తెలంగాణ సాహిత్య అకాడమీ రెండో చైర్మన్‌గా ఎంపికైన సందర్భంగా జూలూరి గౌరీశంకర్‌తో ‘వివిధ’ చేసిన సంభాషణ.

తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా ఎంపికైనందుకు అభినందనలు. సాహిత్యం వైపు మీ ప్రయాణాన్ని గురించి చెప్పండి?

మాది నడిగూడెం. మేము వడ్రంగి వాళ్లం. వడ్ల బజారులో మా చినతాత పోతులూరి వీరబ్రహ్మంగారి విగ్రహం తయారు చేసి దేవాలయం కట్టాడు. చిన్నప్పుడు ఆ భజనలు చేసుకుంటూ బ్రహ్మంగారి తత్వాలు, కీర్తనలు నేర్చుకున్నాను. మా నాయన రామాయణ కురుక్షేత్ర పద్యాలు అద్భుతంగా పాడేవాడు. ఆయన శైవభక్తుడు కాబట్టి నాకు గౌరీ శంకర్‌ అని పేరు పెట్టాడు. నుదుటిన విబూది, కుంకం బొట్లతోనే నేను 1976-77 ప్రాంతంలో ఇంటర్మీడియట్‌ చదువుకోసం కె.ఆర్‌.ఆర్‌ కాలేజీలో అడుగు పెట్టాను. అక్కడ ‘విప్లవాల యుగం మనది విప్లవిస్తే జయం మనది’, ‘ఎరుపెక్కిన మట్టికి క్రొన్నెత్తుటి లాల్‌ సలామ్‌’ లాంటి నినాదాలు తొలిసారి విన్నాను. అలా ఆ కాలేజీలోనే వామపక్ష ఉద్యమాల ప్రభావం నాపై పడింది. నా దస్తూరీ బాగుండటంతో ఒకాయన నన్ను చేయి పట్టుకుని తీసుకుపోయి ‘‘చాలా బాగా రాస్తున్నావు, మనం ‘వాల్‌ జర్నల్‌ ఆఫ్‌ పీడీఎస్‌యూ’ అని ప్రతి వారం ఫోకస్‌ పెడుతున్నాం, అది నువ్వే రాయాలి,’’ అన్నాడు. ఇల్లస్ట్రేటెడ్‌ వీక్లీలో వచ్చే జాతీయ వార్తల్ని కట్‌ చేసి తెలుగులో అనువదించి చేసి రాస్తే మా కాలేజీ అంతా గోడలపైకి ఎగబడి చదివేది. ఇది నా అక్షర యాత్రకి ఆరంభంగా చెప్పుకోవచ్చు. తర్వాత ‘ముత్యాలముగ్గు’ సినిమాకి మాటలు రాసిన ఎమ్వీయెల్‌ ఒకసారి కాలేజీకి వచ్చి కవిత్వ అభివ్యక్తి గురించి మాట్లాడాడు. అలిశెట్టి ప్రభాకర్‌ ‘వేశ్య’ కవిత గురించి మాట్లాడాడు. ‘‘తాను పుండై/ ఇతరులకు పండై/ తాను శవమై/ ఇతరులకు వశమై...’’ ఇదంతా అప్పటి ఇంటర్మీడియెట్‌ విద్యార్థినైన నాపై చాలా ప్రభావం చూపించింది. ‘కవిత్వం అంటే ఇలా ఉంటుందా’ అనిపించింది. మా కాలేజీ సెమినార్లకు, మా ప్రాంతంలో జరిగే సదస్సులకు విప్లవ కవులూ రచయితలూ వచ్చి ప్రసంగించేవారు. వీరితో పాటు మాకు తెలుగు చెప్పే పంతుళ్లూ... అన్నిటినీ మించి నా బహుజన జీవితం... ఈ ప్రేరణలన్నీ కలిసి నన్ను కవిత్వం వైపు నడిపించాయి. తెలుగులో అత్యధికంగా ముప్ఫైకి పైగా దీర్ఘ కవితలు రాసినవాడిని నేనే. కవిత్వమేగాక వందల కొలది సాహిత్య విమర్శ, సామాజిక వ్యాసాలు రాశాను.

ఈ విప్లవోద్యమ ప్రభావం నుంచి దళిత బహుజన కవిత్వం వైపు అడుగులెలా పడ్డాయి?

