మీదీ, నాన్నగారిదీ సాహిత్య నేపథ్యం గురించి చెప్పండి?
మా నాన్న జర్నలిస్టులూ రచయితలతో కూడి సాహిత్య నేపథ్యమున్న కుటుంబంనుంచి వచ్చారు. ఆయన ముత్తాత దాసు శ్రీరాములుగారు. సంగీత నిపుణులు, బహుముఖప్రజ్ఞాశాలి. దక్షిణ భారత దేశంలో మొట్టమొదటి ముద్రణాలయం ‘వాణీ ప్రెస్’ మా నాన్న కుటుంబం నెలకొల్పినదే. ఈ ముద్రణా లయం నుంచే స్వాతంత్ర్యోద్యమానికి మద్దతుగా ‘జాగృతి’ పత్రిక వెలువడేది. తొలితరం రచయిత్రి, సమాజ సేవకురాలు కనుపర్తి వరలక్ష్మమ్మ మా అమ్మకు మేనత్త. అలాగే గత ఏడాది మరణించిన ప్రముఖ చరిత్ర రచయిత పాలపర్తి రామ ప్రసాద్ నాకు మేనమామ. ఆ విధంగా మాకు తరాల నుంచీ సాహిత్యంతో అనుబంధం ఉంది.
ఈ పుస్తకం ఆలోచన ఎలా వచ్చింది. అలెఫ్ బుక్ కంపెనీ దీన్ని ప్రచురించటానికి ముందుకు ఎలా వచ్చింది?
అమ్మ 2001లో చనిపోయాక నాన్న నా కుటుం బంతో కలిసి ఉండటానికి అమెరికా వచ్చేశారు. అప్పుడే మా అబ్బాయికి తెలుగు సాహిత్యాన్ని పరి చయం చేయాలన్న ఉద్దేశంతో తెలుగు కథలను అనువదించటం మొదలుపెట్టారు. నాన్న, నేనూ కలిసి తెలుగు రచయితలకు, సమకాలీన తెలుగు కథల అనువాదానికి సహకారం అందించేందుకు ‘ఇండియారైట్స్ పబ్లిషర్స్’ పేరిట ఒక నాన్ ప్రాఫిట్ సంస్థను మొదలుపెట్టాం. అలాగే ‘లిటరరీ వాయిసెస్’ పేరిట ఆన్‌లైన్ మేగజైన్‌ను కూడా కొన్నేళ్లపాటు నడిపాం. తర్వాత తెలుగు కథలకు ఇంగ్లీషు అను వాదాలతో రెండు పుస్తకాలు తీసుకువచ్చాం. అందులో 2010లో రూపా పబ్లికేషన్స్ ప్రచురించిన ‘1947 సంతోషబాద్ పాసెంజర్ అండ్ అదర్ స్టోరీస్’ మొదటిది కాగా, ఈ పుస్తకం రెండవది. మొదటి సంపుటిలోని ఒక కథని ఇటీవల ‘ఫ్రంట్‌లైన్’ పత్రిక పునర్ముద్రణకోసం అనుమతి అడిగింది. అది ‘అలెఫ్’ సంస్థ ఎడిటర్‌తో మా పరిచయానికి దారితీసింది. మేం మొత్తం 25 కథలను వారి ముందుంచాం. వారు వాటిలో 21 కథలు ఎన్నుకున్నారు.
కథల ఎంపికలో అన్ని వర్గాలకూ ప్రాతినిధ్యం ఉండేట్టు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
మేము మైనారిటీ వర్గాల రచయితలకు ప్రాధా న్యతనిచ్చి వారి స్వరాన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వినిపించేట్టు చేయాలనుకున్నాం. సామా జిక మార్పుకు దోహదం చేసే రచయితలు, కథలపై ఎక్కువ దృష్టిపెట్టాం--అది స్త్రీలను తెరమరుగు చేసే సంప్రదాయాన్ని ప్రశ్నించిన వేంపల్లె షరీఫ్ ‘పర్దా’ కథ కానివ్వండి, దళితుల అభివృద్ధికి ఆటంకాలను చర్చించిన జాజుల గౌరి ‘దస్తకత్’ కథ కానివ్వండి.మీరూ మీ నాన్నగారు కథలను అనువదించే పనిని ఎలా పంచుకున్నారు?మేము ఈ సంకలనంలోని కథల ఎంపిక కోసం వందకుపైగా తెలుగు కథలు చదివాం. అనువదించే ముందు ఇద్దరికీ ఆ కథ నచ్చాలి. మొదటి విడత అనువాదాన్ని నాన్న చేస్తారు. తర్వాత నేను తెలుగు మూలం దగ్గర పెట్టుకుని దాన్ని చదువుతాను. ఇద్దరం ప్రతి ఒక్క పేరా పైన చర్చిస్తాం. తర్వాత నేను ఆ అనువాదాన్ని సవరించి మళ్లీ ఆయనకు ఇస్తాను. ఆయన దాన్ని అంతిమంగా సవరించాక, నేను పలుమార్లు చదివి, మూలానికి దగ్గరగా ఉండేలాగాను, పఠనీయత బాగుండేలాగాను మెరుగుదిద్దుతాను. ఫైనల్ కాపీపై ఇద్దరం ఏకాభి ప్రాయానికి వచ్చాక పబ్లిషర్‌కు పంపిస్తాం.