పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొనే అవసరం లేని రచయిత్రి చాగంటి తులసి. తండ్రి చాటు మొక్కలా మిగిలిపోకుండా సాహితీవనంలో స్వీయ పరిమళంతో తరువై వెలసింది. కల్పనా సాహిత్యం, అనువాదం, విమర్శ, పుస్తక ప్రచురణ, సాహితీ సంస్థ నిర్వహణ ఇలా శాఖోపశాఖలుగా విస్తరించింది ఆమె సృజన.

ఎప్పటికప్పుడు కొత్త తరంతో తనను తాను అప్డేట్‌ చేసుకునే నవీన. పక పకల పసినవ్వులతో నైరాశ్యాన్ని దరిచేరనివ్వని సతత హరిత. వక్త, అధ్యాపకురాలు, వ్యక్తుల పట్ల స్థాయీ భేదాలు చూపని సమదర్శి. నిక్కమైన మంచి నిక్కచ్చి మనిషి. మాటలతో ఆటలాడే ఈ ఎనభై వసంతాల నవజవ్వనితో మాట్లాట.ఇటీవల వస్తున్న కథలు చదువుతున్నాను. వస్తు వైవిధ్యం పెరిగింది. ఆయా సమూహాల గురించి వారి వారి తాత్వికతను బలపరచుకోవడానికి రాసినట్టుంటున్నాయి.

బతుకులోంచి వచ్చినవి కాక, మెదడులోంచి వచ్చినవి. ఎక్కువకెక్కువ మాన్యుఫ్యాక్చర్డ్‌ స్టోరీస్‌గా వస్తున్నాయి.‘‘పెద్దై అది ఏమవుతుందో చూద్దాం’’ అనే వాడు చాసో. ‘ఎంపు’ కథ చదివాక... ‘‘నాన్నా! కుంటివాణ్ణి చేసుకోనా? గుడ్డివాణ్ణి చేసుకోనా’’ అని అడిగాను. ఎంతమంది అమ్మాయిలు తండ్రిని అలా అడగ్గలరు? అలా అడగ్గలిగే ఆరోగ్యకరమైన వాతావరణం ఎన్ని కుటుంబాల్లో ఉంటుది? ప్రొగ్రెసివ్‌ అనుకున్న చాలామంది, ఆడపిల్లల విషయంలో మామూలుగా ఆలోచించేవారే ఎక్కువ. అందుకే చాసో డిఫరెంట్‌, కమిటెడ్‌. ఆయన రాత చేతలు వేరు వేరు కావు.

 

చాసో కూతురుగా పుట్టడం అదృష్టమా యాదృచ్ఛికమా?

 యాదృచ్ఛికమే! అయితే వ్యక్తిత్వంతో నన్ను నన్నుగా తీర్చి దిద్ది ‘‘మనిషి’’గా పెరగడానికి దోహదపడ్డాది. చాసో ఆయన మిత్రుల మధ్యా నా పెరకువకు గట్టి పునాదిని వేసింది. సారవంతమైన జీవితానికి దారి తీయించింది.

చాసో హవేళీ మీ సృజనకు ప్రేరణ నిచ్చిందా?

 అందులో సందేహం లేదు. ఊహల అల్లికకు, మంచి చెడ్డల అవగాహనకు, వెలుగు చీకట్ల ఎరుకకు, మనుషుల ప్రవర్తన వెనుక పనిచేసే సామాజిక, ఆర్థిక, నైతిక, ఆధ్యాత్మిక శక్తులతో గట్టిపడ్డ వ్యవస్థ గురించిన తెలివిడి, చూపును ఇచ్చింది. చాసో హవేళీ సాహితీవేత్తల కళాకారుల నిలయం. నాతోపాటు దాని వల్ల ప్రేరణ పొందినవారు చాలామంది ఉన్నారు.

 

చాసో ప్రోత్సహించడం, నేర్పడం చేసేవాళ్ళా?

చాసో దృష్టిలో ప్రోత్సహించడం అంటే, భేష్‌ బాగున్నాయనేసి పెడదారి పట్టించడం కాదు. అందుకే నారాయణ బాబుతో దెబ్బలాడేవాడు. జ్ఞానాన్ని కలగజెయ్యాలి కానీ అజ్ఞానాన్ని పెంచకూడదు. తానో గొప్ప రచయితననే అహంభావం పెరిగే టట్లు ప్రోత్సాహం ఉండకూడదనే వాడు. చాసో నేర్పుతు న్నట్టు నేర్పించనూ లేదు, నేర్చుకుంటున్న స్పృహతో నేను నేర్చుకోనూ లేదు. ఆ వాతావరణ ప్రభావంతో నేను రాయాలని సరదాపడ్డాను. నారాయణబాబు నా సరదాకి దోహదపడ్డాడు. నేను రాసిన కథని మద్రాసు వెళ్లినప్పుడు స్వయంగా ‘బాల’ పత్రికకి ఇచ్చాడు. నాన్నకి చెప్పొద్దన్నాడు. అప్పుడు నేను నాలుగో తరగతి చదువుతున్నాను. రాసిన కథ పేరు భరతపక్షి.

చాసోలాగే- రాసి కన్నా వాసికే ప్రాధాన్యత ఇచ్చారు, చాలా ప్రక్రియలు చేపట్టారుగానీ దేనిలోనూ కంటిన్యూ కాలేదు, కారణం?

రాయడం కోసమే నేను రాయలేదు, రాయాలనిపించినప్పుడే రాశాను. అది ఏ ప్రక్రియలో, ఏ మేరకు రాస్తే బాగుంటుందో, అంతవరకే రాశాను. నా వాళ్ళు ఇది చదివితే బాగుంటుంది అనిపిస్తే దాన్ని తెలుగులోకి చేశాను. ఎంత ‘పెద్ద’ వాళ్ళు అడిగినా నాకు నచ్చితేనే అనువాదం చేయడం, లేకపోతే లేదు. రచనా వ్యాసంగం నాకు కెరియర్‌ కాదు.