కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడడం వల్లే, దళితవాదం, స్త్రీవాదం వంటివి తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించాయి. అప్పటిదాకా కమ్యూనిస్టులుగా, విప్లవకారులుగా తమని చెప్పుకున్న కొందరు, దళిత ఉద్యమకారులుగా, స్త్రీ వాదులుగా మారారు. ఆ వాదాలతో చెయ్యగలిగిందేమీ లేదు. కమ్యూనిజాన్ని ‘ఫ్యాషన్‌’గా భావించినవాళ్ళకి, ఆ ఫ్యాషన్‌ పాతపడినట్టే కనపడి, కొత్త ఫ్యాషన్లను వెతుక్కున్నారు. దళితవాదుల దృష్టి ఎంతసేపూ రాజ్యాంగయంత్రంలో (ప్రభుత్వంలో) చోటు సంపాదించడంమీదా, రిజర్వేషన్ల కొనసాగింపుమీదా, వుంటుంది. అంతేగానీ, ‘దోపిడీ వ్యతిరేక దృష్టి’ వుండదు. స్త్రీ వాదులు, బూర్జువా ఆస్తి సంబంధాలను గానీ; స్త్రీ-పురుషుల మధ్య వున్న అసమాన శ్రమ విభజనను గానీ పట్టించుకోరు. పురుషాధిక్యత (పేట్రియార్కీ) అని పదేపదే వల్లించినా, దానికి వున్న ‘మూలాల’ మీద, దృష్టిపెట్టరు.

 

ఏయే ప్రభావాలు, అనుభవాలతో ఈ రంగనాయకమ్మ తయారయ్యారు?

ఏ రచయిత అయినా, తన చిన్నతనపు ప్రభావాల తోటే, అనుభవాల తోటే, ప్రారంభమవుతారని నా అభిప్రాయం. నా విషయంలో కూడా అలాగే జరిగినట్టు వుంది. కానీ, ఆనాటి భావాలూ, కొన్ని రాతల తర్వాత కలిగిన భావాలూ, పూర్తిగా ఒకటే కాదు. 20ఏళ్ళ జీవిత కాలం వరకూ, ‘నాస్తికత్వం’ అనే మాట నాకు తెలీదు. ఆ తర్వాతే, కందుకూరి వీరేశలింగంగారి ఆత్మకధలో తర్కాలు చూసినప్పటినించే ఆ ప్రశ్నలు ప్రారంభం అయ్యాయి- అనుకుంటాను. ఆ రచయిత భక్తుడే. నాలో, తర్కమేగానీ, భక్తి నిలబడలేదు. ఆ తర్వాత, ‘మార్క్సిజం’, నాస్తిక భావాల దగ్గిరే ఆగిపోని వ్వకుండా, వాటితో పాటు, సమాజంలో వున్న ‘శత్రువర్గభావాల్ని’ తెలుసుకునే దృష్టినిచ్చింది. ఈ ప్రభావాలే చెప్పగలను.

స్వేచ్ఛాజీవులైన మీరు మార్క్సిజం అనే ఒక ‘గుంజకు కట్టేసుకోవడం’ వల్ల మీ స్వేచ్ఛా ఆలోచనా ప్రవాహానికి అవరోధం కావడం లేదా?

మీరు, ఇలా అన్నారు: ‘మార్క్సిజం’ అనే ఒక గుంజకు కట్టుకోవడం వల్ల మీ స్వేచ్ఛా ఆలోచనా ప్రవాహానికి అవరోధం కావడం లేదా?- అని. ‘మార్క్సిజం’ అనే ఆ గుంజే ‘సత్యం’ అనుకోండీ! ‘సత్యం’ చుట్టూ తిరగడంవల్ల, తప్పు ఆలోచనలు పోయి, మంచి ఆలోచనలు ఏర్పడతాయి కదా? మీ దృష్టిలో, ‘మార్క్సిజం’ ‘సత్యం’ కాదనుకుందాం. మీరు ‘సత్యం’ అనుకున్న దాన్ని దేన్ని అయినా చెప్పండి! అప్పుడు, ఆ సత్యం చుట్టూ తిరగవలిసిందే కదా? ఒకవేళ మీరు, ‘ఏదో ఒకే సత్యం వ ుంటుందని నేననుకోను. వేరువేరు సత్యాలు వుంటాయి’ అంటారా? - అవి అన్నీ సత్యాలే అయితే, అటు వంటివి అన్నీ ఒకే సత్యంలో భాగాలే అవుతాయి కదా? లేకపోతే, అవి వేరు వేరు సత్యాలైతే, వాటి మధ్య ఒకదాన్ని ఒకటి తిరస్కరించే వైరుధ్యాలు వుంటాయి కదా? ఏదైనా నాలుగైదు సత్యాల్ని, చూపించండి. 2, 3 సత్యాల్ని అయినా నిర్ణయించుకుని మీరే ఆలోచించండి! ‘సత్యం’ అనేది, ఒకటే వుంటుందా; ఎన్ని రకాలుగా అయినా వుంటుందా? - ఇదీ అసలు చర్చించ వలిసిన విషయం.

మీ విశ్వాసాలతో, నమ్మకాలతో మీరు వ్యక్తిగతంగా కోల్పోయిందేమిటి? బాధపడిందేమిటి? సమాజానికి జరిగిందేమిటి?

నా విశ్వాసాల్లో, నమ్మకాల్లో, ప్రధానమైన విషయాలు: ‘ప్రకృతి’ విషయాల్లోగానీ, ‘సమాజపు’ విషయాల్లోగానీ, హేతుబద్ధ దృష్టే. ఒకరు, ‘నేను అలా వున్నా’నని చెప్పు కోవడం కాదు; ఇతరులు తెలుసుకోవాలి. నా విశ్వాసాలు, హేతుబద్ధ తర్కం వేపు మారితే, వ్యక్తిగతంగా పోయిందేం వుంటుంది? తల్లిదండ్రులనించీ, బంధువులనించీ, దేనినించీ పోయిందేమీ లేదు. తెలుసుకున్న మంచి గ్న్యానంవల్ల, బాధ ఎందుకు వుంటుంది; సంతోషమే వుంటుంది గానీ? సమాజానికి జరిగిందేమిటి అంటారా? నా భావాల మార్పు వల్ల, సమాజానికి ఏదో జరిగిపోయింది - అంటానా? ‘శత్రువర్గాల సమాజం’ మారిపోయే తర్కాన్ని చెప్పింది మార్క్సు, ఎంగెల్సులు. అయినా, దాని వల్ల ‘సమాజంలో మార్పు జరిగిపోయింది’ అంటానా? ‘జరుగుతుంది’ అనాలి. నా భావా లన్నీ ఆ మార్పు కోసమే.