అపడపడే వేడెక్కుతున్న ఫాల్గుణమాసపు మధ్యాహ్న పు ఎండలోంచి తెరచి వున్న వాకిలి గుమ్మంలోనుంచి ఫ్యాన్‌ తిరుగుతున్న హాల్లోకి ఉత్సాహపు గాలిలా వస్తూ ‘మమ్మీ... ఉద్యోగం వచ్చేసిందోచ్‌’ అంటూ తన మెడ చుట్టూ చేతులేసి తనని చుట్టేసిన కూతురిని విడిపించుకొంటూ ‘నా మెడ... అబ్బా.. వుండవే... ఏం ఉద్యోగమో ఏమో.. నా ప్రాణం మీదకొచ్చింది. ఏయ్‌.. ఆగు’ అంటూ నందనా నుంచి తనను తాను విడిపించుకుంటూ ‘హా’ అంటూ నోటితో గాలి పీల్చుకుంటూ ‘ఏంటా గోల... కుదురుగా చెప్పలేవ్‌’ అంది మాధవి.‘ఏంటి కుదురుగా చెప్పేది. యిమోషన్‌లెస్‌ గై.. ఆ.. మమ్మీ ఉద్యోగం వచ్చింది అంటూ కాళ్లకి దండం పెట్టాలా... వోల్డ్‌ పిక్చర్‌లోలా.. వోల్డ్‌ మమ్మీ... అని నాలుక బయటపెట్టి నవ్వుతూ వెక్కిరించి అటూయిటూ చూసి టి.వి. చానల్‌ మారు స్తూ క్షణంలో సుడిగాలిలా తిరిగి తల్లిని చుట్టేసి ‘యూ నో... నేనిపడు వుద్యోగస్ధురాల్ని’ అని గట్టిగా అంటుంటే ‘నందూ.. రా.. రా... ముందీ హారతి తీసుకో...’ అంటూ వంటింట్లోంచి హారతి పళ్ళెంతో హాల్లోకి వస్తూ ఫ్యాన్‌ ఆపి ‘రా.. రా.’ అన్నారు వైదేహి. ‘హాయ్‌... గ్రానీ’ అంటూ హారతిని వొద్దిగా కళ్ళకి అద్దుకొంటూ అత్యంత భక్తిశ్రద్ధలతో కళ్లు మూసుకుని మెల్లగా తెరచింది నందన.‘నీకు యింటర్వ్యూ వుందని వుదయమే పూజ చేసిందా. హారతిచ్చి పంపిందా. నువ్వు వెళ్ళినప్పట్నుంచి అమ్మమ్మ దేముడి ముందే కూర్చుని లలితా సహస్రనామాలు చదువుతూనే వుంది’ అంది మాధవి.‘ప్రసాదం తీసుకో’ అన్నారు వైదేహి.ప్రసాదం పళ్ళెం దేముడి దగ్గర తిరిగి పెట్టేస్తూ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ తీసుకొచ్చి యిలా దేముడి దగ్గర పెట్టు’ అన్నారామె.‘ఆర్డర్‌ ఏది’ అడిగింది మాధవి.

‘ఆర్డర్‌ యింకా యివ్వలేదు. యిస్తారు’ అంది నందన.చేతుల తడిని చీరకొంగుతో తుడుచుకొంటూ ‘జీతం ఎంత’ అడిగారు వైదేహి.‘జీతం... నీ పెద్ద మనవరాలు యీ రోజు నుంచి నీ ముద్దుల కూతుర్ని అమ్మా... సినిమాకి డబ్బులు పార్లర్‌కి డబ్బులు, పార్టీకి డబ్బులు అని అడగక్కర్లేదు... యూ నో మామ్‌’ అని తిరిగి తల్లి మెడచుట్టూ చేతులు వేసి తల్లి కళ్లల్లోకి కళ్లు పెట్టి పైపెదవితో కింద పెదవిని నొక్కిపెట్టి ఫ్‌... అంటూ... ‘పదివేలు’ అని కొనబొమలు ఎగరేస్తూ టెన్‌ థౌజండ్‌... వొక్క నెలకి పది వేలు యిలా నెలనెలా పదివేలొస్తాయి. ఏడాది తిరిగేసరికి లక్షా ఇరవైవేలు ఎడమ చేయి బొటనవేలుని తల్లి ముఖం ముందు కింద నుంచి పైకి ఆడిస్తూ ఎడమ కన్ను గీటుతూ ‘సో.. యీ నందన ఏడాదిలోగా లక్షాధికారన్నమాట’ అంటోన్న కూతురితో అబ్బా.. ఆగవే తల్లీ... చాల్లే బడాయ్‌... యింతకీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ ఏది’ అడిగింది మాధవి.

‘చెప్పానుగా వస్తుంది. కొరియర్‌ వారు తెస్తారు. నెట్‌ వారు చూపిస్తారు. ఆకలి... త్వరత్వరగా తినటానికేమైనా పెట్టు’ అంది నందన.‘ముందెళ్లి కాళ్లు చేతులు కడుక్కొచ్చి బాబాకి దండం పెట్టు. అన్నం పెడతా’ అంది మాధవి.నందన మారు మాట్లాడకుండా తల్లి చెప్పిన పనిని భక్తిశ్రద్ధలతో చేసింది.డైనింగ్‌ టేబుల్‌ ముందు కూర్చుంటూ ‘అబ్బా అమ్మమ్మా ఫ్యాన్‌ వేయి. తీసేస్తావ్‌ కాని వేయవు’ అరిచింది నందన.