ప్రవృత్తే పరిశోధనగా గల రిటైర్డ్‌ తెలుగు అసోసియేట్‌ ప్రొఫెసర్‌ మచ్చహరిదాసు. ‘‘తెలుగులో యాత్రాచరిత్రలు’’ రెండు మూడుకంటె ఎక్కువ లేవు అని నాటి కాలపు సాహితీ వేత్తలు అంటే, వారి ముందు డెబ్బయి యాత్రాచరిత్రలను పరచి ‘‘తెలుగులో యాత్రాచరిత్రలు’’ అనే అంశంపై మొదటిగా పరిశోధన చేసి, ‘‘యాత్రాచరిత్రలు’’ను సాహిత్య ప్రక్రియగా స్థిర పరిచారు. పరిశోధన పూర్తయ్యాక నూటాయాభై యాత్రాచరిత్ర గ్రంథాలను ేసకరించారు. ‘‘అష్టాదశ’’ గ్రంథంలో పలు యాత్రా సాహిత్య వ్యాసాలను ప్రక టించారు. ‘‘యేనుగుల వీరస్వామి జీవిత చరిత్ర’’ రచించి తన నిబద్థతను చాటుకు న్నారు. పరిశోధనా తృష్ణ ‘‘సుమతి’’ పై ప్రసరించింది. ఫలితంగా తథ్యము సుమతి అనే మకుటాన్ని గ్రంధనామంగా గ్రహించి ‘‘తధ్యము సుమతి’’ వెలువరించారు. అదే పరివర్థిత ముద్రణలో తంజావూరులో దొరికిన తాళపత్ర ప్రతులలోని పద్యాలను యధాతథంగా అచ్చువేయించారు. కొమ్మల్లో దాగుండి పరిమళాల్ని వెదజల్లే కుసుమంగా కరీంనగర్‌ నుండి తనదైన శైలిలో సాహితీ ేసద్యం చేస్తున్నారు.

యాత్రా చరిత్ర రచయితల శాతం అత్యల్పంగా వుండడానికి కారణమేమిటి?

యాత్రా చరిత్ర కారులకు, మిగతా రచయితలకు మౌలికమైన తేడా ఒకటుంది. విదేశ యాత్రా సాహిత్యంతో పోలిేస్త, మన తెలుగు యాత్రా సాహిత్యం ఇంకా కౌమారదశలోనే ఉంది. మనవాళ్లు యాత్రలు చేయరని కాదు కాని, చేేసవారిలో ఎక్కువ శాతం కేవలం భ్రమణ మాత్రులుగానే మిగిలిపోవడం ముఖ్య కారణం. చాల తక్కువమంది యాత్రను ఆంతరికంగా అనుభవించి, గాఢ పరిశీలనతో ఆ యాత్రా విశేషాలను లేఖన బద్ధం చేసి ప్రజల కందిస్తారు. ఆ విధంగా స్వీయానుభూతితో అభివ్యక్తం చేయగలిగిన వారే యాత్రా చరిత్ర కారులవుతారు. యాత్ర చేయాలంటే ఆ రచయిత సమయాన్ని, డబ్బును వెచ్చించగలగాలి. దైహికంగా బాగుండాలి. వ్యయ ప్రయాసలతో కూడినది కనుక యాత్రారచన విరివిగా జరుగడం లేదు. కవిత్వం, కథలు, నాటకాలు, వ్యాసాలు రాయడానికి బయటికి వెళ్లాల్సిన అవసరం లేదుకదా!

హైటెక్‌ ప్రయాణాలు యాత్రా రచనకు ఎంత వరకు దోహద పడతాయి?

కాళ్ళు లేని వాడు రెక్కలు తెగిన పక్షి. ప్రయాణ సౌకర్యాలు లేని పూర్వకాలంలో మనిషి ఎక్కడికి వెళ్ళాలన్నా కాలినడకే శరణ్యం. కాబట్టి సుదీర్ఘ యాత్రల్లో వారికి లోక పరిశీలనకు, ప్రజలతో మమేకం కావడానికి అవకాశం దొరికేది. అనుభూతి ప్రధానంగా ఆ యాత్ర కొనసాగేది. ఈ గ్లోబలైజేషన్‌ కాలంలో వాహన సౌకర్యాలు పెరిగి, సుఖ వంతంగా ప్రపంచాన్ని కొన్ని రోజుల్లోనే చుట్టి రావడానికి వీలు కలుగుతున్నది. ఐతే ఈ ప్రయాణ వేగం వల్ల యాత్రా వివరాలు తగ్గిపోయి, యాత్రాగమ్యానికే అధిక ప్రాధాన్యం లభిస్తున్నది. విమాన యాత్ర అసలు యాత్రే కాదంటాడు విస్తృత యాత్రికుడు రాహుల్‌ సాంకృత్యాయన్‌. ఇప్పటి విదేశీ యాత్రలన్నీ ఆ రకంగా జరుగుతున్నవే. ఐనా ఆయాదేశాల్లో పర్యటిస్తూ ఆధునిక యాత్రా చరిత్రకారులు అక్కడి విశేషాలను ఆసక్తికరంగా మలచి చూపుతూ యాత్రా సాహిత్యాభివృద్థికి తమ వంతు కృషి చేస్తూనే వున్నారు.