అంతర్జాతీయ ప్రచురణ సంస్థ హార్పర్‌ కాలిన్స్‌ ఇటీవల తెలుగులో కొన్ని మంచి కథల ఆంగ్లాను వాదాన్ని ‘ద బెస్ట్‌ స్టోరీస్‌ ఆఫ్‌ అవర్‌ టైమ్స్‌’ పేరిట ప్రచురించింది. ఓల్గా సంపాదకత్వం వహించిన ఈ పుస్తకంలోని కథలను ఎమ్‌. శ్రీధర్‌, అల్లాడి ఉమ ఇంగ్లీషులోనికి అనువదించారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరు అనువాదకులతో ‘వివిధ’ సంభాషణ.

 

మీ ఆసక్తి అనువాదం వైపు ఎప్పుడు, ఎలా మళ్లింది? మీ మొదటి అనువాదం గురించి చెప్పండి?

మాక్మిలన్‌ ఇండియా భారతీయ భాషలనుండి ఇంగ్లీషులోకి కొన్ని నవలలను అనువందించాలను కున్నప్పుడు మమ్మల్ని నమూనాగా ఒక అనువాదం పంపమన్నారు. అలా మా మొదటి అనువాదం, పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథ ‘సతీ సావిత్రి’ 16 మే 1993న ద హిందూలో వచ్చింది. పుస్తకంగా వచ్చింది ఓల్గా రాజకీయకథలలోంచి చేసిన ‘ఉమన్‌ అన్బౌండ్‌’. ఇప్పుడు హార్పర్‌ కాలిన్స్‌ కోసం ఓల్గా కూర్చిన సంకలనం మా అనువాదాల్లో ఆఖరిది. మేమే ఎంచుకొన్నా, మరొకరు చేసినా, మూల రచనలు నచ్చితేనే అనువదించాలనేది మా నియమం.

అనువదించటమనే పనిని మీ ఇద్దరూ ఎలా పంచుకుంటారు?

కలిసి అనువాదం చేసేటప్పుడు భావజాలాల్లో సారూప్యత అవసరం. ఇద్దరికీ నచ్చిన రచనల్ని వీలైనంతవరకూ కలిసి చర్చించుకుని చేయడం, వీలుకానప్పుడు మొదట ఒకరు అనువదించి, తరువాత ఇంకొకరు చూసి, అవసరమైతే ప్రత్యామ్నాయాల్ని సూచించడం జరుగుతుంది. మా అనువాదాన్ని తరువాత రచయితలకు పంపడం, వారి సూచనలను పరిగణించడం మా పద్ధతి.

తెలుగు కథల్లోని వచనాన్ని అనువదించటంలో మీకు తరచుగా ఎదురయ్యే ఇబ్బందులు ఏమిటి?

వచనంతో సహా, అన్ని అనువాదాల్లో ఇబ్బందులు మూల భాషల ప్రత్యేక వాక్య నిర్మాణాలూ, జాతీయాలూ, సామెతలూ, మాండలికాలవల్లా, మత, కుల, వర్గ, లింగ బేధాలను ప్రతిబింబించడంలో రచయితల భాషాప్రయోగాలవల్లా వస్తాయి. అనువాదానికి తీసుకున్న రచనలు ఒక విస్తృత ప్రాతిపదికపై ఆధారపడి, ఒక భాషా సమూహం వారి విభిన్న ప్రత్యేకతల్ని చూపెట్టడానికి ప్రయత్నించినప్పుడు వాటినన్నింటినీ, ఆయా రచయితల ప్రత్యేక శైలులతో సహా, మరో భాషా సమూహానికి అందించడం అనువాదకుల బాధ్యతగా మేము భావిస్తాము. ఈ బాధ్యతను ఈ సంకలనం ద్వారా మా శాయశక్తులా నెరవేర్చామని నమ్ముతున్నాము.

ఈ సంకలనంలోని మీ అనువాదాలకు హార్పర్‌ కాలిన్స్‌ సూచించిన మార్పు చేర్పులేమైనా ఉన్నాయా?

హార్పర్‌ కాలిన్స్‌ అన్ని ప్రసిద్ధ ఇంగ్లీషు ప్రచురణ సంస్థలలానే వారి house style కి అనుగుణంగానూ, ఇంగ్లీషులో చదవడానికి సులువుగా ఉండేలా మార్పుల్ని సూచించారు. ఇంగ్లీషు భాష ప్రయోగం కూడా అన్ని భాషలలానే ఆ భాషను వాడే అన్ని చోట్ల, అందరు రచయితల వాడుకలో ఒకే విధంగా ఉండదనీ, ముఖ్యంగా అనువాదంలో మూల రచయితల శైలిని ఇంగ్లీషులోకి తీసుకువెళ్లినపుడు అది కొంత ‘‘కృత్రిమంగా’’ తోచడం తప్పదనీ వారిని మేము ఒప్పించగలిగాము. రచయితల ప్రత్యేక వ్యక్తీకరణలనూ, శైలీ బేధాలనూ ఇంగ్లీషులో చూపెట్టలేనపుడు పాఠకులకు అన్ని కథలూ ఒకరే రాశారా అన్న అనుమానం కలగక తప్పదు. ఇంగ్లీషులో మాత్రమే ఈ అనువాదాల్ని చదవగలిగే పాఠకులకు, కొన్ని సందర్భాల్లోనైనా, ఆయా రచయితలు బహుశా తెలుగులో ఇలా చెప్పిఉంటారేమో అన్న ఆలోచన కలిగితే మా కృషి ఫలించినట్టే.