పలకరింపు : ముక్కామల చక్రధర్‌

కేరాఫ్‌ కూచిమంచి అగ్రహారం కథలు రాయడానికి ప్రేరణ ఏమిటీ...?

మా ఊరే... మా అగ్రహారమే. అక్కడి మనుషులే. చిన్నతనం నుంచి నేను చూసిన మనుషులు, నేనుభవించిన జీవితం తాలూకు నీడలే కేరాఫ్‌ కూచిమంచి అగ్రహారం కథలు. కూచిమంచి అగ్రహారంతో సంబంధం ఉన్న వారంతా ఇలాగే ఫీలవుతారు.మన కె.ఎన్‌.వై. పతంజలి... మళయాళీ రచయిత ఓ.వీ.విజయన్‌... రష్యన్‌ మహారచయిత చింగీజ్‌ ఐత్‌మాతోవ్‌ అన్నట్లు నీ అనుభవాలకు మించిన కథా వస్తువులు ఏం ఉంటాయి గనుక. ఈ కథల్లో పాత్రలన్నింటితోనూ నాకు ప్రత్యక్ష పరిచయం ఉంది. నేను వారితో కలిసి నడిచాను. వారిలో కొందరు వెంట తరమగా పరుగులు పెట్టాను.

ఈ కథల్లోని పాత్రలన్నీ సజీవమైనవే కదా... కథలు చదివాక వారి బంధువుల ప్రతిస్పందన ఎలా ఉంది...?

పాత్రలన్నీ సజీవమైనవే కనుక వారి బంధువుల నుంచి మంచి ప్రతిస్పందనే వచ్చింది. నిజానికి ప్రతిస్పందన అనే కంటే ఈ కథలు చదివిన తర్వాత వారి కళ్లల్లోంచి వచ్చిన కన్నీళ్లు నన్ను నిలువనీయలేదు. డాక్టర్‌ రామన్‌ కథ చదివినతర్వాత అతని తల్లిగారు పది రోజుల తర్వాత ఫోన్‌ చేశారు. ఆ తల్లి అన్న మొదటి మాట... నీతో ఇంతకు ముందే మాట్లాడాలి బుజ్జీ. కన్నీళ్లు ఆపుకోలేనేమోనని భయం వేసింది అన్నారు. అలాగే ఇతర పాత్రలకు సంబంధించిన బందువులు కూడా చాలా ఎమోషనల్‌ అయ్యారు.

దాదాపు మూడున్నర దశాబ్దాలుగా తెలుగు సాహిత్యంతో మీకు అనుబంధం ఉంది. ఇంత సీరియస్‌గా ఇంతకు ముందు రాయలేదు. ఇప్పుడే ఎందుకు రాసారు?

నిజానికి నాకు చదవడం పట్ల ఉన్న శ్రద్ధ రాయడం పట్ల లేదు. పైగా ఇప్పుడు సాహిత్యంలో ఏరులై పారుతున్న గ్రూపులు కూడా నన్ను రాయడానికి వెనుకంజ వేసేలా చేసాయి. ఇక ఇప్పుడే ఎందుకు రాసానంటే.... ప్రత్యేక సందర్భం లేదు. లోలోపల గూడుకట్టుకున్నదేదో భళ్లున పగిలింది. అంతే.. అంతకుమించి ప్రత్యేకత ఏమీ లేదు.

మీ కేరాఫ్‌ కూచిమంచి అగ్రహారం కథలు తొలి ముద్రణలో ప్రతులన్నీ వారం రోజుల్లోనే అమ్ముడైపోయాయంటున్నారు. ఇదెలా సాధ్యం?

ఈ కథలు సారంగ వెబ్‌ మేగజైన్‌లో సీరియల్‌గా వస్తున్నప్పుడు మా ఊరి వాళ్లతో పాటు చాలామంది స్పందించారు. కథలు నచ్చాయిలే అనుకున్నా. అయితే ఆవిష్కరణ అయిన తర్వాత ఇంత ఆదరణ వస్తుందని అనుకోలేదు. వచ్చింది. మా కూచిమంచి అగ్రహారానికి చెందిన ఓ మిత్రుడు వంద పుస్తకాలు తీసుకున్నాడు. ఇన్ని ఏం చేసుకుంటావురా అని నేను అడిగితే.... ఇంటికి వచ్చిన అతిథులకు జాకెట్లు, ప్లాస్టిక్‌ సామాన్లు ఇచ్చే కంటే ఈ పుస్తకం ఇస్తే బాగుంటుంది కదా అని నా భార్య అంది అన్నాడు.

99120 19929