విశ్వవిఖ్యాత మరాఠీ రచయిత. దళితుల, అట్టడుగు వర్గాల ప్రజల జీవిత సంఘర్షణ కథా వస్తువుగా రచనలు చేశారు. ఆయన రచనాయాత్ర 1982లో ప్రచురితమైన ‘ఉత్పాత’ కవిత సంకల నంతో మొదలయింది. లింబాళె ఆత్మకథ ‘అక్కరమాశి’ (అక్రమ సంతానం) 1984లో వెలువడింది. ఆ పుస్తకం ఎన్నో భారతీయ భాషల్లోకి అనువాదమై రచయితకు ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు తెచ్చింది. లింబాళె రచనలు- బారామాశి, హరిజన, దళిత బ్రాహ్మణ కథాసంకలనాలు; ఉపల్యా, బహుజన, సనాతన, రామరాజ్య, హిందూ నవలలు ఆయనకు గొప్ప కీర్తి సంపాదించిపెట్టాయి. ఆయన మరాఠీ సాహిత్యానికి హేతుబద్ధత సంతరించి పెట్టిన ఘనుడు. లింబాళె తన తీవ్రమైన, వివాదాస్పదమైన అభిప్రాయాలతో మరాఠీ సాహిత్య ప్రపంచంలో గొప్ప సంచలనాన్నే సృష్టించారు. ఆయన రచనలు దేశ విదేశీ భాషల్లోకి అనువదింపబడి ఆయన్ను అంతర్జాతీయ రచయితగా నిలబెట్టాయి. ‘సనాతన’ నవల 2018లో ప్రచురితమైంది. ఈ నవలకు ఇటీవల జాతీయ స్థాయి ‘సరస్వతీ సమ్మాన్‌’ బహుమతి లభించింది. ఈ సందర్భంగా ఆయనను ప్రసిద్ధ కన్నడ అనువాదకులు చంద్రకాంత పోకళె ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూకు నేను చేసిన తెలుగు అనువాదం ఇది.

ఘట్టమరాజు

మీరు రాసిన ‘సనాతన’ నవలకు అఖిల భారతీయ ‘సరస్వతీ సమ్మాన్‌’ లభించటంపై ఎలా స్పందిస్తారు?

‘సనాతన’ నవల 2018లో అచ్చ యింది. సరిగ్గా 200సంవత్సరాల క్రితం మహారాష్ట్ర లోని భీమా కోరేగావ్‌ పోరాటం జరిగిన కాలమది. ‘సనాతనం’ అన్న పేరు వింటేనే కొందరికి చెమటలు పడ్తాయి. మహా రాష్ట్రలోని కొందరు బుద్ధి జీవులకు కంపరం పుట్టించే సందర్భమది. మరాఠీ సాహిత్య ప్రపంచానికి ‘సనాతన’ నవల కథా వస్తువు సరి కొత్తది. ఈ నవలలో చరిత్ర, ఫాంటసీల సుందర సమ్మేళనం వుంది. ఓ మరాఠీ దళిత రచయి తకు ‘సరస్వతీ సమ్మాన్‌’ లాంటిజాతీయ పురస్కారం లభించడంతో మరాఠీ సాహిత్య ప్రపంచంలో కలకలమే చెలరేగింది. ఓ మరాఠీ దళిత రచయిత భారతీయ భాషల్లోని ప్రఖ్యాత రచయితలతో పోటిపడి నెగ్గుకు రావడం, ప్రతిభావంత జాతీయ రచయితల స్థాయికి చేరుకోవడం... నా కెంతో గర్వంగా వుందంటాను.

మీరు కొన్ని దేశాలు తిరిగారు. దళిత దృక్పథంలో ప్రపంచాన్ని పరిశీలి స్తున్నారు. ఇతర దేశ సాహిత్యాలకు మన దేశీయ భాషల సాహిత్యానికి ఏమైనా వ్యత్యాసం కనిపించిందా?

నేను రచనలు చేయడం మొదలు పెట్టిన తొలి రోజుల్లో మహారాష్ట్రలోని ‘మహార్‌’ జాతి జనుల కష్టకార్పణ్యాల్ని చిత్రించాను. ఆనాటి నా రచనలు ఒక జాతి లేదా మరాఠీలోని ఓ దళిత శాఖకు మాత్రమే పరిమితమై వున్నాయి.ఉదాహరణానికి తెల్లవారు ఆస్ట్రేలియా దేశానికి పోయి, అక్కడి స్థానీయుల భూముల్ని ఆక్రమించుకోగా వాళ్లు ఇతర దేశాలకు పారిపోయారు. ఆస్ట్రేలియా దేశ మూలవాసులకు, మన దేశ ప్రజల స్థితికి సమానత్వ ముందనిపించింది. ఇది అమెరికాకూ వర్తిస్తుంది. సమస్యలు భిన్నంగా వుండొచ్చు. పరిస్థితులు ఒకటే. అక్కడి మూల నివాసుల, మన దేశ ఆదిమతెగల వ్యథలూ ఒకటే. అమెరికా దేశంలోని నల్లజాతి జనులు చేసిన ఆందోళన, అక్కడి రాజకీయ క్షేత్రంపై తీవ్రమైన ప్రభావం కలిగించింది. మేం కూడా ఆ నల్లజాతి జనుల ఉద్యమం వల్ల ప్రభావితులం అయ్యాం. మాకూ, వాళ్లకూ సంబంధాలున్నాయి.