‘నేనూ-చీకటి’ సంచలన నవల ద్వారా తెలుగు సాహిత్యానికి పరిచయమయ్యారు కాశీభట్ల వేణుగోపాల్‌. కథా కథనంలో కవితా వచనానికీ, భాషలో మణి ప్రవాళ శైలికీ, పాత్ర నిర్వహణలో మనో విశ్లేషణకూ ప్రసిద్ధుడు. అతని అనేక పాత్రలు ఆధునిక మానవుని అంతరంగ కల్లోలాలు. అంతగా ఎవరూ స్రృశించడానికి సాహసించని స్ర్తీ పురుష సంబంధాల్నీ, పురుషుని చీకటి ఆలోచనల్నీ, నిషేధిత సంబంధాల్నీ (ఇన్‌సిస్ట్‌) తెలుగు సాహిత్యంలోకి తెచ్చి తనకంటూ ఒక ప్రత్యేకత (సిగ్నేచర్‌ ట్యూన్‌)ను ఏర్పాటు చేసుకున్న రచయిత. దేశాటన, చదివే అలవాటే నన్ను రచయితను చేశాయి అంటున్న కాశీభట్లతో  ఇంటర్వ్యూ మీ కోసం...

బాల్యం నుండే సాహిత్య పఠనం

మా అమ్మ కాశీభట్ల హనుమాంబ. ఆమే నా మొదటి గురువు. నాకు ఇద్దరు అన్నలు. ఆరుగురు అక్కలూ. అందరికన్నా ఆఖర్న నేను. తొమ్మిది నెలల బిడ్డగా వున్నప్పుడే నేను స్పష్టంగా మాట్లాడుతుంటే ముచ్చటపడి నాకు కాళిదాసు, రఘువంశ కావ్యంలోని శ్లోకాల్ని నేర్పించింది అమ్మ. అమరకోశాన్ని బట్టీపట్టించింది. అన్నలూ, అక్కలూ అంతా వెళుతుంటే వాళ్ళ వెంటపడి గ్రంథాలయానికి వెళ్తూ చదవడాన్ని అలవాటు చేసుకున్నాను. అమ్మకూ అక్కలకూ సాహిత్యం యిష్టం కాబట్టి నేనుకూడా కవి కావాలనుకున్నాను. అప్పటి నుండే మల్లాది రామకృష్ణశాస్త్రి, విశ్వనాథ సాహిత్యాలను చదువుతూ వచ్చాను. అలా పెరిగి పెద్దవుతూ తెలుగు, సంస్కృతం,పాశ్చాత్య సాహిత్యాలను కూడా చదువుకున్నాను. ఆ చదివే అలవాటే నన్ను రచయితను చేసింది.

ప్రభావాలు

మల్లాది, బుచ్చిబాబు, శ్రీశ్రీ ల ప్రభావం నా మీద బాగా ఉంది. శ్రీశ్రీ ప్రభావం నుండి చాలా త్వరగానే బయటికొచ్చాను. ఆ తర్వాత శేషేంద్ర అభిమానిగా మారిపోయాను. మొదట్లో అభ్యుదయ, విప్లవ సాహిత్యాలు ఆకర్షించినా, విశ్వసాహిత్యాన్ని చదివే క్రమంలో దాని నుండి బయటపడ్డాను.

దేశాటన

దేశాటన చేయడం నాకు ఎంతో ఇష్టంగా ఉండేది. అందుకే మూడుసార్లు దేశాటన చేశాను. చదివే అలవాటుతో పాటు, అలా దేశాటన చేయడం వల్ల కూడా నాలోని రచయిత గాఢమైన అనుభూతుల్ని వొడిసి పట్టుకోగలిగాడనుకుంటాను. నేను రచయిత కావడానికి అదే కారణమైందనుకుంటాను. యవ్వన ప్రాయంలో ఉండగా సైకిల్‌ మీదా, స్కూటర్‌ మీదా మూడుసార్లు దేశాటన చేశాను. జీవితాన్వేషణలో వారణాసిలోనూ, లక్నోలోనూ కొంత కాలం ఉన్నాను. ఆ సమయంలోనే సంగీత సాధన చేశాను.

పాశ్చాత్య సాహిత్య ప్రభావం

సామాజిక స్పృహ వుండాల్సిందే. అలా అని అదే రాయాలి, అలాగే రాయాలి అని నిర్దేశిస్తే సృజన దెబ్బతింటుంది. రొడ్డ కొట్టుడుగా మారుతుంది. అతి సామాజిక స్పృహవల్ల తెలుగు సాహిత్యం కండీషన్‌ అయిపోయిందని నా ఉద్దేశం. తెలుగు సాహితీ ప్రయాణం వైష్ణోదేవీ గుహల్లోంచి చేస్తున్న ప్రయాణంలా ఉంది. ఒక వైపు జరిగితేనేమో కమ్యూనిస్టు ప్రభావాల గోడ. మరో వైపు జరిగితే మత భావాల గోడ. ఈ రెండూ దారిని యిరుకుగా చేసేశాయి. సాహిత్యాన్ని నిలువ నీటిగా చేసేశాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే విశ్వ సాహిత్య పఠనం నన్ను నదీ ప్రవాహం లాంటి సాహిత్యం వైపు మళ్ళేలా చేసింది. అందుకే నాపైన పాశ్చాత్య రచయితల ప్రభావమే ఎక్కువగా వుంది. మరీ ముఖ్యంగా కాఫ్కా, నెబకోవ్‌ నన్ను సమ్మోహితుణ్ణి చేసినట్టే జర్మన్‌,ఫ్రెంచ్‌, రష్యన్‌ రచయితల రచనలు కూడా నన్ను ఆకట్టుకున్నాయి.