జీవితంలో ప్రజాస్వామిక దృక్పథాన్ని అలవాటు చేసిన వ్యక్తి మా నాన్న మధురాంతకం రాజారాం అని వినమ్రంగా చెబుతారు కథా రచయిత మధురాంతకం నరేంద్ర. నాన్న ప్రబోధించిన ఆ దృక్పధమే తనకు సొంత గొంతుకతో కథనం చెప్పటం అలవాటు చేసిందంటారు. సమాజంలోని దుర్మార్గాలు, బాధలు, దౌష్ట్యం, కన్నీళ్ళు, కష్టాలు కలగచేసిన డిస్టబెన్స్‌ తన కథల్లో చోటు చేసుకుంటుందనే మధురాంతకం నరేంద్ర మానసిక శ్రమ కన్నా శారీరక శ్రమ గొప్పదంటారు. శారీరక శ్రమ చేసేవారిలో శ్రమైక జీవన సౌందర్యంతో పాటు కల్మషం లేని మనసులుంటాయని గాఢంగావిశ్వసిస్తూ శ్రమైక జీవుల జీవితాల్నే తన కథలకు ముడివస్తువుగా చేసుకునే మధురాంతకం నరేంద్ర అంతర్లోకాల్లోకి పయనిద్దాం నవ్య నీరాజనంలో.

బాల్యం

చిత్తూరుజిల్లాలో రమణయ్యగారిపల్లె అనే చిన్న వూరు మాది. ఇక్కడే మా నాన్న ఉపాధ్యాయుడు. చంద్రగిరి తాలూకాలో వున్న పాకాలకు ఐదు మైళ్ళ దూరంలో దామలచెరువు వూరుంది. అక్కడి నుంచి ఒక సన్నని బాటలో మూడు మైళ్ళు ప్రయాణం చేస్తే మా వూరొస్తుంది. మా వూరు బాటకి పక్కగా ఒక ఏరు పారుతూ వుండేది. దానిపేరు చింతలేరు. ఆ ఏరుని ఆనుకుని వున్న దీర్ఘచతురస్రపు పూరిల్లులోనే నేను పుట్టాను. అదే ఇంట్లో మా నాన్న పుట్టాడు. నేను పుట్టిన రెండేళ్ళకు మా తమ్ముడు మహేంద్ర, తర్వాత చెల్లి కూడా అక్కడ పుట్టిన వారే. కోడి కూసే ఝామున పాత కాలపు దుప్పటి కప్పుకుని ఆ నాన్న, ఆయన ఒళ్ళో నేను వుండగా మా నాన్న వె ంకట పార్వతీశ కవుల ఏకాంత సేవ ని నోటికి చదువుతూ వుండేవాడు. అది నా బాల్యంలో గుర్తుండిపోయిన జ్ఞాపకం నాకు. ఇది కాకుండా పెన్నేటిపాట, ఆరుద్ర సినీవాలి, పుట్టపర్తి వారి శివతాండవం, విశ్వనాథ వారి ఉపసంహారం మా నాన్నకు ఇష్టమైన కావ్యాలు.మా నాన్న రమణయ్యగారిపల్లె నుంచి పాకాల, పాకాల నుంచి దామలచెరువుకు వచ్చేశారు. తర్వాత అదే మా వూరు అయిపోయింది.నా తమ్ముడితో నాకు ఉన్న అనుబంధం వాడు మాయమైపోయేంతవరకు నాకు తెలియలేదు. నాకు నీడలా ఉంటూఉండేవాడు. ఎప్పుడూ కొట్టుకునేవాళ్ళం. తిట్టుకునేవాళ్ళం. పెద్దయిన తర్వాత మారిపోయామనుకోండి. నా దురదృష్టం. వాడినేమయినా అడుగుదామంటే మమల్ని వదిలేసి పై లోకాలకు వెళ్ళిపోయాడు. (ఇది చెబుతున్నప్పుడు నరేంద్రగారి గొంతు రుద్ధమయింది.)ఇక నా చదువంతా గమ్మత్తుగా సాగింది. ఎవరో చెప్పిన మాట విని మా నాన్న పాలిటెక్నిక్‌లో చేర్పించారు. అలా నేను డి.ఫార్మసీలో చేరాను, బి.ఫార్మసీలో చేరటానికి ఈ అర్హత సరిపోదు. ప్రైవేటుగా ఇంటర్మీడియట్‌ చేశాను (నా సబ్జెక్టులు కూడా చరిత్ర, ఆర్థిక శాస్త్రం,రాజనీతిశాస్త్రం) దాంతో నాన్నకు నమ్మకమేర్పడి బి.ఏ లో చేర్పించారు. అది పూర్తవ్వగానే ఎం.ఏ ఇంగ్లీషులో చేరదామని బుద్ధిపుట్టింది. అప్పటికి సాహిత్యమంటే ఒక ఇష్టం ఏర్పడింది.

తొలి కథ

నేను మధురాంతకం రాజారాం గారి అబ్బాయినవటంవల్లనో ఏమో నేను డి.ఫార్మసీలో ఉండగానే మా కాలేజీ సావనీర్‌ కోసం మా ఆంగ్లోపాధ్యాయుడు నన్నో కథ రాయమని అడిగారు. ఇదేదో మన పని కాదు కదా అని నాకు అనిపించలేదు. చాలా సహజంగా మన పనే కదా అన్నట్టు రాయటం మొదలుపెట్టాను. మా కాలేజీలో వుంటే ఒక తాగుబోతు మిత్రుడి కథ. కథ గురించి నాకు ఏమీ తెలియక పోయినా రాసేశాను (నవ్వు). ఆ కథ పేరు ‘చివరికి దొరికిన జవాబు’. నాకు అతని మీద పుట్టిన కోపం లోంచి వచ్చిన కథ అది. అప్పుడే నాన్న పుస్తకాలు చదవడం అలవాటయింది. ‘చందమామ’ కు కథ రాసి పంపించాను. కొడవటిగంటి కుటుంబరావుగారు దాన్ని ఎడిట్‌ చేసి ప్రచురించారు. ఇంకొన్ని కథలు కూడా రాశాను. కొన్ని ప్రచురించారు. కొన్ని ప్రచురించలేదు. ఆ ఉత్సాహంతో ఒక పాతిక కథలు రాశాను. ఆంధ్రజ్యోతి, ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభ వార పత్రిలలో నా కథలు వచ్చాయి. ఈ లోగా ఎం.ఫిల్‌ లో పడిపోయి కథలు రాయటంలో కొంత విరామం ఏర్పడింది. అది నాకు మేలు చేసింది.