సంతోషించాడు కృష్ణుడు. ఆప్యాయంగా మహారాజు చేతులందుకున్నాడు. అర్జున నకుల సహదేవులు ఇక్కడే ఉన్నారని చెప్పి, అశీస్సులందజేయమన్నాడు. అలాగేనంటూ పాండుకుమారులను దగ్గర గా తీసుకుని అశీస్సులందజేశాడు ధృతరాష్ట్రుడు.‘‘నీ వైశ్యా తనూజుడు యుయుత్సుడు కూడా ఇక్కడే ఉన్నాడు మహారాజా’’ చెప్పాడు కృష్ణుడు.‘‘ఏడీ? ఎక్కడ’’ చేతులు జాచాడు ధృతరాష్ట్రుడు.కృష్ణుడు ఆజ్ఞాపించడంతో ధృతరాష్ట్రుని సమీపించాడు యుయుత్సుడు.‘‘తండ్రీ’’ అని చేతులు జోడించాడు. అతన్ని దగ్గరగా తీసుకున్నాడు ధృతరాష్ట్రుడు. అశీర్వదించాడు.‘‘అంతా వెళ్ళి గాంధారీదేవిని ఓసారి కలసి రండి’’ అన్నాడు.కృష్ణునితో పాటుగా గాంధారీదేవిని సమీపించారు పాండవులు. నమస్కరించారామెకు. తనని పరామర్శించేందుకు ధర్మరాజు వచ్చాడని తెలుసుకుని కోపాన్ని పట్టలేకపోయింది గాంధారి. అతన్ని శపించేందుకు సిద్ధపడింది. అంతలో వ్యాసమహర్షి వచ్చాడక్కడికి. గాంధారిని వారించాడిలా.‘‘తప్పమ్మా! వద్దొద్దు! శపించొద్దు’’‘‘మహర్షీ’’‘‘అవునమ్మా! పరమ ధర్మాత్ముడు ధర్మరాజు. అతన్ని శపించడం అంటే పాపాన్ని మూటగట్టుకున్నట్టే! వూరుకో’’ అన్నాడు వ్యాసుడు.‘‘గుర్తుందామ్మా! నీ కొడుకు దుర్యోధనుడు, విజయార్ధిగా నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేమన్నావు? ‘ధర్మం గెలుస్తుంద’న్నావు. నువ్వన్నట్టుగానే ధర్మమే గెలిచింది. పాండవులు విజయులయ్యారు. గెలిచారంటే...పాండవులు పరమ ధర్మాత్ములని అర్థం. అందువల్ల కోప తాపాలు మానుకుని పాండవుల్ని ఆదరించు. పిల్లల్ని తల్లి శపించకూడదమ్మా! పాండవులకు నువ్వు పెద్దమ్మవు. అది గుర్తుపెట్టుకో’’ అన్నాడు వ్యాసుడు.

‘‘పెద్దమ్మనే! కాదనను. కాని, పిల్లల అకృత్యాలు చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. కృష్ణుని సమక్షంలోనే నాభి దిగువ ప్రదేశంలో కొట్టి దుర్యోధనుని నేల కూల్చాడు భీముడు. ఇది ధర్మమా’’ గాంధారీదేవి కన్నీటికి అంతు లేకుండా పోయింది. భీముణ్ణి చూశాడు వ్యాసుడు. మాట్లాడన్నట్టుగా సైగ చేశాడు. దాంతో గాంధారీదేవి ముందు చేతులు కట్టుకుని ఇలా అన్నాడు భీముడు.‘‘ధర్మమో అధర్మమో విపరీత ప్రాణ భయం వల్లే దుర్యోధనుని ఆ విధంగా నేల కూల్చాను తల్లీ. తప్పయితే క్షమించు’’‘‘ఆనాడు నిండుసభలో తన అంకపీఠమ్మీద ద్రౌపదిని కూర్చోమని దుర్యోధనుడు తొడగొట్టినప్పుడు, ఆ తొడలు తుత్తునియలు చేస్తానని నేను ప్రతిజ్ఞ చేశాను. నాటి ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాను. అంతే తల్లీ’’ అన్నాడు మళ్ళీ.‘‘దుర్యోధనుని చంపడం ప్రతిజ్ఞ అంటున్నావు. ఒప్పుకుంటాను. దుశ్శాసనుని గుండెలు చీల్చి చంపడం, దోసిళ్ళతో నెత్తురు తాగడం...నీకేమయినా భావ్యంగా ఉందా? మనిషివై పుట్టి రాక్షసుడిగా ప్రవర్తించావు కదయ్యా’’ చేతుల్లో ముఖాన్ని దాచుకుని రోదించింది గాంధారి.‘‘దుశ్శాసనునలా చంపడం కూడా ప్రతిజ్ఞే తల్లీ! అయితే అతని రక్తాన్ని నేనేమీ దోసిళ్ళతో తాగలేదు. పెదవితో స్పృశించానంతే! అది కూడా కౌరవసేనను భయకంపితుల్ని చేద్దామనే ఉద్దేశంతోనే ప్రవర్తించానలా. తప్పయితే క్షమించు తల్లీ’’ అన్నాడు భీముడు.‘‘మహారాజూ నేనూ ఇద్దరమూ అంధులమే కదయ్యా! ఈ అంధులకు ఊతకర్రగా ఒక్కణ్ణి కూడా మిగల్చక అందర్నీ పొట్టన పెట్టుకున్నావు. ఇదేమయినా న్యాయంగా ఉందా? నూరుగురూ నీకు శత్రువులేనా? ఒక్కరు కూడా నీకు మిత్రుడు కాలేకపోయాడా? లేకపోతే ముందు ముందు మీ అన్న ధర్మరాజు పట్టాభిషేకానికి వాడడ్డొస్తాడని ఊహించి అంతం చేశావా’’ అడిగింది గాంధారి. సమాధానాన్ని భీముడు వెతుక్కొంటుంటే కల్పించుకున్నాడు ధర్మరాజు.‘‘అమ్మా! నీ నూరుగురు పుత్రులనూ చంపించింది నేను. నేనే మహా పాపాత్ముణ్ణి. నా మీద జాలిపడకు. శపించు. బంధు మిత్రులందర్నీ కోల్పోయి అనాథలా ఉన్నాను. నాకు తగిన శిక్ష విధించు’’గాంధారీదేవి కాళ్ళ మీద పడ్డాడు ధర్మరాజు. కాబోయే మహారాజు కాళ్ళ మీద పడడంతో ‘తప్ప’న్నట్టుగా వెనక్కి జరిగింది గాంధారీదేవి. ఆ జరగడంలో కళ్ళకు కట్టుకున్న గుడ్డ కొంచెం చెదిరింది. అప్పుడు గాంధారీదేవి చూపు ధర్మరాజు పాదాలపై పడింది. అంతే! ధర్మరాజు పాదాలంటుకున్నాయి. అది చూసి భీమార్జున నకుల సహదేవులు దూరంగా తొలగిపోయారు. కృష్ణుడు ఆందోళన చెంది ధర్మరాజును సమీపించాడు.