ఇంద్రుని దోసిట కర్ణుని కవచ కండలాలు
పాండవుల క్షేమం కోరి ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి, కవచ కుండలాలు అర్థిస్తాడని కర్ణుడికి చెప్పాడు సూర్యుడు. వాటిని ఇవ్వొద్దన్నాడు. అడిగింది ఇవ్వడం తన వ్రతం అని, ఇవ్వడం తప్పదని చెప్పాడు కర్ణుడు.‘అయితే ఇంద్రుని వద్ద అమోఘమయిన శక్తి ఉన్నది. దానిని నువ్వు అర్థించు’ చెప్పాడు సూర్యుడు. ‘సరే’నన్నాడు కర్ణుడు.సూర్యుడు చెప్పినట్టుగానే ఒకనాటి మధ్యాహ్నం బ్రాహ్మణ వేషంలో కర్ణుని సమీపించి ‘భిక్షాందేహి’ అన్నాడు ఇంద్రుడు.‘భూసురోత్తమా! కోరుకో! ఏం కావాలి? సుందరీమణులు కావాలా? సువర్ణరాసులు కావాలా? గోసమూహాలు కావాలా? ఏం కావాలి నీకు’ అడిగాడు కర్ణుడు.‘దానకర్ణా? నాకు అవేవీ అక్కరలేదు. నాకు కావాల్సింది నీ సహజ కవచ కుండలాలు’ అన్నాడు ఇంద్రుడు.‘ధన కనక వస్తు వాహనాలు కోరుకో! ఈ కవచ కుండలాలు నీకెందుకయ్యా’ నవ్వాడు కర్ణుడు.‘నాకు అవే కావాలి’ పట్టుబట్టాడు ఇంద్రుడు.‘ఈ కవచ కుండలాలు నాకు పుట్టుకతో వచ్చాయి. ఇవి లేకపోతే యుద్ధంలో నేను ఓడిపోతాను. అందుకనే చెబుతున్నాను. కావాలంటే ఈ రాజ్యాన్ని తీసుకో! ఈ కవచ కుండలాలు మాత్రం కోరుకోకు’ ప్రార్థించాడు కర్ణుడు. అయినా ఇంద్రుడు మాట మార్చలేదు. తనకి కవచ కుండలాలే కావాలన్నాడు.‘నువ్వెవెవరో నాకు తెలుసు మహేంద్రా! బ్రాహ్మణ రూపంలో నీ నాటకం చాలించు! అయినా ముల్లోకాధిపతివి. నిన్ను నేను అడగాలి కాని, నువ్వు నన్ను అడగడం భావ్యమా చెప్పు’ అన్నాడు కర్ణుడు. ఆ మాటలకు ఇంద్రుడు తలవంచుకున్నాడు.‘సూర్యుడు చెప్పిన మీదట నేనెవరో నీకు తెలిసిపోయింది. ఇక దోబూచులు అనవసరం. కర్ణా! నేను అడుగుతున్నాను. నాకు నీ కవచ కుండలాలు కావాలి. ఇస్తున్నావా? లేదా’ ప్రశ్నించాడు ఇంద్రుడు.‘మహేంద్రుడంతటి వాడు అడిగితే నేను కాదంటానా! తీసుకో! కాకపోతే వాటికి బదులుగా నీ శక్తి నాకు కావాలి. కనికరించి ప్రసాదించు’ అడిగాడు కర్ణుడు.‘తప్పక ప్రసాదిస్తాను. అయితే నా శక్తి శత్రుమూక నంతటినీ చీల్చి చెండాడి నన్ను చేరుతున్నది. అయితే ఆ విధంగా నీకది నేనివ్వలేను. నీ శత్రువు ఎవరో ఒకర్నే అది నిర్మూలించి నన్ను చేరగలదు. ఆ రకంగా కావాలంటే తీసుకో’ అన్నాడు ఇంద్రుడు.‘చాలు మహేంద్రా చాలు! నా చిరకాల శత్రువు ఒక్కడే! వానిని అది అంతమొందిస్తే చాలు’ అన్నాడు కర్ణుడు.‘నీ చిరకాల శత్రువు అర్జునుడు. వానిని అంతమొందిస్తే చాలనుకుంటున్నావు. కాని, అది ఆసాధ్యం. శ్రీమన్నారాయణుడే అర్జునుని సంరక్షకుడు అయినప్పుడు వానిని నువ్వేమీ చేయలేవు’ చెప్పాడు ఇంద్రుడు.‘ఆ సంగతి తర్వాత. ముందీ సంగతి చెప్పండి. నా కవచ కుండలాలు నా నుంచి వేరు చేసినప్పుడు నా శరీరం వికృతంగా కానవస్తుందేమో! దాని గురించి ఒక్కసారి ఆలోచించండి’ అన్నాడు కర్ణుడు.
‘నీకా భయం అక్కరలేదు. నీ శరీరం వికృతం కాదు. పైగా మరింతగా ప్రకాశిస్తుంది’ అభయమిచ్చాడు ఇంద్రుడు. తన శక్తిని కూడా కర్ణుడికి ఇచ్చాడు.‘ఈ శక్తిని ఆపత్కాలంలోనే ప్రయోగించాలి. ఎప్పుడు పడితే అప్పుడు ప్రయోగించరాదు’ అని హెచ్చరించాడు.‘నీ మాట నాకు వేదవాక్యం’ అని, ఆలస్యం చేయకుండా తన సహజ కవచ కుండలాలను ఛేదించి ఇంద్రునికి అర్పించాడు. అందుకు కర్ణుని అభినందిస్తూ కిన్నరులు, సిద్ధులు, సాధ్యులు అతనిపై పూలవాన కురిపించారు. కవచ కుండలాలందుకుని ఇంద్రుడు అక్కణ్ణుంచి అదృశ్యమయినాడు. ఈ సంగతి తెలుసుకుని పాండవేయులు ఆనందపడితే, కౌరవులంతా బాధపడ్డారు.్‌్‌్‌ద్వైతవనంలో ధర్మరాజు తమ్ములతో కూర్చుని ఉండగా అక్కడకు పరుగు పరుగున ఓ బ్రాహ్మణుడు వచ్చాడు.‘ధర్మరాజా! నా అరణిని ఒక చెట్టుకొమ్మలో దాచుకున్నాను. ఇందాక ఓ దుప్పి వచ్చి ఆ చెట్టుకొమ్మను అందుకోగానే దాని కొమ్ముల్లో నా అరణి ఇరుక్కుంది. అదలిస్తే అది అడవిలోకి పారిపోయింది. అరణి లేకపోతే నా నిత్యవిధులు సాగవు. కరుణించి నా అరణిని నాకు అందించగలరు’ అని వేడుకున్నాడు.