అనగనగా రత్నపురం. అక్కడ రామకృష్ణుడు అని బాగా తెలివితేటలు గల ఓ వ్యక్తి ఉండేవాడు. తన తెలివితేటలతో ఎదుటి వ్యక్తుల్ని బురిడీ కొట్టించి బతుకుతుండేవాడు. చిన్న చిన్న బురిడీలతో రెండు పూటలా భోజనం, వేలకొలదీ వరహాలు మాత్రమే సంపాదించుకోగలిగేవాడు. ఇది సరికాదనుకున్నాడు. ఉన్న తెలివితేటలతో డబ్బు బాగా సంపాదించాలి. కోటీశ్వరుడైపోవాలని కలలుగన్నాడు. కన్న కలలను నిజం చేసుకునేందుకు ప్రయత్నించసాగాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఒకనాడు పెద్ద వర్తకునిలా వేష భాషలు మార్చుకుని రాజద్వారం దగ్గర నిల్చున్నాడు. భటులు అతన్ని చూశారు.‘‘ఎక్కణ్ణుంచి వచ్చారయ్యా మీరు’’ అడిగారు.‘‘సింహపురి నుంచి వచ్చాను. నా పేరు రామకృష్ణుడు. రత్నాల వ్యాపారిని. రాజుగారిని చూడాలనుకుంటున్నాను. అనుమతి ఇస్తారా’’ అడిగాడు.‘‘అనుమతి ఇవ్వాల్సింది మేము కాదు, రాజుగారివ్వాలి. అడిగి చూస్తాం’’ అన్నారు భటులు. వెళ్ళి రాజుగారిని అడిగారు.‘‘ప్రవేశపెట్టండి’’ అనుమతించాడు రాజు.

రామకృష్ణుడు ఆనందంగా ప్రవేశించాడు. రాజుకి రత్నాల హారాన్ని కానుకగా అందజేశాడు. చూశాడు రాజు దాన్ని. బాగున్నదని మెచ్చుకున్నాడు.‘‘చెప్పండి! నన్నెందుకు చూడాలనుకున్నారు’’ అడిగాడు రాజు.‘‘ఆ విషయం మీతో ఏకాంతంగా మాట్లాడాలి’’ అన్నాడు రామకృష్ణుడు.‘‘మాట్లాడండి’’ అంటూ తన ఏకాంత మందిరానికి దారి తీశాడు రాజు. అతన్ని అనుసరించి వచ్చాడు రామకృష్ణుడు.‘‘చెప్పండి ఏం మాట్లాడదలచారు’’ అడిగాడు రాజు.‘‘ఇంకేం లేదు మహాప్రభూ! మీరు నాకో చిన్న సాయం చెయ్యాలి’’‘‘తప్పకుండా చేస్తాం. ఏం కావాలో కోరుకోండి’’‘‘సభలో అందరూ చూస్తుండగా మీరు నాతో ప్రతి రోజూ ఓ క్షణం మాట్లాడాలి. నేను అడిగినప్పుడు మాట్లాడాలి. ఇది నా ప్రార్థన’’ అన్నాడు రామకృష్ణుడు.‘‘ఏం మాట్లాడాలి’’‘‘ఏదో ఒకటి...నా చెవిలో ఒకటి రెండు అంటూ పదివరకు అంకెలు లెక్కపెట్టండి చాలు! అయితే అవి నాకు మాత్రమే వినిపించాలి’’ అన్నాడు రామకృష్ణుడు. చిత్రంగా ఉందే ఇతని కోరిక అనుకున్నాడు రాజు. నవ్వొచ్చిందతనికి. నవ్వుకున్నాడు. ‘సరే’నన్నాడు.‘‘మీరు ఊరికే అంకెలు లెక్కపెట్టనవసరం లేదు. మీరు నా చెవిలో పది అంకెలు లెక్కపెట్టినందుగ్గాను మీకు రోజూ నేను అయిదు వందల వరహాలిచ్చుకుంటాను’’ అన్నాడు రామకృష్ణుడు.‘‘బాగుందిది’’ అని పగలబడి నవ్వాడు రాజు.