నరనారాయణులతో యుద్ధం అసాధ్యం

అర్జునుని శరాఘాతాలను తట్టుకోలేని భీష్ముడు భూతలి మీదికి ఒరిగి విపరీత వేదనతో నిశ్వసించాడు. అది చూచి-‘మహా యోధుడు భీష్ముని మరణం దక్షిణాయనంలోనా’ అని ఆకాశంలోని దేవతలంతా తలలు పట్టుకున్నారు. వారిని గమనించిన భీష్ముడు అల్లన నవ్వి-‘‘దేవతలారా! మీకా ఆందోళన అనవసరం. దక్షిణాయనంలో మృతి మంచిది కాదని నాకూ తెలుసు! అందువల్లనే కొన ఊపిరిన ప్రాణాలు నిలుపు కుంటున్నాను. నా పితృభక్తికి మెచ్చి నా తండ్రి నాకు స్వచ్ఛంద మరణాన్ని ప్రసాదించాడు. ఆ వర ప్రభావంతో మృత్యువును నేను శాసించగలను. నా అనుమతి లేనిదే మృత్యువు నా దగ్గరకు రాదు! రాలేదు’’ అన్నాడు. ఆ మాటలకు దేవతలు ‘అయితే పర్వాలేద’న్నట్టుగా ఊపిరి పీల్చుకున్నారు. అదే సమయంలో కొందరు మునులు కూడా ‘ఇది దక్షిణాయం’ అన్న విషయాన్ని భీష్మునికి వివరించేందుకు హంసల రూపంలో అతన్ని సమీపించారు. వారిని గమనించి-‘నాకు అంతా తెలుసు’ అన్నట్టుగా భీష్ముడు కళ్ళార్చడంతో వారు ఆనంద భరితులై వెళ్ళిపోయారు. ఇదిలా ఉండగా-దుశ్శాసనుడు, రణరంగాన భీష్ముడు ఒరిగిపోయిన సంగతిని ద్రోణునికి వివరించాడు. ఆ వార్త విన్న వెంటనే ద్రోణుడు మూర్ఛిల్లి, కాస్సేపటికి తేరుకుని దుర్యోధనుని చేరుకున్నాడు. అప్పటికి సూర్యాస్తమయం అయింది.-అని సంజయుడు చెప్పడం ఆపడంతో కళ్ళు చెమర్చుకున్న ధృతరాష్ట్రుడు గాద్గదికంగా ‘‘ఎంతటి రాతి గుండె నాది! లేకపోతే ఇంతటి దుర్వార్త విని కూడా నేను బతికి ఉన్నానంటే అర్థం ఉందా చెప్పు? పితామహుడు నేలకి ఒరిగిపోయాడంటే...అయిపోయింది సంజయా! యుద్ధం అయిపోయినట్టే’’ అన్నాడు.

అని అంతలోనే-‘‘శరశయ్యపై గంగానందనుని పరిస్థితి ఎలా ఉన్నదీ వివరించు సంజయా’’ అనడిగాడు.కరకుటమ్ముల మీద భీష్ముడు నిస్త్రాణగా పడి ఉన్నాడు. అతన్ని కౌరవులేగాక పాండవులు కూడా అతి వినీతులై సమీపించారు. తన గాండీవంతో అర్జునుడు పితామహునికి కొద్ది దూరంలో శిరస్సు వంచుకుని చేసిన తప్పుకి సిగ్గుపడుతున్నట్టుగా ఒంటరిగా నిల్చున్నాడు. కురు పాండవ పక్షాలకు చెందిన వారంతా తమ తమ విద్వేషాలనూ, ఉద్వేగాలను మరచి ప్రశాంతంగా తనకు ఇరువైపులా నిల్చొనడాన్ని ఆనందంగా చూసిన శాంతనవుడు, వారిని సముచిత ప్రసంగాలతో అభినందించాడు. తర్వాత దుర్యోధనాదుల వైపు చూసి-‘‘తలగడ ఏర్పాటు చెయ్యండి’’ అని వేడుకున్నాడు. ఆ మాట వినడం ఆలస్యం దుర్యోధనుడు సుతి మెత్తని తలగడలు తీసుకుని రమ్మని పరిచారికులను ఆదేశించాడు. పరిచారికులు అవి తీసుకుని వచ్చేందుకు పరుగులుదీసేంతలో-‘‘నాయనా విజయా! తలగడ ఏర్పాటు చెయ్యి’’ అని అర్జునుని ప్రోత్సహించాడు భీష్ముడు. పితామహునికి అంజలి ఘటించి శరాలు మూడింటిని అభిమంత్రించి అల్లనల్లన ప్రయోగించాడు కిరీటి. అమ్ముల తలగడ రూపొందింది. దానిని అమందానందంగా గమనించి-