‘‘మహర్షుల మాటలు పొల్లుపోవు’’ అన్నాడు కృష్ణుడు. తనతో పాటుగా పాండవేయుల్ని ముందుకు నడిపించాడు. దుర్యోధనుని భవంతిలో ఉన్న కాంచన రాసుల్నీ, కమనీయ ఆభరణాల్నీ, నవరత్న సమూహాల్నీ చూశారంతా. స్వాధీనం చేసుకున్నారు వాటిని. రథ గజాశ్వ సమూహాల్ని కూడా చేజిక్కించుకున్నారు. మోకరిల్లిన దాసదాసీజనులకు అభయాన్ని ప్రసాదించి విశ్రమించాలనుకున్నంతలో ధర్మరాజుతో కృష్ణుడిలా అన్నాడు.‘‘ఇక్కడీ రాత్రి విశ్రమించడం నాకెందుకో ఇష్టం లేదు. మనందరం వేరే చోట విశ్రమించడం శ్రేయస్కరమనిపిస్తోంది. పదండి’’కృష్ణుని మాట కాదనలేదెవరూ. బయల్దేరారక్కణ్ణుంచి. ఓఘవతి తీరానికి చేరుకున్నారంతా. అక్కడ విశ్రమించారు.తెల్లగా తెల్లారింది. అర్జునుడు చెప్పిన మీదట భీముడు అధర్మయుద్ధానికి పాల్పడ్డాడని, ఆ కారణంగానే దుర్యోధనుడు మరణించాడని తెలుసుకుని గాంధారీదేవి కుమిలి కుమిలి ఏడ్చింది. క్రోధావేశంతో వూగిపోయింది. కనిపిస్తే పాండవులను శపించినా శపించవచ్చని తెలియడంతో ఆ మహాసాధ్విని శాంతింపజేసేందుకు శ్రీకృష్ణుని సహాయాన్ని అర్ధించాడు ధర్మరాజు.‘‘హస్తినాపురికి ముందుగా నువ్వే వెళ్ళాలి కృష్ణా! ఆ తర్వాతే మేమంతా’’ అన్నాడు. ధర్మరాజు అంతరంగాన్ని తెలుసుకుని, అందుకు అంగీకరించి ప్రయాణమయ్యాడు కృష్ణుడు. హస్తినాపురికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడికి వ్యాసమహర్షి వచ్చి ఉన్నాడు. మరణించినకుమారులను తలచుకుని కన్నీళ్ళు పెట్టుకుని విలపిస్తోన్న ధృతరాష్ట్రుని పరామర్శించడమే గాక గాంధారీదేవిని ఓదార్చాడు కూడా. సముద్రమంత బాధలో వ్యాసుని ఓదార్పు దోసెడంతగా అన్పించి మరింతగా దుఃఖించసాగారు ఆ తల్లిదండ్రులు. ఆ సమయంలో అక్కడికి ప్రవేశించాడు కృష్ణుడు. వ్యాసమహర్షిని చూస్తూనే చేతులెత్తి నమస్కరించాడు. గాంధారీ-ధృతరాష్ట్రులకు కూడా తానొచ్చినట్టుగా నమస్కారాతో తెలియజేశాడు. కన్నీరు పెట్టుకుని విలపిస్తోన్న ధృతరాష్ట్రుని చేయందుకున్నాడు. ఇలా అన్నాడతనితో కృష్ణుడు.‘‘మహారాజా! గత జల సేతు బంధనం వల్ల ప్రయోజనం లేదు. జరిగిందంతా దైవసంకల్పం అనుకుందాం. ఇక జరగాల్సింది ఆలోచిద్దాం. పాండవుల గురించి మీకు నేను ప్రత్యేకించి చెప్పాల్సింది లేదు. వారికి మీరంటే ఎనలేని భయ భక్తులున్నాయి. అనురాగ ఆప్యాయతలున్నాయి. వారిపై కోపగించుకోవద్దు. ఒక్కమాట! మున్ముందు మీకూ, గాంధారీదేవికీ పరలోక క్రియలు ఆచరించాల్సింది పాండవులేనన్నది మరచిపోవద్దు. అందుకయినా వారిని క్షమించి తీరాలి. మిమ్మల్నిలా దుఃఖసాగరంలో ముంచినందుకు ధర్మరాజు ఎంతగానో బాధపడుతున్నాడు. అబద్ధం కాదు, నేను చెబుతున్నది నిజం. తర్వాతర్వాత మీరే అతని గురించి తెలుసుకుంటారు’’‘నిజమే’నన్నట్టుగా తలూచాడు ధృతరాష్ట్రుడు.

కృష్ణుని చేతిలోంచి మృదువుగా తన చేతిని ముందుకు తీసుకున్నాడు. గాంధారీదేవిని చూశాడు కృష్ణుడు. ఆమెతో ఇలా పలికాడు.‘‘మహారాణీ! ఈ లోకంలో నీతో సరితూగగల సుక్షత్రియ కాంతలు లేరు. పాండవులతో సంధికి అంగీకరించమని దుర్యోధనుని ఎంతగా వేడుకున్నావు. విన్నాడా? లేదు. దుర్వార గర్వంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఫలితం...ఇందులో పాండవుల తప్పు లేదమ్మా. నీకీ సంగతి తెలియంది కాదు. వారిపై ఆగ్రహించకు. అపూర్వ తపఃప్రభావశాలి అయిన నువ్వు ఏమాత్రం ఆగ్రహించినా ముల్లోకాలే మట్టిగొట్టుకుపోతాయి. వారెంత? చేతులు జోడించి వేడుకుంటున్నాను. పాండవులను అనుగ్రహించు తల్లీ’’కన్నీళ్ళు తుడుచుకుంది గాంధారీ. తేరుకుంది. కృష్ణుని చేతులు పట్టుకుని ఇలా అంది.‘‘వాసుదేవా! నువ్వన్నది నిజం. ఇక మీదట పాండవులే మాకు దిక్కు. అలాగే నీ సహాయం కూడా మాకు కావాలి. లేకపోతే అంధులం...మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు’’ కొంగులో ముఖాన్ని దాచుకుని దుఃఖించింది మళ్ళీ.‘‘వూరుకోమ్మా! వూరుకో’’ గాంధారీదేవిని ఓదార్చాడు వ్యాసుడు. అంతలో ఎందుకో హఠాత్తుగా అశ్వత్థామ గుర్తుకొచ్చాడు కృష్ణునికి. అంతే! ఆందోళన చెందాడతను. ఇలా అన్నాడు.‘‘మహారాజా! పాండవులంటే అశ్వత్థామ రోషావేశంతో రాజుకుంటున్నాడు. వారిని తుదముట్టించేందుకు అతడెంతకయినా తెగిస్తాడనిపిస్తోంది. నేను వెంటనే పాండవులను కలుసుకోవాలి. మరి నాకు శలవు’’ధృతరాష్ట్రుని దగ్గర శలవు తీసుకుని అక్కణ్ణుంచి బయల్దేరాడు కృష్ణుడు.