మానవ సమాజంలో స్థూలంగా రెండురకాల వారుంటారు. లోకం కోసం తను వున్నానని విశ్వసించి నడచుకునేవారు, తనకోసమే లోకం వుందని ప్రవర్తించేవారు. అలాగే తాను అనుసరించిందే ‘‘ధర్మం’’ అని భావించేవారు, అసలుసిసలు ధర్మాన్ని గుర్తించి అనుసరించే వారు మనలోనే వున్నారు. మహాభారతంలో ‘‘ధర్మం’’ అనే ఏకసూత్రం అంతర్లీనంగా వుంది. దానిని పాటించే వారిని, పాటించని వారిని గమనించే ‘‘విధాత’’ పాత్ర శక్తివంతంగా సందర్భాన్ని బట్టి పని చేస్తుంది. ‘‘కాలం’’ మరొక ఆయతనంగా తన పని తాను చేసుకుంటూ పోతుంది. కాలానికి నిర్దిష్టమైన ఒక ప్రణాళిక వుంటుంది. సన్నివేశాలన్నీ ఆ ప్రణాళిక క్రమంగా జరగడానికి వీలుగా నడుస్తూ వుంటాయి.
మనుషుల రాగద్వేషాలు, బలహీనతలు సన్నివేశాలను నడిపిస్తాయి. దాని పర్యవసానమే కురుక్షేత్ర మహాసంగ్రామం.త్రేత, ద్వాపర యుగాల సంధికాలంలో అవతార మూర్తిగా ఆవిర్భవించినవాడు పరశురాముడు. అప్పటికే అహంకరించి, దుష్కర్మలకు పాల్పడుతున్న రాజవంశాలను పరశురాముడు నాశనం చేశాడు. ఆ రక్తంతో తన పెద్దలకు తర్పణలు అర్పించాడు. ఆ రుధిర ధారలతో ఏర్పడిన రక్తపు మడుగులకు శమంతక పంచకమనే పేరు వచ్చింది. ఆ నెత్తుటి గడ్డే తర్వాత కురుక్షేత్రం అయింది.ద్వాపర యుగంలో జరిగిన యీ మహాసంగ్రామంలో పద్ధెనిమిది అక్షౌహిణీల సైన్యం ప్రాణాలు కోల్పోయింది. అసలు నాటి అక్షౌహిణికి బలం ఎంత? ఒక రథం, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురు భటులు కలిగిన బృందాన్ని ‘‘పత్తి’’ అంటారు. అలాంటి పత్తి సమూహాలు మూడు కలిస్తే ఒక ‘‘సేనాముఖం’’. మూడు సేనాముఖాలు ఒక గుల్మం. మూడు గుల్మాలు ఒక ‘‘గణం’’. మూడు గణాలు కలిస్తే ఒక ‘‘వాహిని’’. మూడు వాహినులొక ‘‘పృతన’’. మూడు పృతనలొక ‘‘చము’’. మూడు చములొక ‘‘అనీకిని’’. పది అనీకినులు కలిస్తే ఒక అక్షౌహిణి. అంటే అక్షౌహిణిలో ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై రథాలు, అంతే సంఖ్యలో ఏనుగులు, మూడింతలు గుర్రాలు, లక్షాతొమ్మిది వేల మూడు వందల యాభైమంది సైనికులు వుంటారు. దీనిని బట్టి వివిధ బలాలు, సైనికులు ఎందరు నశించారో తెలుసుకోవచ్చు. కేవలం పద్ధెనిమిది రోజులు జరిగిన యుద్ధం యిది.అయితే, రెండవ ప్రపంచ యుద్ధం వల్ల జరిగిన జన నష్టంతో పోలిస్తే, కురుక్షేత్రంలో చనిపోయిన వారు తక్కువే. రెండో ప్రపంచయుద్ధంలో సైనికులు, సామాన్యులు వెరసి ఏడుకోట్ల ఇరవై లక్షల మంది మరణించారని అంచనా. ఇందులో సిపాయిలు, యుద్ధఖైదీలు, సామాన్యప్రజలు, యుద్ధం వల్ల దాపురించిన కరువు కాటకాలవల్ల మరణించిన వారు వున్నారు. యుగాలు మారినా మానవ నైజాలలో, ప్రవృత్తులలో పెద్దగా మార్పులు రావని మనకు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే మన ప్రాచీన ఇతిహాసాలు నేటికీ చెలామణీ అవుతున్నాయి.మహాభారతగాథ ఒక మహాప్రవాహం. ధర్మాధర్మాల మధ్య సంఘర్షణ.
(ఉద్యోగ, విరాట పర్వాలు: శ్రీరమణ)