తెలుగు నేలపై లలిత సంగీతానికి చిరునామా డాక్టర్‌ ఎం. చిత్తరంజన్‌. మధురమైన లలిత గీతాలతో దేశవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు గడించిన ఆయన కర్నాటక, హిందుస్థానీ సంగీతాల్లో కూడా నిష్ణాతులు. వేలాది పాటలు పాడటంతో పాటు అంతకు రెట్టింపు పాటలకు స్వరాలు సమకూర్చుతూ ఆరున్నర దశాబ్దాలుగా శారదాంబకు స్వరనీరాజనాలు అర్పిస్తున్నారు. చిన్నారులను చదువుకున్న యంత్రాలుగా కాకుండా కళాతృష్ణను పెంచినప్పుడే వారు పరిపూర్ణ వ్యక్తులుగా ఎదుగుతారు.... ప్రతి పాఠశాలలో, కళాశాలలో తప్పని సరిగా, అంకితభావంతో కళలను నేర్పాలి..దేశ పురోగతికి అదే శ్రీరామరక్ష అంటున్న ‘లలిత సంగీత చక్రవర్తి’ చిత్తరంజన్‌కునవ్యనీరాజనం.

లలిత సంగీతంలో మా అమ్మ నా తొలిగురువు. పుచ్చా సుబ్బారావు, ఎం.వెంకట్రాజు గారి వద్ద కూడా లలిత సంగీతంలో మెళకువలు నేర్చుకున్నాను. ఘంటసాల సినీ గీతాలు, ప్రైవేటు పాటలు ఎనిమిదో ఏట నుంచే స్కూల్‌లో పాడే వాడిని. స్వరం లేతగా ఉండటంతో నాటకాలు, నృత్యరూపకాల్లో మహిళల పాత్రలకు స్వరం అందించే వాడిని. నాన్నగారి ఉద్యోగం రీత్యా మా కుటుంబం హైదరాబాద్‌ చేరింది. కొంతకాలం టీచర్‌గా పనిచేసిన ఆయన ఆ తరువాత దక్కన్‌ రేడియోలో చేరారు. దాంతో నాకు ఆ రేడియోలో పాటలు పాడే అవకాశం దక్కింది. కేవలం పాడటం కాదు పాటలకు స్వరాలు కూర్చమని నాన్నగారు నన్ను ప్రోత్సహించారు. ముద్దుకృష్ణ వైతాళికులులోని పద్యాలకు స్వరాలు కూర్చమంటూ ఆ పుస్తకాన్ని నాకు అందించారు. పద్యాలకు స్వరాలు కూర్చడం చాలా కష్టమైన పని. నేను ఎక్కడైనా పొరపాట్లు చేస్తే అమ్మానాన్నలు సరిచేసేవారు. అలా పాటలు పాడటంతో పాటు స్వరాలు కూడా కూర్చే నైపుణ్యం అలవడింది. ఉస్మానియా యూనివర్శిటీ కళాశాలలో బిఎస్సీ చేసే రోజుల్లో అప్పటి ప్రొఫెసర్‌, ఆ తరువాత వైస్‌ ఛాన్సలర్‌ అయిన సూరి భగవంతం గారు నా పాటలంటే చాలా ఇష్టపడే వారు. నన్ను ఇంటికి పిలిపించుకుని మరీ పాడించుకునే వారు.

రేడియోతో మహనీయుల సాంగత్యం

1955 నుంచి ఆకాశవాణిలో తెలుగు కార్యక్రమాల ప్రసారం బాగా పెరిగింది. మంగళంపల్లి బాలమురళీకృష్ణ హైదరాబాద్‌లో ప్రోగ్రాం ప్రొడ్యూసర్‌గా పనిచేసే రోజుల్లో నాకు లలిత సంగీతంలో ప్రోగ్రాం చేసే అవకాశం వచ్చింది. నన్ను స్టూడియోలోకి తీసుకువెళ్లి పాట పాడమన్నారాయన. నా స్వరం, సంగతులు పలికించే తీరు ఆయనకు నచ్చింది. మంగళంపల్లి వారు వయెలిన్‌ అద్భుతంగా వాయించేవారు. ఆయన స్వయంగా వయెలిన్‌ వాయించి నా చేత ఐదు పాటలు పాడించి రికార్డు చేశారు. ఆయన చెంత కూర్చుని పాట పాడటం... ఇది...కలా నిజమా అని మురిసిపోయాను. క్రమంగా రేడియోతో అనుబంధం పెరగసాగింది. కృష్ణశాస్త్రి, దాశరథి, డాక్టర్‌ సి. నారాయణరెడ్డి వంటి సాహితీ దిగ్గజాలకు రేడియోతో అనుబంధం ఉండేది. వారంతా నన్ను బాగా అభిమానించేవారు. వారి సాంగత్యంలో కొంత సాహితీ జ్ఞానం అబ్బింది. తెలుగులో సినీ సంగీత దర్శకులు ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారో గమనించే వాడిని. ఆ పరిజ్ఞానం నా పాటకు మరింత మధురిమను అద్దేది. రేడియోలో నెలకు ఐదు ప్రోగ్రాంలు చేసేవాడిని.