ఎస్‌.కె. యూనివర్సిటీ నుంచి 1985లో నా ఎమ్మే పూర్తి చేశాను. తర్వాత పదేళ్ళపాటు పార్ట్‌టైమ్‌ లెక్చరర్‌గాను, జర్నలిస్టుగాను పని చేశాను. 1991లో ఖమ్మం జిల్లా పగిడేరులో ఒక ఎన్‌కౌంటర్‌ జరి గింది. ఒక్కసారే పద్నాలుగు మందిని కాల్చేశారు. ఆ సంఘటన గురించి ఆనాటి దినపత్రికల్లో వచ్చిన నెత్తురుముద్దల్లాంటి వార్తలు నన్ను చాలా కలచివేశాయి. ఆ రోజు ఎగ్జామినేషన్‌ హాల్లో విద్యార్థులేమో పరీక్ష రాస్తుంటే నేను అంతకంటే దీక్షగా ఒకే విడతలో గుక్కపట్టినట్టు ఒక దీర్ఘకవిత రాశాను. ‘ఎలియాస్‌’ దాని పేరు. ‘‘ఆకలి ఎలియాస్‌- ఆయుధాలు... ఆయుధాలు ఎలియాస్‌- ప్రజలు...’’ ఇలా సాగుతుందది. దాన్ని పుస్తకంగా నేను పాఠాలు చెప్తున్న కాలేజీలోనే శివారెడ్డి ఆవిష్కరించారు. ఆ మరుసటి ఏడాదే ‘పాద ముద్ర’ అని మరో దీర్ఘ కవిత రాశాను. అప్పుడే ఉత్తర ప్రదేశ్‌లో బీఎస్పీకి సంబంధించిన సంకేతాలు, దేశవ్యాప్త పరిణామాలు, అంబేడ్కర్‌-ఫూలేలను అప్పుడప్పుడే చదువుకోవటం వీటన్నిటి నేపథ్యంలో- శ్రమ కోణం నుంచి దళిత తాత్వికతను చెబుతూ ఆ కవితను రాశాను. ‘‘కోడికంటే ముందే లేచిన కాళ్లూ చేతులూ సరాసరి గొడ్లకొట్టంలోకే పోయాయి’’ అని మొదలవుతుంది. మొదట ‘పాదముద్ర’పై ఆంధ్రజ్యోతిలో రాచపాళెం చంద్రశేఖరరెడ్డి ‘దళిత కవితా ముద్ర ‘‘పాదముద్ర’’’ అన్న సుదీర్ఘ విశ్లేషణా వ్యాసం రాశారు. అది ఒక మలుపు. గుంటూరు లక్ష్మీనరసయ్య అప్పుడే దళిత సాహిత్య విమర్శవైపు వస్తున్నాడు. ఆయన దళిత సాహిత్య విమర్శకుడిగా తొలి ముందుమాట రాసింది నా ‘పాదముద్ర’కే. అప్పట్లో ఆయన ప్రతివారం ఆంధ్రజ్యోతిలో కవిత్వం గురించి రాసేవాడు. ఒక వారం నా కవిత గురించి ‘‘కొన్ని మినహాయింపు లున్నప్పటికీ, జూలూరి రాసిన ‘పాదముద్ర’ దళిత కవిత్వానికి మేనిఫెస్టోగా చెప్పుకోవచ్చు’’ అని రాశాడు. దానికి సతీష్‌ చందర్‌ రియాక్ట్‌ అయ్యాడు. ‘‘ఎవరో విశ్వబ్రాహ్మణుడు రాస్తే అది దళిత కవిత్వం ఎలా అవుతుంది. దానికి ఇంకెవరో నాయీ బ్రాహ్మణుడు విమర్శ రాస్తే అది దళిత విమర్శ ఎట్లా అవుతుంది’’ అన్నాడు. తర్వాత 1995లో వచ్చిన ‘చిక్కనవుతున్న పాట’ సంకలనంలో 32 పేజీల ‘పాదముద్ర’ని యథాతథంగా వేశారు. ఆ పుస్తకాన్ని సంకలించే పనిలో కోదాడ నుంచి నా వంతు భూమికని నేను నిర్వహించాను. ఆ పుస్తకం వచ్చిన తర్వాత దాన్ని నేను సతీష్‌ చందర్‌కి తీసుకు పోయి ఇచ్చాను. ‘‘బావుంది గౌరీశంకర్‌ మీరు రాయటం. కానీ ఎవరి ఫీలింగ్స్‌ వారు రాయాలి గానీ, మా ఫీలింగ్స్‌ నువ్వెట్లా రాస్తావు’’ అన్నాడు. ‘‘నేను చూసిందానికి నేను రియాక్ట్‌ అయి రాశాను సర్‌. కానీ మీరన్నది కూడా కరెక్టే. నా మూలాల్ని నేను రాసుకుని మళ్లీ మీ దగ్గరకు వస్తా’’ అని వెళ్లిపోయాను. తర్వాత ఆరేళ్లకు 2001లో ‘వెంటాడే కలాలు-వెనుకబడిన కులాలు’ పేరుతో 200పేజీల సంకలనాన్ని తీసుకువచ్చాను. అది 29కులాలను ఐక్యం చేస్తూ బహుజన దృక్పథంతో వచ్చిన తొలి పుస్తకం. అది తీసుకు పోయి సతీష్‌ చందర్‌కి ఇచ్చాను.