామశాస్ర్తిల ప్రోత్సాహంతో సృజనలోకం సాహిత్య సంస్థ స్థాపించాను.