యవ్వన దశ నుండే ఆత్మాన్వేషణ చేస్తూ ఆధ్యాత్మిక,అలౌకిక జీవితరసారందానికి దగ్గరైన రచయిత జియో లక్ష్మణ్. బాల్యం నుండే పుస్తకమంటే పంచప్రాణాలుగా బతికి స్వదేశీ విదేశీ సాహిత్యం చదువుకుని అనేక ఆధ్యాత్మిక రచనలూ, ప్రవచనాలూ చేసిన దిట్ట. ధ్యానయోగ గురువుగా ఎందరికో ఆరోగ్యాన్ని అందిస్తుండటమే కాకుండా ఎన్నో దిన,వార,మాస పత్రికలలో ఆధ్యాత్మిక రచనలు, నవలు రాస్తున్న నిరంతర సాహితీ పథికుడు. హిందూ సమాజానికి అతి పవిత్రమైన మానస సరోవరం పై ప్రేమ కథా సీరియల్‌ రాసిన రచయిత జియో లక్ష ్మణ్‌.

ఎటో వెళ్ళిపోయిన బాల్యం

నా పూర్తి పేరు పొట్నూరు ఆనందసాయి జగన్నాథ్‌. శార్వర నామ సంవత్సరం 1960 వైశాఖ మాసం బుద్ధ జయంతి మే 10వ తేదీన పుట్టాను. తల్లితండ్రులు సాంబమూర్తి, నారాయణమ్మ. నలుగురు పిల్లల్లో ఇంటికి పెద్దవాణ్ణి. ఉద్యమకారులు, కళాకారులు, రచయితలు, ఆలోచనాపరులు జన్మించిన పార్వతీపురంలోనే పుట్టాను. కంటికి నచ్చింది కాశ్శీరు. మనసుకు నచ్చింది సొంత ఊరు. మా ఊరంటే నాకు చాలా ఇష్టం. ఆ జ్ఞాపకాల్లో బ్రతుకుతూ ఉంటాను.నేను హైస్కూల్లో చదివేటప్పుడు వ్యాస రచన, వక్తృత్వ పోటీల్లో చాలా బహుమతులు పొందేవాడిని. ఇంటర్మీడియట్‌ వరకు పార్వతీపురంలోనే చదివాను. ఆ సమయంలోనే నాటకాలువేస్తూ ఉత్తమ నటుడుగా రెండుమూడు సార్లు అవార్డులు కూడా సంపాదించుకున్నాను.

ఆంధ్రా విశ్వవిద్యాలయంలో థియేటర్‌ ఆర్ట్‌ ్సలో డిప్లమో చేశాను. 1983 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ టెక్నాలజీ (అప్లయిడ్‌ జియాలజీ)లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాను. అప్పుడప్పుడు పార్వతీపురం వెళ్ళినా అప్పటి స్నేహితులు ఇప్పుడు కనపడరు. ఊరు మారింది. అక్కడ ధూళి, దుమ్ము కూడా ఇష్టమే. పసిడి రెక్కలు విసిరి పారిపోయిన జాడలేవీ... అని శ్రీశ్రీ అన్నట్లు ఆ బంగారు బాల్యం ఎటు వెళ్ళిపోయిందో....?

సాహిత్య పఠనం

చిన్నప్పటి నుండీ కథల పుస్తకాలు, పత్రికలు తెగ చదివేవాడిని. గ్రంథాలయాలు, పుస్తకాల దుకాణాలు కనబడితే నా పంట పండినట్టే. వెంటనే వాటిల్లోకి దూరిపోయేవాడిని. బాహ్య ప్రపంచం మరిచిపోయేవాడిని. నా చేతుల్లో పుస్తకం లేకుండా నన్ను చూడటం అరుదు అని చాలా మంది మిత్రులు అంటూ ఉండేవారు.కొమ్మూరి సాంబశివరావు, టెంపోరావు, గిరిజశ్రీ భగవాన్‌, మధుబాబు డిటెక్టివ్‌ నవలలతో మొదలు పెట్టి చలం, రావిశాస్త్రి, కొడవటిగంటి, మధురాంతకం, కారా, తెన్నేటి సూరి, కరుణకుమార, చింతా దీక్షితులు, శ్రీపాద, పురాణం,సై ్మల్‌, వాకాటి, జగన్నాథశర్మ తదితరుల రచనలు చదివాను.ఆంగ్ల సాహిత్యం చాలా ఇష్టం. మార్గరెట్‌ మైఖేల్‌, అయాన్‌ రాండ్‌, ఇర్వింగ్‌ వేలన్‌, జేమ్స్‌ హాడ్లీ చేజ్‌, రాబర్ట్‌ లుడ్‌లుమ, ఎర్నెస్ట్‌ హెమ్మింగ్వే, ఐజాక్‌ ఏసిమోల్‌, అగథాక్రిస్టీ, సిడ్నీ సెల్డన్‌, రాబిన్‌కుక్‌, జెఫ్రీ ఆర్చర్‌ల పుస్తకాలు చదివాను. కొన్ని సంవత్సరాలు ఏమీ రాయకుండా ప్రపంచ సాహిత్యం చదివాను. నోబెల్‌ అవార్డులు వచ్చిన రచయితల ఆటోబయోగ్రఫీలు చదివాను.

తొలి రచన

గురజాడ, చాసో వంటి మహామహులు తిరిగిన విజయనగరంలో నేను పెద్ద చెరువు, కోనేరు గట్టు, లంక వీధి, తుపాకుల వీథి, బొంకుల దిబ్బ లాంటి ప్రదేశాల్లో హాయిగా విహరించిన బాల్యం నాది.