భారతీయ మతం వూరబెట్టింది

పాప పుణ్యాల పేరుతో భారతీయ తత్వశాస్త్రం మత భావాన్ని వూర బెట్టింది. తాత్వికత పేరుతో జరిగే ఆధ్యాత్మిక మోసం చాలా ఉంది. ఇది ఫలానా ఆలోచన రావడ మే ‘పాపం’ అనేంతగా మానసిక సంకెళ్ళను తయారు చేసింది. పాశ్చాత్య మానసిక శాస్త్రం వికసించి అక్కడి మానవుల్ని విముక్తుల్ని చేస్తే, మన దేశంలో సగటు పౌరుడి మనో వికాసం జరగనే లేదు. అందుకే సెన్సార్‌ లేని (Un censored) ఆలోచనల్నీ సాహిత్యంలోకి తెస్తే, వాటికి ఆమోదం లభించలేదు. ఈ ‘ఇరుసు’ సృజనను ఆపేస్తోంది. అడ్డుకుంటోంది.

మొదటి నుంచీ స్రీ పక్ష పాతినే

వాదాలతో నాకు ఎలాంటి పేచీ లేదు. నేను మొదటి నుండీ స్ర్తీ పక్ష పాతినే. నా సాహిత్యమంతా అదే వ్యాపించి ఉంటుంది. అయితే వాదాలన్నీ, విషయాలుగా మాత్రమే ఉంటాయి. దానికి వైయుక్తిక శిల్పం అమరితేనే సాహిత్య సృజన అవుతుంది.

మొదటి కథ

1974 లో ఆంధ్ర పత్రికలో (సరిగా గుర్తులేదు) ‘రంగనాయకి లేచిపోయింది’ అనే కథతో నా సాహితీ ప్రయాణం ప్రారంభమైంది. ఒక పడుచు వితంతువు. ఆమె కష్టాల్లో వుంది. అకస్మాత్తుగా కనిపించకుండా పోతే లోకం ఆమె గురించి ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తుందో నా మొదటి కథలో రాశాను. తర్వాత విస్తృతంగా కవిత్వం రాసినా, వైయుక్తికం అనుకుని అచ్చేసుకోలేకపోయాను. ‘నేను-చీకటి’ నవల చిత్తు ప్రతిగా వున్నప్పుడు దాన్ని చదివి, ఎత్తి రాసిన కథా రచయిత వెంకట కృష్ణ. అది అచ్చయ్యేంతదాకా వెంటపడటమే యిప్పటి నా సాహితీస్థితికి కారణం.

నవలలు, కథలు

‘నేను-చీకటి’ నవల రాసిన తర్వాత వరసగా నవలలు రాశాను. ఆ పరంపరలో భాగంగా కథలు కూడా రాశాను. ‘తపన’, ‘రంగులగదీ’, ‘దిగంతం’ కథలు రచయితగా నన్ను స్థిరపరిచాయి. ‘రాళ్ళెత్తిన కూలీ’ కథ ఒక కథకుడుగా నాకు మంచి పేరు తీసుకువచ్చింది. ఆ తర్వాత వరుసగా కథలు రాశాను. ‘కాశీ భట్ల కథలు’, ‘ఘోష’ సంపుటులు తీసుకువచ్చాను. బలిందా కథ సినిమాగా మారడం నాకు గొప్ప సంతృప్తిని ఇచ్చింది.

కథకుణ్ణి నేనే

నా నవలలు అన్నీ కూడా పెద్ద కథలే. నా నవలా ఇతివృత్తాలన్నీ డైరీల్లాంటివే. ఎదురైన ప్రతి అనుభవాన్నీ కథలుగా మలిచాను. ఆ కథల్లో నేనే కథకుడిగా ఉండి ఆ కథలు చెప్తాను. అట్లా చెప్పడం చాలా సౌలభ్యంగా, ఎక్స్‌ప్రెసివ్‌గా వుంటుంది.

వ్యక్తిగత విశృంఖలత్వం

వ్యక్తిగత విశృంఖలత్వంతో రాస్తున్నానని నన్ను ఎవరైనా అంటే నేను ఒప్పుకోను. అది ‘ఓపెన్‌ థాట్‌ రైటింగ్‌’ అని ఎందుకు అనుకోరు? భాషాపరంగా, మణిప్రవాళ శైలి తెలుగు వాక్యాల్లో ముందు నుంచీ వున్నదే. దానికి మనోవిశ్లేషణ కలగలిపి కథనంగా రాయడం వల్ల సంక్లిష్టంగా అనిపిస్తుంది. ప్రతి సృజనకారుడికీ తనదైన బాణీ వుండాలంటారు గదా? అలాగే నాదైన అభివ్యక్తి నాకు ఉందని అనుకోండి.

కథలన్నీ చీకటి కీకారణ్య ప్రయాణాలే

నిజమే. నేను రాసిన కథల్లో చాలా కథలు అంతరంగ విశ్లేషణతో కూడిన కథనాలే రాశాను. రాసినవన్నీ అట్లాంటివే రాయలేదు. ‘ఘోష’ కథ చదివి వేణుగోపాల్‌ అన్నీ ఇలాంటి కథలే రాశాడు అంటే ఎలా? ముందే చెప్పినట్టుగా, నాది ‘ఓపెన్‌ థాట్‌ రైటింగ్‌’. నిద్రకూ, మెలకువకూ మధ్య ఒక అవస్థ ఉంటుంది. ఆ స్థితిలో బాహ్య బాహు అంతర్గతాన్ని సృజిస్తే అది చాలా సంక్లిష్టంగా వుంటుంది. అదే చైతన్య స్రవంతి శైలీ కథనంలా వుంటుంది. అది చిత్ర లేఖనంలో సాల్విదార్‌ దాలీ చేశాడు. నేను సాహిత్యంలో చేయాలని ప్రయత్నించాను. అలా అని అన్నీ సర్రియలిస్టిక్‌ ఇతివృత్తాలని కాదు. చాలా సరళంగా అలతి అలతి పదాలతో కూర్చినవీ చాలా వున్నాయి. కర్నూలు వరదల్లో మునిగిపోయినప్పుడు ఒక ముస్లిం చిత్రకారుడి గురించి కథ రాశాను. ‘బలిందా’, ‘రిపుంగానం’, ‘ఎక్కడో నిశ్శబ్దంగానే’ యిలా ఎన్నో కథల్లో మానవ జీవితాన్ని చిత్రించాను.